దోపిడీ చేసిన సొమ్మును ఇంటి వెనుక గోతిలో పాతిపెట్టిన వైనం
గుర్తించిన పోలీసులు
అదుపులో ఓ నిందితుడు
పరారీలో ప్రధాన నిందితుడు
భువనేశ్వర్: దొంగిలించిన సొమ్మును ఏం చేయాలో తెలీక ఇంటి వెనుక గత్తం కింద దాచిపెట్టాడో ప్రబుద్ధుడు. పోలీసులు గుట్టు రట్టు చేయడంతో పరారైపోయాడు. హైదరాబాద్ వ్యవసాయ పరిశ్రమలో పని చేస్తున్న సిబ్బంది సొమ్మును దొంగిలించి దాచాడు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం రాష్ట్రానికి విచ్చేసి ఈ దోపిడీ గుట్టు రట్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
బాలాసోర్ జిల్లా బొడొమొందారుణి గ్రామానికి చెందిన గోపాల్ బెహరా అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఓ కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది నుంచి రూ. 21 లక్షలు దోచుకున్నాడు. దోచుకున్న నగదుని బావమరిది ద్వారా స్వస్థలానికి సురక్షితంగా తరలించాడు. నిందితుని అత్తమామలు ఈ సొమ్ముని సంచిలో పదిల పరచి ఇంటి పెరట గత్తం కుప్ప కింద దాచి పెట్టారు.
గోపాల్ బెహరా గత పదేళ్లుగా ఈ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ అనుభవంతో లాకరు రహస్య నంబరు వగైరా అనుబంధ సమాచారం గుట్టుగా తెలుసుకుని భారీ మొత్తాన్ని కాజేశాడు. కాజేసిన సొమ్ముని బావమరిది ద్వారా జలేశ్వర్‌లో అత్త వారింటికి తరలించాడు. కంపెనీలో నగదు గల్లంతు విషయమై దాఖలైన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ దర్యాప్తు బృందం రాష్ట్రానికి చేరింది. స్థానిక కొమొర్దా ఠాణా పోలీసుల సహకారంతో నిందితుని అత్త వారింటికి చేరి గాలింపు, తనిఖీలు చేపట్టింది. దర్యాప్తులో ఇంటి పెరట్లో గత్తం కుప్ప కింద దోచుకున్న సొమ్ము పాతిపెట్టినట్లు గుర్తించారు. గత్తం కుప్ప తవ్వడంతో వాస్తవం తేలింది. మరో వైపు ప్రధాన నిందితుడు, అతని మామ ఉమాకాంత బెహరా పరారీలో ఉన్నాడు.
అతని బావమరిది రబీంద్ర బెహరాని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. నిందితుని అత్త బాసంతి బెహరాని కూడా ప్రశ్నిస్తున్నారు. గత్తం తవ్వడంతో రూ. 15 లక్షలు మాత్రమే బయటపడినట్లు దర్యాప్తు బృందం వివరించింది. ఈ నెల 11న హైదరాబాదు వ్యవసాయ కంపెనీలో రూ. 21 లక్షల చోరీకి గురైంది. దీని ఆధారంగా దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఇక్కడ దొరికిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్ము కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోను సంభాషణ వివరాలు ఆధారంగా దోపిడీ నుంచి తరలింపు వరకు జరిగిన ప్రక్రియ గుట్టు రట్టుకు దర్యాప్తు బృందం వ్యూహ రచన చేసింది. కేసు విచారణ, దర్యాప్తు కొనసాగుతుంది.
ఇవీ చదవండి : 50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్
గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి!
Comments
Please login to add a commentAdd a comment