Odisha Latest News
-
ట్యాంకర్ బోల్తా
● ఇద్దరికి గాయాలు రాయగడ: హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్‌తో విశాఖపట్నం నుంచి రాయగడకు వస్తుండగా బిసంకటక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిబులుగుడ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, హెల్పర్్కు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం రాత్రి చవటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. హైడ్రోక్లొరిన్ యాసీడ్తో వస్తున్న ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ట్యాంకర్‌లోని యాసీడ్ కిందపడి మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ప్రమాదంలో చిక్కుకున్న డ్రైవర్, హెల్పర్లను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి మల్కన్‌గిరి: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి కవుడిగూడ గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కవుడిగూడ గ్రామం సమీపంలో ఇసుక లోడ్ చేసి ఘాట్ వద్దకు వస్తున్న టిప్పర్ అటుగా నడుచుకుంటూ వస్తున్న సుందర్ దురా (36)ను బలంగా ఢీకొని తలపై నుంచి వెళ్లిపోయింది. దీంతో సుందర్ దురా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ టిప్పర్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న మత్తిలి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి.. సుందర్ దురా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చెరువులో మునిగి చిన్నారి మృతి మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి కోయిలిపల్లి గ్రామంలో సోమవారం నాలుగేళ్ల చిన్నారి చెరువులో మునిగి మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయిలిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న లక్ష్మీనాథ్ పంగి అనే వ్యక్తి కుమార్తె ధమునీ పంగి(4) ఇంట బయట ఆడుతూ చెరువు వద్దకు వెళ్లి లోపలకు పడిపోయింది. తల్లి ఎంత వెతికినా కనిపించలేదు. అటుగా వస్తున్న వారికి చెరువులో పాప తేలుతూ కనిపించడంతో దిగి బయటకు తీసి కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సారా విక్రయాలపై ఆగ్రహం జయపురం: జయపురం సమితి డిమ్ల గ్రామంలో విచ్చల విడిగా నాటు సారా అమ్ముతున్నారని ఆ గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గ్రామంలో అక్రమ నాటు సారా దుకాణాలను బంద్ చేయాలని సోమవారం డిమ్ల గ్రామం మహిళలు, స్వయం సహాయక గ్రూపు మహిళలు జయపురం సదర్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. సారా దుకాణాల వల్ల గ్రామంలో అశాంతి నెలకొందని, ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినా మద్యం దుకాణాలలో మద్యం అమ్ముతున్నారని ఇప్పటికై నా తక్షణ చర్యలు చేపట్టి మద్యం దుకాణాలను బంద్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టాన్ని అతిక్రమించి మద్యం దుకాణాలను తామే మూయిస్తామని హెచ్చరించారు. -
ఆటో బోల్తా పడి 20 మందికి గాయాలు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి ఝొలాగుడ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ప్రమాదంలో ఆటోలో ఉన్న 20 మంది గాయపడగా వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను కుంద్ర కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్పి్ంచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంద్రా సమితి సహిద్ లక్ష్మణ నాయిక్ మూల ఆదివాసీ సంఘం కుంద్రలో నిర్వహించిన పుష్‌పుణి ఉత్సవాలు తిలకించేందుకు గుండాల్ పంచాయతీ ఝొలాగుడ గ్రామం నుంచి ఆటోలో సుమారు 25 మంది వచ్చారు. ఉత్సవం తిలకించిన తరువాత వారంతా తిరిగి వెళ్తుండగా.. ఝొలాగుడ–కుంభారగుడ మధ్యలో ఆటో అదుపు తప్పి బోల్తాపడడంతో 20 మంది గాయపడగా వారందరినీ కుంద్ర కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం డాలి కమార్, రీణ కమార్, భగత్రామ్ హరిజన్, తులసీ కందాలియ, హేమలత రామపురియ, ఘాశీరాం ఖొర, సుశీల పెంటియ, విమలజానీలను కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు. మిగతా 12 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు కుంద్ర ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గణేష్ ప్రసాద్ దాస్ వెల్లడించారు. ఎనిమిది మంది పరిస్థితి విషమం -
ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలి
పర్లాకిమిడి: ఖరీఫ్‌లో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని నవ నిర్మాణ్ కృషక్ సంఘటన్ రాష్ట్ర కార్యదర్శి అక్షయ కుమార్ డిమాండ్ చేశారు. గజపతి జిల్లాలో 26 సొసైటీలలో ధాన్యం కోనుగోలు చేస్తామని కలెక్టర్ ప్రకటించారని.. అయితే వరి ఎక్కువుగా పండిస్తున్న గుసాని సమితిలో రెండు మండీలనే ఎందుకు తెరిచారని ప్రశ్నించారు. ఏది ఏమైనా ప్రభుత్వ మద్దతు ధరకు రైతుల వద్ద నుంచి ధాన్యం మొత్తం కోనాల్సిందేనని అన్నారు. ఉప్పలాడ ప్రాంతీయ మార్కెట్ కమిటీ యార్డు వద్ద సోమవారం నిర్వహించిన సమావేశంలో గుసాని సమితి నుంచి ఉప్పలాడ, కంట్రగడ, కోర్సండ, బాగుసల, బుసుకిడి పంచాయతీల నుండి వచ్చిన రైతులతో నవ నిర్మాణ్ కృషక్ సంఘటన్ నాయకులు మాట్లాడారు. నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ నేతలు మహామ్మద్ మళ్వార్ ఆలీ, రాష్ట్ర సంపాదక మండలి కార్యదర్శి శేష్ దేవ్ నోందో, ప్రభారి రంజిత్ పట్నాయక్, మాణిక్ పారిక్, ధండాశి ఖండవాల్, స్థానికులు లక్షీ నాయక్, ధర్మారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధారణ కార్యదర్శి అక్షయ కుమార్ మాట్లాడుతూ.. మండీల వద్ద ధాన్యం నాణ్యత చెక్ చేస్తున్నారని, వీటిలో కొంత కోత విధిస్తుండడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఖరీఫ్ ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోతే ఈ నెల 24వ తేదీన పదివేలమంది రైతులతో గజపతి కలెక్టరేట్ వద్ద రైతుల తరఫున ధర్నా చేస్తామని అక్షయ కుమార్ వెల్లడించారు. నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ రాష్ట్ర కార్యదర్శి అక్షయ కుమార్ 24న కలెక్టరేట్ వద్ద ధర్నా -
నేడు సెంచూరియన్ వర్సిటీలో కాన్ఫరెన్స్
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో నేడు క్లైయిమేట్ స్మార్ట్ వ్యవసాయంపై కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ కళాశాల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ప్రీతా భధ్ర, డాక్టర్ అతాను దేబ్ తెలిపారు. ఈ మూడు రోజుల సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మేధావులు, పరిశోధకులు, పాలసీ మేకర్స్ తదితరులు విచ్చేస్తారని తెలియజేశారు. గ్రీవెన్స్‌లో 28 వినతుల స్వీకరణ మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితిలో అధికారులు సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా 28 వినతులను జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రదన్ స్వీకరించారు. వీటిని పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా అదనపు ఎస్పీ తపాన్ నారాయణ్ రోతో, మత్తిలి సమితి సభ్యులు సుభష్ బక్క, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు . -
విఫలయత్నం
సీఎం ఇంటి ముట్టడికిభువనేశ్వర్: ఒడిశా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధికారిక నివాసం ముట్టడికి విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వీరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. యువజన కాంగ్రెస్ నాయకుడు రణజిత్ పాత్రో నేతృత్వంలో నిర్వహించిన యువ అసంతృప్తి సమావేశం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో భాగంగా ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పాల్పడ్డారు. స్థానిక మాస్టర్ క్యాంటీన్ కూడలి ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. యువ అసంతృప్తి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాను చిబ్ ప్రసంగించారు. 11 ఏళ్ల మోదీ ప్రభుత్వం రాజ్యాంగంలోని అధికారాలను కుదించారని, దేశ యువతను మోసం చేసిందన్నారు. నిరుద్యోగం, మాదకద్రవ్యాల వ్యసనం మోదీ ప్రభుత్వ రెండు ప్రధాన ప్రణాళికలని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతుందన్నారు. ఈ ఉద్యమం మారు మూల పంచాయతీల్లోకి తీసుకెళ్లాలని ఉదయభాను చిబ్ పిలుపునిచ్చారు. మోదీ, అదానీల లోపాయికారీ వ్యవహారాల్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు లోపల, వెలుపల పదేపదే ఎండగడుతూ ప్రజలకు లోగుట్టు బహిర్గతం చేస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిని ఈడీ, సీబీఐ, ఇతర కేంద్ర సంస్థలు వేధిస్తున్నాయి. దేశంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ హామీ 11 ఏళ్ల తర్వాత కూడ వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశాలో మోహన్ చరణ్ మాఝి ప్రభుత్వం కేంద్రం చెప్పు చేతల్లో కీలుబొమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గిరిజనుడే అయినప్పటికీ ఇక్కడ గిరిజనులు అణచివేతకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, దళితులు మోహన్ ప్రభుత్వంలో భయం భయంగా బతుకుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, అధిక ధరల భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర ప్రజలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు బదులుగా స్మార్ట్ మీటర్ల పేరిట నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్, జయదేవ్ జెనా, ప్రసాద్ హరిచందన్, తారా ప్రసాద్ బాహినీపతి, అఖిల భారత యవజన కాంగ్రెస్ కార్యదర్శి అజిత్ సింగ్, అభినవ్ భగత్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ రాజధానిలో ఉద్రిక్త వాతావరణం -
జిల్లా స్థాయి జూనియర్ రెడ్‌క్రాస్ శిక్షణ శిబిరం
జయపురం: కొరాపుట్ జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ శిక్షణ శిబిరం జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రారంభించారు. ఆ శిబిరంలో కొరాపుట్ జిల్లాలో అన్ని ఉన్నత పాఠశాలల నుంచి జూనియర్ రెడ్‌క్రాస్ విద్యార్థులు పాల్గొన్నారు. కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు సేవా ప్రవృత్తి అలవరచుకోవాలని సూచించారు. జూనియర్ రెడ్‌క్రాస్ జిల్లా అధికారి భీమ బెహర మాట్లాడుతూ ఈ శిక్షణ జచేతన శిబిరంలో జిల్లాలోని 14 పంచాయతీ సమితులలో గల 167 ఉన్నత ప్రాథమిక పాఠశాల జూనియర్ రెడ్‌క్రాస్ నుంచి 573 మంది విద్యార్థులు వచ్చారని వెల్లడించారు. 167 మంది టీచర్లు వచ్చారని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో అనుసరించాల్సి చర్యలపై శిక్షణ ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది పలు విన్యాసాలతో అవగాహన కల్పించారు. శిబిరంలో జిల్లా విద్యాధికారి ప్రశాంత కుమార్ మహంతి, జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ సహాయ కార్యదర్శి హరేకృష్ణ మహరాణ, కొట్‌పాడ్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ప్రధాన ఉపాధ్యాయులు శరత్ కుమార్ సాహు, ఉపాధ్యాయులు సంధీప్ పట్నాయిక్, క్రీడా శిక్షకులు ప్రదీప్ గౌఢ, పాఠశాలలో గల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
28 ఏళ్ల తరువాత ఒకే వేదికపై..
జయపురం: జయపురం పురాతన చందనబెడ పాఠశాల 1996 మెట్రిక్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం బందుమిలన్ జరుపుకున్నారు. 28 ఏళ్ల తరువాత దేశ, విదేశాలతోపాటు వివిధ ప్రాంతాల లో ఉద్యోగ, వ్యాపార రీత్యా పని చేస్తున్న వారంతా జయపురం సమితి గొడొపోదర్ గ్రామ అడవిలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకొరినొకరు ఆప్యాయంగా పలకరించుకు న్నారు. విద్యార్థి దశనాటి తీపి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. తమ జీవితాలలో సాధించిన విజయాలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం వారంతా జయపురియ వంటకాలతో వనభోజనాలు చేశారు. బందుమిలన్లో వివిధ ప్రాంతాల నుంచి 50 మంది పూర్వ విద్యార్థు లు పాల్గొన్నారు. డాక్టర్ జగదీష్ బెహర, జగదీష్ రావు, లక్ష్మీ నారాయణ పాఢీ, లులు పండ, అరుణ బెహర, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
దారికాచిన మృత్యువు
● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ● మరో వ్యక్తికి తీవ్రగాయాలు ● స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి వస్తుండగా ఘటన కంచిలి, సోంపేట: మండలంలోని జలంత్రకోట గ్రామ కూడలి వద్ద జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సోంపేట మండలంలోని బారువ గ్రామానికి చెందిన హరీష్‌కుమార్ పాణిగ్రాహి(31), అనిల్‌కుమార్ పాణిగ్రాహిలు కంచిలి నుంచి కారులో బారువ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో హరీష్‌కుమార్ పాణిగ్రాహికు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్‌కుమార్ తీవ్రగాయాలపాలయ్యాడు. అనిల్‌ను వెంటనే సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి హైవే అంబులెన్స్‌లో తరలించి, ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం టెక్కలి, తర్వాత శ్రీకాకుళం, అక్కడి నుంచి విశాఖపట్నం తరలించారు. మృతుడు హరీష్, అనిల్‌లు కంచిలికి చెందిన తమ స్నేహితుడు నర్తు రాజేష్‌ను పలాస రైల్వేస్టేషన్ పికప్ చేసుకొని కంచిలిలో డ్రాప్ చేశారు. అనంతరం తమకు చెందిన కారులో కంచిలి నుంచి బారువ వస్తుండగా, పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ కనిపించకపోవడంతో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న హరీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనిల్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతలోనే ఘోరం బారువ గ్రామానికి చెందిన రోజారాణి కుమారుడు హరీష్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వర్క్‌ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో రెండు నెలలుగా ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండగ ముగియడంతో సోమవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. హైదరాబాద్ వెళ్లాల్సిన కుమారుడు రహదారి ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి వేదన వర్ణనాతీతం. రోజారాణి భర్త చాలా రోజుల క్రితం పిల్లలను, భార్యను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో పిల్లలే తన సర్వస్వంగా భావించి విద్యాబుద్ధులు నేర్పించింది. దీనిలో భాగంగా హరీష్ చదువుకుని సాప్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. అనంతరం అతడు తన తమ్ముడు శిరీష్, చెల్లెలు శ్వేతను ప్రయోజకులను చేశాడు. సోదరి శ్వేత బారువ స్టేట్‌బ్యాంకులో ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తోంది. సోదరుడు స్థానిక షిరిడిసాయి ఆలయంలో అర్చకుడిగా చేస్తున్నాడు. హరీష్‌కు త్వరలోనే వివాహం చేయాలని నిశ్చయించగా, ఇంతలోనే ఇలా మృత్యువు కబలించడంతో కుటుంబ సభ్యులంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. హరీష్ తల్లి ప్రమాదం జరగడానికి ముందే ఫోన్‌చేస్తే పావుగంటలో ఇంటికి వస్తున్నానని చెప్పాడు. అంతలోనే కొడుకు మృతి చెందడంతో ఆమెను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పాలఖండ్యాంలో పశువుల కాపరి జి.సిగడాం: మండలంలోని పాలఖండ్యాం గ్రామానికి చెందిన బత్తుల పోలారావు(50) సోమవారం సాయంత్రం మినీ వ్యాన్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారిలో మెట్టవలస–పాలఖండ్యాం గ్రామ సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకు వద్ద పశువులను కాపు కాస్తూ ఉండగా వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొంది. దీంతో ఘటన స్థలంలోనే పోలారావు మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య ఆదిలక్ష్మి, కుమారైలు పూజిత, ఇంద్రజ ఉన్నారు. కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వై. మధుసూదనరావు తెలిపారు. మృతదేహాన్ని రాజాం సామాజిక అస్పత్రికి తరలించామన్నారు. ఘటన స్థలానికి సర్పంచ్ ధారబోయిన ధర్మారా జ్, మాజీ సర్పంచ్ పలిశెట్టి సూర్యనారాయణ, ఉపసర్పంచ్ ఇజ్జి గోవిందరావు, అరుణోదయ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ గర్లంకి శ్రీనివాసరా వు తదితరులు వెళ్లి సంతాపం తెలిపారు. నిరుపే ద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ పోటీలు
పర్లాకిమిడి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో హైస్కూల్, కళాశాల స్థాయిలో విద్యార్థులకు పలు పోటీలను డీఈవో నిర్వహించారు. వక్తృత్వ, క్విజ్, దేశభక్తి గీతాలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా.. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా బిచిత్రా నంద బెబర్తా, ప్రభుత్వ ఉపాధ్యాయులు అమేష్ లిమ్మా, శులతా శుభదర్శినీ, జగన్నాథ పట్నాయక్, అనితా దాస్, సింహాచల బెహారా, సుమిత్రా కుమారీ జెన్నా, సులతా నోందో, దేవీ ప్రసాద్ పట్నాయక్ వ్యవహారించారు. విజేతలకు ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవ ప్యారేడ్ వద్ద బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని డీపీఆర్వో ప్రదీప్ గురుమయి తెలిపారు. -
విషపూరిత పండ్లను తిని 12 మందికి అస్వస్థత
రాయగడ: అడవిలో లభించే విషపూరిత పండ్లను తిన్న 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సోమవారం చేసుకుంది. జిల్లాలోని కొలనార సమితి పరిధిలో గల బైరిగుడ ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు బడికి సెలవు ఇవ్వడంతో సమీపంలోని బైరిగుడ గ్రామంలోగల ఎవరి ఇంటికి వాళ్లు వెళుతున్నారు. ఈ క్రమంలో ఇందులొ 12 మంది విద్యార్థులు అడవిలో ఏవో పండ్లు తెంపి తిన్నారు. దీంతో వెంటనే వారికి కడుపు నొప్పి వాంతులు ప్రారంభమయ్యాయి. వెంటనే వారి ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం వారికి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు అవి విషపూరితమైన పళ్లు కావడంతో వాంతులు, కడుపు నొప్పి వంటివి వచ్చాయని తెలిపారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. సమాచారం తెలుసుకున్న రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక స్థానిక ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల పరిస్థితిని సమీక్షించారు. -
ఖుర్దారోడ్ – బొలంగీరు మధ్య కొత్త ప్యాసింజర్ హాల్ట్
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్–బొలంగీర్ రైలు మార్గంలో కొత్తగా సన్నొపొదొరొ ప్యాసింజర్ హాల్ట్‌ను ప్రారంభించారు. స్థానిక లోక్‌సభ సభ్యురాలు అపరాజిత షడంగి సోమవారం ఈ కొత్త స్టేషన్ భవనం ప్రారంభించారు. ఆమెతో బెగుణియా ఎమ్మెల్యే ప్రదీప్ కుమార్ సాహు, ఖుర్దారోడ్ మండల రైల్వే అధికారి హెచ్ఎస్ బాజ్వా అతిథులు గా పాల్గొన్నారు. స్థానికుల అభ్యర్థన మేరకు రైల్వే శాఖ సన్నొపొదొరొ ప్యాసింజర్ హాల్ట్‌ను తెరవాలని నిర్ణయం తీసుకుందని ఎంపీ ప్రకటించారు. ఈ స్టేషన్లో ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలు అమర్చారు. రూ.55 లక్షలు వెచ్చించి 450 మీటర్ల ప్లాట్ఫారం నిర్మించారు. రైలు కోసం నిరీక్షించే ప్రయాణికుల సౌకర్యానికి ప్లాట్‌ఫారంపై 30 మంది ప్రయాణికులు, వెయిటింగ్ రూమ్‌లో 13 మంది విశ్రమించేందుకు వీలు కల్పించారు. సన్నొపొదొరొ పాసింజరు హాల్టు స్టేషనులో సోమవారం నుంచి ఒక ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా నాలుగు జతల పాసింజరు రైళ్లనుఇప్పుడు సన్నొపొదొరొలో నిలుపుతారు. -
పేదలకు దుప్పట్లు పంపిణీ
రాయగడ: జిల్లాలోని కొలనారలో ఉన్న మా జగదాంబ ప్రభాత్ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను సోమవారం పంపిణీ చేశారు. సమితిలోని భొతుడి, ఫకిరి, తొటాగు డ, ఆరబి, నకిటిగుడ గ్రామంలో సేవా సమితి సభ్యులు పర్యటించి పేదలకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విపరీతంగా శీతలగాలులు వీస్తుండటంతో చలిని తట్టుకొలేని పరిస్థితి నెలకొనడంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని సభ్యులు దుఖి హుయిక, భాను హుయికలు తెలిపారు. గ్రీవెన్స్‌సెల్‌కు 102 వినతులు పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ కెరండి పంచాయతీ కార్యాలయంలో సోమవా రం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడీఎం రాజేంద్రమింజ్, జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా అధ్యక్షత వహించగా, డీఆర్ డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి గుణనిధి నాయక్, రాయగడ సమితి చైర్మన్ పూర్ణబాసి నాయక్‌లు పాల్గొన్నారు. ఈ వారం 102 వినతులు అందగా..వీటిలో గ్రామసమస్యలు 39, 63 వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులు ఉన్నాయి. రెండు వినతులను అధికారు లు అక్కడికక్కడే పరిష్కరించారు. బీడీవో సుధీ ర్ సింగ్, రాయగడ ఉపాధ్యక్షురాలు జ్యోతి ప్ర సాద్పాణి, తహసీల్దార్ శ్రీకాంత్ ప్రధాన్, సీడీఎం పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యం.యం.ఆలీ, డీఎస్ఎస్వో సంతోష్‌కుమార్ నాయక్ పాల్గొన్నారు. 100 కిలోల గంజాయి పట్టివేత మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియ సమితి కుమార్గూఢ గ్రామం వద్ద ఆదివారం రాత్రీ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు చత్తీస్‌గఢ్ వైపు వేగంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా అందులో నాలుగు బస్తాల్లో గంజాయి కనిపించింది. వెంటనే గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితు ల్లో ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చేందిన ఫిరాజ్ సైఫీ, నాజిమ్ మల్లిక్ వీరికి మల్కన్‌గిరికి చెందిన గురుచంధ్ మండాల్ సహకరించాడని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి దాదాపు 80 కిలోలు ఉంది. అలాగే కలిమెల సమితి మోటు పోలీసులు ఓ బైక్ పై తరలిస్తున్న 20 కిలోల గంజాయిని ఆదివారం రాత్రి పట్టుకున్నారు. కిషోర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. శ్యామ సుందరస్వామిని తాకిన సూర్య కిరణాలు టెక్కలి: స్థానిక శ్యామసుందరస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని సూర్య కిరణాలు తాకాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్యామసుందరస్వామిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఖనిజ సంపదలో ఒడిశా అగ్రగామి
● గనుల వేలంలో రాష్ట్రాలకు అవార్డులు ● స్టార్టప్‌లకు ప్రోత్సాహం ● కోణార్కులో 3వ జాతీయ గనుల శాఖ మంత్రుల సదస్సు భువనేశ్వర్: కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన పూరీ జిల్లా కోణార్క్‌లో 2 రోజుల పాటు జరిగే 3వ జాతీయ గనుల శాఖ మంత్రుల సదస్సు సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా, జమ్మూ – కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రులు, జార్ఖండ్ ముఖ్యమంత్రి సహా 16 మంది రాష్ట్రాల గనుల శాఖ మంత్రులు, కేంద్ర, ఒ డిశా ప్రభుత్వాల సీనియర్ అధికారులు పాల్గొన్నా రు. ఖనిజ సంపదలో అగ్రగామిగా ఉన్న ఒడిశా, ఈ పరివర్తనలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని, ప్రత్యేకించి ’పూర్వోదయ మిషన్’లో భా గంగా, ఇది భారతదేశ ఆర్థిక సామర్థ్యానికి మార్గం సుగమం చేసి మరింత సంపన్నమైన, స్వావలంబన కలిగిన దేశ నిర్మాణంలో కీలక పాత్రధారి అవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. గనుల వేలంలో రాష్ట్రాలకు అవార్డులు ఈ సదస్సు పురస్కరించుకుని జాతీయ స్థాయిలో గనుల వేలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అవార్డులు అందజేశారు. ఈ రంగంలో 3 తొలి అగ్ర రాష్ట్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. 31 వేలంపాటలతో రాజస్థాన్ అగ్ర స్థానంలో నిలిచింది. 22 గనుల వేలంతో మధ్య ప్రదేశ్ తదుపరి స్థానం సాధించగా 10 వేలంపాటలతో మహారాష్ట్ర 3వ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రాలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో చురుకై న వేలం ప్రక్రియతో వనరులను మెరుగుపరచడంలో అత్యుత్తమ పనితీరు కనబరిచాయని ముఖ్యమంత్రి అభినందించారు. స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఈ వేదికపై స్టార్టప్‌లు, ఎంఎస్ఎమ్ఈ మరియు గనుల విభాగం పరిశోధన రంగంలో నిపుణులకు గ్రాంట్ల ఆమోద పత్రాలను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అందజేశారు. ఈ సందర్భంగా 11 స్టార్టప్‌లు గనుల శాఖ ఎస్ అండ్ టీ ప్రిజమ్ కాంపోనెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమం కింద రూ. 15.97 కోట్ల మొత్తాన్ని అందుకున్నాయి. ఈ స్టార్టప్‌లు స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తాయి. గనుల రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, వృద్ధిని ప్రేరేపించినందు కు వారిని అభినందించారు. నివేదిక వెల్లడి 29 రాష్ట్రాల గనుల నిర్వహణలో ఉత్తమ విధానాల తో కూడిన సమగ్ర నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా విడుదల చేశారు. గనుల నిర్వహణ పద్ధతులలో ఆవిష్కరణ, స్థిరత్వాన్ని ఈ నివేదిక సమగ్ర సమాచారం అందజేస్తుందన్నారు. రాష్ట్రా లు అమలు చేస్తున్న వినూత్న పాలనా నమూనాల తో గనుల పద్ధతుల్లో సామర్థ్యం మరియు పారదర్శకతను మెరుగుపరచడంలో ఈ నివేదిక దోహదపడుతుందని కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
● జిల్లా ఉపాధి కల్పనాధికారి మహాపాత్రో రాయగడ: పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రభుత్వం కల్పించే అప్రంటిష్ను పూర్తి చేసు కుని వచ్చే అవకాశాలను సద్వినియోగపరుచుకుంటే వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని జిల్లా ఉపాఽధి కల్పనాధికారి తత్వమహి మహాపాత్రో అన్నారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ప్రిన్సిపాల్ వినోద్‌కుమార్ బసంతరాయ్ అధ్యక్షతన సోమవా రం ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహాపాత్రో మాట్లాడుతూ.. జిల్లాలోని అనేక భారీ పరిశ్రమలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కూడా అదే తరహాలో లభిస్తాయని అన్నా రు. అందుకు ప్రతీ విద్యార్థి ముందస్తు సమాచారంతో ఉపాధి అవకాశాల గురించి అన్వేషణలో ఉండా లని అన్నారు. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం విద్యార్థులు అవకాశాలు వచ్చే పరిశ్రమల్లో అప్రెంటిషిప్లను క్రమశిక్షణతో పూర్తి చేసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం అదనపు ఐపీవో చిత్తరంజన్ మల్లిక్ ఉపాధి అవకాశాలు లభించే విధానాన్ని వివరించారు. జిల్లాలోని జేకే పేపర్ మిల్, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో ఎల్లాయీస్, ఎల్అండ్టీ, ఫెమాక్రోమ్ పరిశ్రమల మానవ వనరుల అధికారులు, శాంకేతిక నిపుణులు హాజరయ్యారు. -
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని కేఆర్ఆర్సీ ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించి అర్జీదారుల నుంచి 68 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, తద్వారా అర్జీదారు సంతృప్తి వ్యక్తం చేసేలా పరిష్కారం ఉండాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితులోను ఒకసారి వచ్చిన అర్జీ మళ్లీ రీ ఓపెన్ కారాదని అధికారులకు స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్, జిల్లా పశుసంవర్థకశాఖాధికారి డాక్టర్ ఎస్.మన్మథరావు, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, డ్వామా పీడీ రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 25 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 25 వినతులు వచ్చాయి. పీహెచ్‌వో ఎస్వీ గణేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. హుస్సేన్‌పురం సచివాలయం నుంచి గదబవలసకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని పెద్దగదబవలసకు చెందిన ఆర్.కృష్ణ వినతి అందజేశారు. మూలగూడకు చెందిన మండల పరిషత్ స్కూల్‌కు ప్రహరీ, మరుగుదొడ్లు మంజూరు చేయాలని పి.చౌదరి కోరారు. వజ్జాయిగూడ గ్రామస్తులు కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రైకార్ రుణాలు ఇప్పించాలని పలువురు కోరారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, వెలుగు ఏపీడీ సన్యాసిరావు, ఏటీడబ్ల్యూవో మంగవేణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాలూరులో 139 అర్జీలు సాలూరు: మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 139 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర సీ్త్రశిశుసంక్షేమం, గిరిజన సంక్షేమశాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి, అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అవకాశమున్న సమస్యలను తక్షణమే, మిగిలిన సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ హేమలత, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, డీఎల్డీఓ రమేష్‌రామన్, ఐటీడీఏ డీఈ బలివాడ సంతోష్, జీఎస్‌డబ్ల్యూఎస్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ చిట్టిబాబు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 5 ఫిర్యాదులు పార్వతీపురంటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దని అదనపు ఎస్పీ డా.ఒ.దిలీప్ కిరణ్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి 5 ఫిర్యాదులు స్వీకరిచారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, వారి ఫిర్యాదులను పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో అదనపు ఎస్పీ స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీతో పాటు ఎస్సై ఫకృద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
పర్లాకిమిడి: రోడ్డు నిబంధనలు పాటించాలని వక్త లు అన్నారు. స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో రో డ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని సోమవా రం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రీనా సాహు అధ్యక్షత వహించారు. ఎన్ఎస్ఎస్ పీవో డాక్టర్ భారతీ పాణిగ్రాహి, ఆదర్శ పోలీస్‌స్టేషన్ ఎస్సై తపన్‌కుమార్ పాఢి, ట్రాఫిక్ పోలీసు కుంతోలో దేవి, ఎన్ఎస్ఎస్ అధికారి మధుస్మితా ప్రధాన్ పాల్గొన్నా రు. విద్యార్థినులు వాహనాలు నడిపే సమయంలో నిబంధనలు పాటించాలని, సెల్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకుండా నడప రాదని ఎస్సై తపన్ కుమార్ పాఢి అన్నారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రసాద్
● రెడ్‌క్రాస్‌పై విడుదలైన స్టాంప్స్ సేకరణ ● 177 దేశాల్లో విడుదలైన స్టాంపులు, కవర్లు సేకరణ ● గతంలో గాంధీజీపై స్టాంప్స్ సేకరణలో రికార్డు చీపురుపల్లి: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాసా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏడీఎన్‌ఎస్వీ ప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థపై ముద్రించిన స్టాంప్స్, కవర్స్‌ను సేకరించి అవార్డును అందుకున్నారు. 2011 నుంచి 2024 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాల్లో రెడ్‌క్రాస్ సంస్థ పేరుతో విడుదలైన 1313 స్టాంప్స్, కవర్స్‌ను ప్రసాద్ సేకరించారు. దీనికి గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసి మెడల్, ధ్రువీకరణ పత్రం, జ్ఞాపికను ఆ సంస్థ చీఫ్ ఎడిటర్ డా.బిస్వరూప్ రాయ్ చౌదరి ప్రదానం చేశారు. ప్రసాద్ గతంలో కూడా బాపూజీపై ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన స్టాంప్స్ సేకరణలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఆయనను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. -
సభ్యులకు తెలియకుండా అకౌంట్లోకి డబ్బులు
టెక్కలి రూరల్: మండలంలోని కొండ భీంపురం గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపునకు సంబంధించి డ్వాక్రా రుణం డబ్బులు సంబంధిత గ్రూపు స భ్యులకు సమాచారం లేకుండా బ్యాంకు అధికారులు మూడు నెలల క్రితం రూ.17.96 లక్షలు వారి పొదుపు ఖాతాలో జమ చేయడం జరిగింది. అయితే సోమవారం సంబంధిత గ్రూపు సభ్యులకు ఆ డబ్బులకు సంబంధించి వడ్డీ కట్టాలని అధికారులు చెప్పడంతో వారు ఒక్కసారిగా కంగుతిన్నారు. వడ్డీ కట్టేందుకు గ్రూప్ సభ్యులు అగీకరించకపోవడంతో ఇరువురికి ఇబ్బందులు లేకుండా ఎన్ఆర్ఎల్ ఫండ్స్ ద్వారా కట్టేవిధంగా చూస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. అనంతరం గ్రూప్ సభ్యులు అందరూ వారికి నూతనంగా ఒక్కొక్కరూ రూ.2 లక్షల చొప్పున లోన్ పెట్టేందుకు పత్రాలు ఇవ్వడంతో ఈ సమస్య పరిష్కారమైనట్లు ఏపీఎం ఉమారాణి తెలిపారు. నాటుసారాతో వ్యక్తి అరెస్టు ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి 200 నాటుసారా ప్యాకెట్లను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పి.దుర్గా ప్రసాద్ తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు ఇచ్ఛాపురం ప్రొహిబిషన్ పరిధిలో దాడులు నిర్వహిస్తుండగా హదియా మోహన్ అనే వ్యక్తి నాటుసారా ప్యాకెట్లను ఒడిశా నుంచి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. -
ప్రతి వినతికీ పరిష్కారం చూపించాలి
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి వినతికి పరిష్కారం చూపాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా వినతుల పరిష్కారం జరగాలన్నారు. ఆయా వినతుల తనిఖీ సందర్భంగా అర్జీదారు సంతృప్తి చెందే రీతిలో వినతిని పరిష్కరించలేదని నిర్ధారణ జరిగితే ఆ వినతిని మళ్లీ తెరిచి సంతృప్తికర పరిష్కారం చూపించాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ అంబేడ్కర్ పాల్గొని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ కీర్తిలతో కలిసి వినతుల స్వీకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వినతుల పరిష్కారంపై కలెక్టర్ సమీక్షించారు. ప్రజావినతుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయా శాఖల జిల్లా అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా పలు సమస్యల పరిష్కారంపై 183 వినతులు అందాయి. ఆర్అండ్బీ స్థలం ఆక్రమణను అడ్డుకోవాలి చీపురుపల్లి మండలం పత్తికాయవలస గ్రామంలో లావేరు రోడ్డును ఆనుకుని ఉత్తర దిశగా ఆర్అండ్బీ రహదారిపై ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని దాన్ని అడ్డుకోవాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్ పట్ట ఎల్లయ్య కోరారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా వినతుల పరిష్కార వేదికకు ఆయనతోపాటు పలువురు గ్రామస్తులు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ అక్రమణపై స్థానిక తహసీల్దార్, ఆర్‌ఆండ్‌బీ అధికారులు, పోలీసులకు ఈ నెల 8న ఇచ్చిన ఫిర్యాదుపై సంబంధిత అధికారులు స్పందించి చీపురుపల్లి సర్వేయర్‌తో సర్వే చేశారు. ఆర్అండ్బీ స్థలంగా రుజువు అవడంతో ఖాళీ చేయమని ఆదేశాలిచ్చారు. అయితే అధికారుల ఆదేశాలను పట్టించుకోవడం లేదని జిల్లా స్థాయిలో చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని వారు కోరారు. ప్రజాసమస్యల పరిష్కారవేదికకు 32 ఫిర్యాదులు విజయనగరం క్రై మ్: ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారానికి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ వకుల్ జిందల్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి 32 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ -
22న కబడ్డీ జట్లకు క్రీడాకారుల ఎంపిక
గంట్యాడ: విశాఖపట్నం జిల్లా అంకుపాలెంలో ఈనెల 25, 26, 27 తేదీలలో 71 వ అంతర జిల్లాల సీ్త్ర, పురుషల కబడ్డీ పోటీలు జరగనున్నాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అవనాపు విజయ్, రంధి నాగేశ్వరావులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు గంట్యాడ హైస్కూల్లో ఈనెల 22 వతేదీ మధ్యాహ్నాం 2 గంటలకు కబడ్టీ జట్లను ఎంపిక చేయనున్నామని చెప్పారు. క్రీడాకారులు అధార్ కార్డుతో హాజరు కావాలని సూచించారు. పురుషలు బరువు 85 కేజీలు, సీ్త్రలు బరువు 75 కేజీల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారాలు ఫోన్ 9440888369,9010727069 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కదలని ఏనుగుల గుంపుకొమరాడ: మండలాన్ని గజరాజుల బాధలు వీడడం లేదు. గత కొన్నాళ్లుగా జంఝావతి రబ్బర్ డ్యామ్, రాజ్యలక్ష్మీపురం, గంగరేగువలస తదితర గ్రామా పరిసరాల్లో గజరాజుల గుంపు సంచరిస్తోంది. ఈ ప్రాంతంలో పుష్కలంగా కూరగాయల సాగు నీటి వనరులు ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఏనుగులు విడిచివెళ్లడం లేదు. అటవీశాఖ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏరియాలో జొన్న, టమాటో లాంటి పంటలు సాగులో ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించే చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. పేకాట శిబిరంపై దాడిగజపతినగరం: మండలంలోని పాతబగ్గాం గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో ఆడుతున్న పేకాట శిబిరంపై దాడి చేసి పేకాట రాయుళ్ల నుంచి రూ.7వేల510 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఏడుగురు కోడిపందెంరాయుళ్ల అరెస్టువేపాడ: మండలంలోని అరిగిపాలెం సమీపంలో ఏడుగురు కోడిపందాల రాయుళ్లు పట్టుబడినట్లు వల్లంపూడి ఎస్సై బి.దేవి తెలిపారు. సోమవారం సాయంత్రం వల్లంపూడి పోలీసులు నిర్వహించిన దాడుల్లో కోడిపందెం నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.10,680లు ఏడు సెల్ఫోన్లు, ఎనిమిది ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై చెప్పారు. -
రాజశేఖరం పెద్దన్న పాత్ర పోషించారు
● ఎమ్మెల్సీలు తలశిల రఘురాం.. లేళ్ల అప్పిరెడ్డిపాలకొండ రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పాలవలస రాజశేఖరం ఈ ప్రాంతానికి పెద్దన్నలా కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ నిర్వాహకులు, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జేఏసీ కన్వీనర్ హర్షవర్ధన్ రెడ్డి తదితరులు అన్నారు. ఇటీవల మరణించిన పాలవలస రాజశేఖరం కుటుంబసభ్యులను సోమవారం వారి స్వగృహంలో పరామర్శించారు. ఈ క్రమంలో రాజశేఖరం సతీమణి ఇందుమతి, కుమారుడు, ఎమ్మెల్సీ విక్రాంత్, కుమార్తె, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతితో మాట్లాడుతూ వారి తండ్రితో వారికి ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని, కీలక సమయాల్లో పార్టీ అభ్యున్నతికి ఆయన అందించిన సలహాలు, కృషి గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు తీర్చలేదంటూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కలయికలో వారి వెంట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఏపీ టిడ్కో మాజీ చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పాలవలస ధవళేశ్వరరావుతో పాటు పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులు ఉన్నారు. అంతకుముందు వీరు రాజశేఖరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
చీపురుపల్లిలో చోరీ కలకలం
చీపురుపల్లి: చాలాకాలం తరువాత చీపురుపల్లి పట్టణంలో జరిగిన చోరీలు కలకలం సృష్టించాయి. అందులోనూ ఒకే రోజు మూడిళ్లలో చోరీ జరగడం స్థానికంగా భయాందోళనకు దారితీసింది. పథకం ప్రకారమే దుండగులు మూడిళ్లలో ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చోరీ జరిగిన మూడిళ్లలోనూ ఎవరూ లేకపోవడం, తాళాలు వేసి ఉండడంతోనే ఆ ఇళ్లనే దుండగులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మూడిళ్లలో చోరీలకు పాల్పడినప్పటికీ రెండిళ్లలో ఎలాంటి విలువైన వస్తువులు లభించకపోగా ఒక ఇంటిలో కేజీ 350 గ్రాములు వెండి, 700 గ్రాముల బంగారం చోరీకి గురయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన ఈ చోరీలకు సంబంధించి సోమవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై ఎల్.దామోదరరావు దర్యాప్తు నిర్వహించి తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని లెక్చరర్స్ కాలనీలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు పెద్ది మహేశ్వరరావు, రామకృష్ణారెడ్డి కుటుంబాలు క్యాంప్‌లో ఉండడంతో వారి ఇళ్ల తాళాలు పగలుగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. అలాగే కోటదుర్గమ్మవారి వీధిలో అరబిందో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న బొత్స శ్రీహరిరావు నివాసంలో కూడా ఎవరూ లేకపోవడంతో ఇంటిలోకి దుండగులు ప్రవేశించారు. అయితే రామకృష్ణారెడ్డి, శ్రీహరిరావు ఇళ్లల్లో విలువైన వస్తువులు లేకపోవడంతో ఇళ్లను చిందరవందర చేశారు. లెక్చరర్స్ కాలనీకి చెందిన పెద్ది మహేశ్వరరావు నివాసంలో కేజీ 350 గ్రాములు వెండి, 7 గ్రాములు బంగారం అపహరించుకుపోయారు. క్లూస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని నేరస్థుల ఆధారాలు సేకరించాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై దామోదరరావు తెలిపారు. ఒకే రోజు మూడిళ్లలో చోరీ కేజీ 350 గ్రాములు వెండి, 7 గ్రాముల బంగారం అపహరణ ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్ -
జాతీయ సైక్లింగ్ పోటీలకు తోండ్రంగి విద్యార్థులు
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని తోండ్రంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. డిసెంబర్ 21 నుంచి 23 వరకు కృష్ణా జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు సీహెచ్.నారాయణరావు, బి.అనుపమ, జె.వెన్నెల, పి.థెరిసా, ఒ.సౌమ్య, ఎం.సౌజన్య, ఎన్.జ్యోషిత, కె.మాదురి, డి.హేమలత, ఎస్.అవినాష్, కె.కావ్య సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నెల 22 నుంచి 26 వరకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో, ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు ప్రతిభను చాటనున్నారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కడలి రమేష్‌కుమార్, పీడీ సత్యనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. -
27 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
పార్వతీపురం: పార్వతీపురం నుంచి అలమండకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 27 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సీఎస్‌డీటీ ఎం.రాజేంద్ర తెలిపారు. సోమవారం సాయంత్రం ముందస్తు సమాచారం మేరకు మండలంలోని పెదబొండపల్లి గ్రామంవద్ద బొలెరో వాహనంలో 54 ప్లాస్టిక్ సంచుల్లో తరలిస్తున్న 2700 కిలోల పీడీఎస్ బియ్యం విజిలెన్స్ ఎస్సై రామారావు ఆధ్వర్యంలో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడీఎస్ బియ్యాన్ని విక్రయించినా, కొనుగోలు చేసినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ పోటీలకు ఎంపికై న తిరుమల కళాశాల విద్యార్థిని
విజయనగరం ఫోర్ట్: తిరుమల నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. కళాశాలకు చెందిన ఉజ్జి కావ్యాంజలి ఈనెల 17, 18 తేదీల్లో ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సెపక్ తక్రా (లెగ్ వాలీబాల్) పోటీల్లో పాల్గొని తృతీయస్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. జనవరి 22వతేదీన నంద్యాల జిల్లాలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో కావ్యాంజలి పాల్గొంటుంది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నందుకు ఆమెను కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె.తిరుమల ప్రసాద్ అభినందిస్తూ, ఆమెకు రూ.5 వేలు నగదు బహూకరించారు.