
మహిళల మనస్తత్వాన్ని మార్చలేం
● చెత్తను బయటపడేస్తారు.. కుళాయిలు విరిచేస్తారు.. ● జెడ్పీ స్థాయి సంఘ సమావేశంలో ఎమ్మెల్యే కూన వ్యాఖ్యలు
శ్రీకాకుళం: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం విషయమై మాట్లాడుతూ మహిళలు ఇంట్లో చెత్తను తీసుకువచ్చి బయట పడేస్తున్నారని, పరిసరాలు ఎలా ఉన్నా వారికి అనవసరమని చెప్పారు. తాగునీటి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు వీధి కుళాయిలు వద్దని, ఇంటింటి కుళాయిలే మంచివని చెబుతూ ఆడవాళ్లు కుళాయిల ట్యాపులు కట్టకుండా వదిలేసి వెళ్లిపోతారని, అవసరమైతే కుళాయిలను విరిచేస్తారని చెప్పారు. ఈ రెండు వ్యాఖ్యానాలు చేసిన అనంతరం మహిళలను కించపర్చటం తన ఉద్దేశం కాదంటూనే వారి మనస్తత్వం ఇలా ఉంటుందని, వారిని మార్చటం సాధ్యం కాదన్నారు.
గ్రంథాలయ వ్యవస్థ వృథా..
పంచాయతీలకు వచ్చే ఆదాయంలో గ్రంథాలయ పన్ను పోతుందని అంటూ గ్రంథాలయ వ్యవస్థే పనికిరానిదని కూన పేర్కొన్నారు. ఆ వ్యవస్థకు ఒక చైర్మన్, జీతం, ఇతర ఖర్చులు కూడా వృథాయేనని చెప్పారు. ఈ వ్యవస్థ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.
ప్రగతి పథంలో నడిపించాలి..
జిల్లాలో ఉన్న ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో రాజకీయాలకు అతీతంగా పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో చేపడుతున్న సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ, పింఛన్లు తదితర ఖర్చుల వివరాలను ఆయా శాఖల అధికారులు వివరించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. పన్నులు వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ ఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైస్ చైర్మన్ సిరిపురం జగన్మోహనరావు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

మహిళల మనస్తత్వాన్ని మార్చలేం