
భువనేశ్వర్ – పూరీ హైవే విస్తరణ
భువనేశ్వర్: భువనేశ్వర్–పూరీ హైవే విస్తరణకు మార్గం సుగమం అయింది. ఈ మార్గం 6 వరుసలుగా విస్తరించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం మేరకు ఈ విస్తరణ వ్యయ ప్రణాళిక రూ.1,200 కోట్లు. దీని వల్ల ఈ మార్గంలో ప్రయాణ సమయం ముప్పావు గంటకు పరిమితం అవుతుంది. ఈ మార్గం 8 వరుసల విస్తరణతో సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనివల్ల భువనేశ్వర్ పూరి మధ్య ప్రయాణ సమయం 90 నిమిషాల నుంచి 45 నిమిషాలకు తగ్గుతుంది. రాష్ట్ర రహదారులు త్వరలో అత్యున్నత నాణ్యత, స్థాయిలో అమెరికా రహదారులకు సమానంగా ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భువనేశ్వర్, పూరీ మధ్య 8 లైన్ల రహదారి రాబోయే 100 ఏళ్ల అవసరాలను తీర్చగలదు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వైపు ప్రతిపాదిత తీరప్రాంత రహదారిని 4 వరుసలుగా విస్తరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.