
ఉత్తరాంధ్ర సాగునీటి కల సాకారమే లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర జిల్లాల సాగునీటి భవితవ్యాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పాత, కొత్త ప్రాజెక్టులన్నింటినీ సమాన ప్రాధాన్యతతో పూర్తి చేసి, ప్రతి చివరి భూమికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జలవనరుల శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వంశధారపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నేరడి సైడ్ వియర్ వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలను వెంటనే తొలగించి, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా హిరమండలం రిజర్వాయర్‌కు నిరంతరాయంగా నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒడిశాతో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పనులు ఆలస్యం చేస్తున్న ఏజెన్సీలకు తక్షణమే నోటీసులు జారీ చేసి, టెండర్ నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పనులకు నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ, పనులు నెమ్మదిగా సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొట్ట ఎత్తిపోతల పథకం పూర్తయితే 12 టీఎంసీల నీరు హిరమండలం రిజర్వాయర్‌కు తరలించవచ్చని, ఇది కీలకమైన ప్రాజెక్టు అని మంత్రి తెలిపారు. గొట్ట బ్యారేజ్ ఆప్రాన్ పనుల కోసం రూ.12.81 కోట్ల టెండర్లను వెంటనే పిలవాలని ఆదేశించారు.
షట్టర్ల కుంభకోణంపై చర్చ సందర్భంగా, కోర్టు అనుమతి పొంది వెంటనే షట్టర్లను స్వాధీనం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. నాగావళి–వంశధార నదుల అనుసంధాన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. రణస్థలం పైడి భీమవరం పారిశ్రామికవాడకు సాగునీటి ప్రాజెక్టుల నుంచి నిరంతరాయంగా నీటి సరఫరా ఉండేలా చొరవ చూపాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు కోరారు. కళింగపట్నం, అంబల్లవలస ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంత్రిని కోరారు.