
అగ్నికి ఆహుతైన ఎర్రచందనం చెట్లు
టెక్కలి: కోటబొమ్మాళి మండలం శ్రీజగన్నాథపురం పంచాయతీ బిర్లంగిపేట గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు నూక సత్యరాజ్‌కు చెందిన సుమారు 2 ఎకరాల ఎర్ర చందనం తోటలో గురువారం రాత్రి అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్క సారిగా మంటలు వ్యాపించి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్, కోటబొమ్మాళి మండల కన్వీనర్ సంపతిరావు హేమసుందర్‌రాజు, జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, నాయకులు పేడాడ వెంకటరావు, సత్తారు సత్యం తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడు సత్యరాజ్‌కు అండగా నిలిచారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ఇలా వికృత చేష్టలకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేసి బాధితుడికి న్యాయం చేయాలని నాయకులు కోరారు.

అగ్నికి ఆహుతైన ఎర్రచందనం చెట్లు