సాక్షి, తణుకు: ఏపీ సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసి సూపర్ బాదుడు అమలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఒకపక్క పెరిగిన పేదలు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు మాత్రం నిర్మల సీతారామన్‌ను ఒక పర్సెంట్ జీఎస్టీ పెంచుకోవటానికి అనుమతి అడుగుతున్నారుని అన్నారు.
మాజీ మంత్రి కారుమూరి ఆదివారం తణుకు వైఎస్సార్‌సీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాం పేదవారిని లక్షాధికారిని చేస్తామని చంద్రబాబు అబద్దాలు చెప్పాడు. ఆనాడు బాదుడే బాదుడు అని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేంటి?. సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు.. ప్రజలకు సూపర్ బాదుడు అమలు చేస్తున్నారు.
నాణ్యమైన కరెంట్ ఇస్తామని కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పి సూపర్ బాదుడు బాదుతున్నారు. ఆనాడు లోకేష్ రైతులను ఉద్దేశించి స్మార్ట్ మీటర్లు ఎవరూ పెట్టుకోవద్దని, అవి బిగిస్తే బద్దలు కొట్టాలని చెప్పాడు. ఇప్పుడు కేంద్రంతో కుమ్మక్కై స్మార్టుగా స్మార్టు మీటర్లు బిగించేస్తున్నారు. ఇది రైతులను మోసం చేసినట్లు కాదా?. వందల కోట్లు చందాలు వసూలు చేసి అగ్గిపెట్టె, కొవ్వొత్తులకి అయిపోయాయని మోసం చేశారు. అన్ని నిత్యవసర ధరలను ఇష్టానుసారం పెంచేశారు.
ఒక్కసారి గమనిస్తే నూనె దగ్గర నుండి పప్పులు, ఉప్పులు, కూరగాయలు అన్నీ కూడా దారుణంగా పెంచేశారు. ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలను ప్రజలకు ఒక్కసారి గమనించుకోండి. ఒక పక్క పేద ప్రజలు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు మాత్రం ఒక పర్సెంట్ జీఎస్టీ పెంచుకోవడానికి ఆర్థిక మంత్రిని అనుమతి అడుగుతున్నారు. అన్నీ అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసి వచ్చారు కూటమి నేతలు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పే మీరు ఎక్కడ సంపద సృష్టించారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై నిందలు మోపారు. అసెంబ్లీ సాక్షిగా అన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. మరి ఇప్పుడేం సమాధానం చెబుతారు’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment