బీజేపీతో దోస్తీకి సుముఖం! | BJP dostiki open! | Sakshi
Sakshi News home page

బీజేపీతో దోస్తీకి సుముఖం!

Published Thu, Jan 1 2015 2:03 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

బీజేపీతో దోస్తీకి సుముఖం! - Sakshi

బీజేపీతో దోస్తీకి సుముఖం!

  • కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ సంకేతాలు
  • కశ్మీర్ తీర్పు మోదీకి ఓ సవాలు, అవకాశమన్న మెహబూబా ముఫ్తీ
  • పార్టీ ఏదైనా పీడీపీ అజెండాను గౌరవించాలని వ్యాఖ్య.. గవర్నర్‌తో భేటీ అయిన  పీడీపీ నాయకురాలు
  • జమ్మూ: జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు.. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీకి ఒక సవాలు, ఒక అవకాశం అని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని  పేర్కొన్నారు. తద్వారా.. రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన తమ పార్టీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటంపై ఆ పార్టీతో చర్చలు జరిపేందుకు వ్యతిరేకం కాదని స్పష్టమైన సంకేతాలిచ్చారు.

    రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా ఆహ్వానం మేరకు మెహబూబా బుధవారం ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఇదో పెద్ద బాధ్యత. మోదీకి ఇదో పెద్ద బాధ్యత. జమ్మూకశ్మీర్ అనేది నెహ్రూ నుంచి నేటి వరకూ ఏ ప్రధానికైనా అతి పెద్ద సవాలుగా ఉంది. అభివృద్ధి తన స్వప్నమని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని మోదీ చెప్తున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో శాంతియుత వాతావరణం లేకుండా అభివృద్ధి జరగదు. వాజ్‌పేయి రాజకీయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా అభివృద్ధి సాధ్యం కాదు.

    వాజ్‌పేయి ఒక రాజకీయ ప్రక్రియను ప్రారంభించారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించారు. హురియత్‌తో  బేషరతు చర్చలు ప్రారంభించారు. అద్వానీ ఉప ప్రధానమంత్రిగా ఉన్నపుడు వాజ్‌పేయి పాక్‌తో చర్చలు ప్రారంభించారు. రాష్ట్రానికి ఉదార ఆర్థిక ప్యాకేజీ లభించింది. యూపీఏ సర్కారు దీనిని కొంత కాలం కొనసాగించింది.. ఆ తర్వాత నిలిపివేసింది’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘ఏ కూటమి ఏర్పాటైనా.. అది ప్రజా తీర్పును, సఖ్యత అనే సూత్రాన్ని గౌరవించాలి.

    దీనిని పాటించనంతవరకూ ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా నిష్ర్పయోజనమే’ అని అన్నారు. గవర్నర్‌తో మాట్లాడిన అంశాల గురించి వెల్లడించలేదు. అయితే.. కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం మెజారిటీని కూడగట్టుకోవటం తమ పార్టీ ప్రాధాన్యం కాదని చెప్పారు. పీడీపీకి 55 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్న మీడియా కథనాలను ఉటంకించారు. ‘భాగస్వామ్య పక్షం బీజేపీయా, ఎన్‌సీయా, కాంగ్రెస్సా అనేది సమస్య కాదని.. సఖ్యత కోసం పీడీపీ ఎజెండాను గౌరవించడమనేది ముఖ్యం. నాయకత్వమనేది ఈ సవాలును స్వీకరించి ప్రజాతీర్పును తలదాలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 15 నిమిషాల పని’ అని పేర్కొన్నారు.
     
    ముఫ్తీ వ్యాఖ్యలను ఆహ్వానిస్తున్నాం: బీజేపీ

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలను ఉటంకిస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబాముఫ్తీ వ్యాఖ్యలను, మీడియా ద్వారా ఇచ్చిన సంకేతాలను తాము ఆహ్వానిస్తున్నామని, అభినందిస్తున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ పేర్కొన్నారు. తమ రెండు పార్టీల మధ్య సమాచార సంబంధం నెలకొల్పుకున్నామని.. ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు చర్చలను లాంఛనంగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు తొలుత చొరవ తీసుకోవాలని, ఆ తర్వాత కాంగ్రెస్ వైఖరి ఏమిటనేది చెప్తామని జమ్మూకశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు సైఫుద్దీన్ సోజ్ పేర్కొన్నారు.
     
    12వ అసెంబ్లీ ఏర్పాటుపై నోటిఫికేషన్

    జమ్మూకశ్మీర్‌లో 12వ అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అనుమతితో జనవరి 20తో కాలపరిమితి తీరిపోతున్న 11వ అసెంబ్లీ స్థానంలో... 12వ అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ అయిందని న్యాయశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన సభ్యులు ప్రమాణం చేస్తారని చెప్పారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఏర్పాటుపై ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంటుంది. అయితే, రాజ్యాంగం ప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఆ పనిని న్యాయ శాఖ చేస్తుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement