- అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు
- కశ్మీర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించనున్న పీడీపీ
- రెండో స్థానానికి ‘కమలం’ పరిమితమయ్యే అవకాశం
- జార్ఖండ్‌లో బీజేపీకే పీఠం దక్కే చాన్స్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రధాన రాజకీయ పార్టీలపై ఎగ్జిట్ పోల్స్ నీళ్లు చల్లాయి. రాష్ట్రంలో ఏ పార్టీకీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ ఫలితాలు రావచ్చని అంచనా వేశాయి. ప్రతిపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చని తెలిపాయి. తద్వారా సార్వత్రిక ఎన్నికలతోపాటు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బాగా పనిచేసిన ‘మోదీ మాయాజాలం’ జమ్మూకశ్మీర్‌లో పనిచేయలేదని చెప్పకనే చెప్పాయి.
తొలి నుంచీ బాగా పట్టున్న జమ్మూ ప్రాంతంలో మినహా కశ్మీర్ లోయ, లడఖ్‌లలో ఓటర్లు బీజేపీని తిరస్కరించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ప్రధాని మోదీ ప్రకటించిన అభివృద్ధి నినాదంతోపాటు ‘మిషన్ 44 ప్లస్’ సీట్ల లక్ష్యంతో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తీవ్ర నిరాశను కలిగించనున్నాయి.
అలాగే అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తహతహలాడుతున్న నేషనల్ కాన్ఫరెన్స్‌ను ఈ అంచనాలు నైరాశ్యంలో ముంచెత్తనుండగా పీడీపీ శిబిరంలో మాత్రం ఉత్సాహం నింపనున్నాయి. మరోవైపు జార్ఖండ్ పీఠం మాత్రం కమల దళానికే దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. జార్ఖండ్‌లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని వివరించాయి. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)తోపాటు కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి వరుసగా రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకునే అవకాశం ఉందని తెలిపాయి.
ఈ మేరకు ఇరు రాష్ట్రాల్లో శనివారం సాయంత్రం ఐదో, తుది దశ పోలింగ్ ముగిసిన వెంటనే పలు చానళ్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. ఈ నెల 23న వెలువడనున్న ఎన్నికల ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు అద్దం పడతాయో మరో రెండు రోజుల్లో తేలనుంది. రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.