అధికారం ఇస్తే నంబర్ వన్ చేస్తా..
జార్ఖండ్ ప్రజలకు ప్రధాని మోదీ హామీ
⇒ ఖనిజాలు దోచుకునేవారికి కళ్లెం వేస్తాం
⇒ లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా కాంగ్రెస్‌లో మార్పురాలేదు
జంషెడ్‌పూర్: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీతో అధికారం ఇస్తే జార్ఖండ్‌ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. శనివార మిక్కడ జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, ఖనిజ సంపదతో తులతూగే రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించేది ఈ ఎన్నికలేనన్నారు. ఖనిజాలను దోచుకునే వారికి కళ్లెం వేసి, రాబోయే కొన్నేళ్లలో రూ. 20 వేల కోట్లు రాష్ట్రానికి రాబడి చేకూర్చేలా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.
2000వ సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రం ప్రస్తుతం టీనేజీలో ఉందని, ఇప్పటివరకూ నెమ్మదిగా ఎదిగినా ఇకపై టీనేజీ యువతలా వేగం పుంజుకుంటుందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం రూపొందించిన బొగ్గు విధానాన్ని ప్రస్తావించిన మోదీ.. దాంతో దోపిడీ దారులకు ముకుతాడు పడుతుందన్నారు. అనంతరం రాంచీలో జరిగిన మరో సభలో కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెంది, కనీసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా దక్కకపోయినా కాంగ్రెస్ తన విధానాలను మార్చుకోవడం లేదని విమర్శించారు సంకీర్ణ భాగస్వామ్యాలకు ఇక దేశంలో కాలం చెల్లిందని, స్థిరమైన ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లు ఒకేసారి ఏర్పడినా.. ఛత్తీస్‌తో పోలిస్తే జార్ఖండ్ వెనబడిందని అన్నారు. రాంచీ సభలో మాట్లాడుతూ.. రాయ్‌పూర్‌ను నిర్మించుకుని ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. జార్ఖండ్ కార్యాలయాలు మాత్రం ఇంకా అద్దె గృహాల్లో నడుస్తున్నాయని చెప్పారు.