బిహార్ కు 1.25 లక్షల కోట్లు | PM Narendra Modi Announces Rs 1.25 Lakh Crore Special Package for Bihar | Sakshi
Sakshi News home page

బిహార్ కు 1.25 లక్షల కోట్లు

Published Wed, Aug 19 2015 1:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బిహార్ కు 1.25 లక్షల కోట్లు - Sakshi

బిహార్ కు 1.25 లక్షల కోట్లు

బిహార్‌లో 11 జాతీయ రహదారులకు ప్రధాని శంకుస్థాపన
సహర్సలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ
యూపీఏ ఇచ్చిన ప్యాకేజీ చిన్నపిల్లలకు ఇచ్చే చాక్లెట్ వంటిది
బిహార్ సమగ్ర అభివృద్ధి కోసం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నానని వెల్లడి

 
అరా/సహర్స: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 1.25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని కంకణం కట్టుకున్న బీజేపీ తరఫున మోదీ మంగళవారం రాష్ట్రంలోని అరాలో జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటంతో పాటు.. సహర్సలో ఎన్నికల సభలో ప్రసంగించారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం దేశానికి తిరిగివచ్చిన మోదీ.. కొన్ని గంటల్లోనే బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు.. మోదీని పట్నా విమానాశ్రయంలో ఆహ్వానించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్.. అరాలో జరిగిన జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన వేడుకలకు హాజరుకాలేదు. రాష్ట్రంలో మొత్తం 700 కి.మీ. నిడివి గల 11 జాతీయ ప్రాజెక్టులను రూ. 9,700 కోట్లతో నిర్మించే పథకానికి మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. మోదీతో పాటు.. రాష్ట్ర రోడ్డు నిర్మాణ అభివృద్ధి మంత్రి రాజీవ్‌రంజన్‌సింగ్ వేదికపై ఆసీనులయ్యారు.

 బిహార్ భవిష్యత్తును మార్చే ప్యాకేజీ ఇది...
 ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ నితీశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అత్యల్పంగా రూ. 12,000 కోట్ల ప్యాకేజీ కావాలని గత యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం ద్వారా నితీశ్ బిహార్ గౌరవానికి భంగం కలిగించారని విమర్శించారు. బిహార్‌కు ‘బీమారు’ స్థాయి విషయంలోనూ నితీశ్‌పై మండిపడ్డారు. ‘నా హామీని నిలబెట్టుకోవటానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాను. నేను రూ. 50,000 కోట్లు అని చెప్పాను.. మీకెంత కావాలి? రూ. 60 వేల కోట్లు? రూ. 70 వేల కోట్లు? రూ. 80 వేల కోట్లు? లేక రూ. 90 వేల కోట్లు? నేను రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తున్నాను. బిహార్ భవిష్యత్తును మార్చేందుకు ఢిల్లీలోని (కేంద్ర) ప్రభుత్వం రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది’ అని ‘మోదీ.. మోదీ..’ అంటూ సభికులు చేస్తున్న హర్షధ్వానాల మధ్య ప్రధాని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర నిధులతో కొనసాగుతున్న రూ. 40 వేల కోట్లకు అదనంగా పై ప్యాకేజీ ఉంటుందన్నారు. అయితే.. ఆ ప్యాకేజీ పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. పదేళ్లుగా బిహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూను ఓడించి ఆ రాష్ట్రాన్ని గెలుచుకునేందుకు.. బిహార్ వ్యాప్తంగా ప్రజాకర్షణ గల నేత లేకపోవటంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మోదీ కరిజ్మాపైనే ఆధారపడింది. వెనుకబడ్డ ఈ రాష్ట్రానికి ప్రతి ఎన్నికల సందర్భంగానూ ఆర్థిక ప్యాకేజీ అనేది కీలకాంశంగానే ఉంది. తాజాగా మోదీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించటంతో.. రాష్ట్ర బీజేపీ నేతలు దీనిద్వారా ఎన్నికల్లో ఓట్ల పంట పండుతుందని ఆశలు పెట్టుకున్నారు.

 ఇప్పటికే జంగల్ రాజ్ అడుగుపెట్టింది...
 అనంతరం.. సహర్సలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌తో కలిసి నితీశ్  లౌకిక కూటమిని ఏర్పాటు చేయటంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘బిహార్‌లో ‘జంగల్ రాజ్’ (ఆటవిక రాజ్యం) అడుగుపెట్టినట్లు ఇప్పటికే వినిపిస్తోంది. 2015లో జనవరి-జూన్ మధ్య తీవ్ర నేరాలు 34 శాతం పెరిగాయి. హత్యలు 46 శాతం, అల్లర్లు 72 శాతం పెరిగాయి. ఇవి జంగల్ రాజ్ గుర్తులు కావా? మీ జీవితాలు కష్టతరమవుతాయా కాదా?’ అని అన్నారు. ‘మీరు పట్నాలో మాకు అధికారం ఇవ్వండి. మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాం’ అని చెప్పారు. నితీశ్ కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవటం.. ఆ పార్టీ ప్రభుత్వం జైలులో పెట్టిన దివంగత సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్‌కు ద్రోహం చేయటమేనన్నారు.  తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బిహార్‌లోని కోశి వరద బాధితుల కోసం తన గుజరాత్ ప్రభుత్వం పంపించిన రూ. 5 కోట్ల చెక్కును నితీశ్ తిప్పి పంపించటాన్ని ప్రస్తావిస్తూ.. అది ఆయన తీవ్ర అహంకారమని మండిపడ్డారు. అహంకారం వీడని వారిని పక్కన పెట్టాలా వద్దా అని ప్రశ్నించారు. ఈ సభలో బీజేపీ మిత్రపక్షాల నేతలు, కేంద్రమంత్రి రాంవిలాస్‌పాశ్వాన్, మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌మాంఝీ, కేంద్రమంత్రి ఉపేంద్రకుష్వాహా, బీజేపీ సీనియర్ నేతలు సుశీల్‌కుమార్‌మోదీ తదితరులు పాల్గొన్నారు.
 
కడుపు నిండితే.. తిండి కోసం అడుగుతారా?

‘బిహార్‌ను బీమారు రాష్ట్రాల స్థాయి నుంచి బయటకు తెస్తానని అన్నప్పుడు.. మన సీఎం చాలా ఆగ్రహించారు. బిహార్ ఇంకెంతమాత్రం బిమారు రాష్ట్రం కాదన్నారు.. అదే నిజమైతే.. చాలా సంతోషిస్తాను. కానీ.. ఎవరైనా ఆరోగ్యంగా ఉంటే.. అతడు వైద్యుడి దగ్గరకు వెళ్తాడా? చెప్పండి. ఎవరి కడుపైనా నిండివుంటే ఆహారం కోసం బయటకెళ్తారా? ఆయన ఒకవైపు బిహార్ బిమారు రాష్ట్రం కాదని అంటారు.. మరోవైపు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు.. బిహార్ ప్రజలు నిర్ణయించాలి’ అని మోదీ పేర్కొన్నారు. ఇటీవల తన వ్యాఖ్యలపై నితీశ్ చేసిన విమర్శలను, కేంద్రం నుంచి ఆర్థిక ప్యాకేజీ కోసం పదే పదే అడుగుతుండటాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. బిహార్ రాష్ట్ర విభజన అనంతరం 2003లో నాటి వాజ్‌పేయి ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన రూ. 10 వేల కోట్లను, 2013లో యూపీఏ ప్రభుత్వం నుంచి అందుకున్న రూ. 12 వేల కోట్లను ఖర్చుపెట్టటంలో బిహార్ ప్రభుత్వం విఫలమైందన్నారు. 2013లో నితీశ్ ఎన్డీఏ నుంచి బయటకొచ్చాక ‘ఢిల్లీ దర్బార్’కు వెళ్లి తన గౌరవాన్ని కాపాడుకునేందుకు రాష్ట్రానికి ఏదైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని.. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన బిహార్ ప్రతిష్టను పణంగా పెట్టారని మోదీ విమర్శించారు. నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన రూ. 12,000 కోట్ల ప్యాకేజీ.. బాగా ఏడ్చే చిన్న పిల్లలకు ఇచ్చే చాక్లెట్టు, బిస్కెట్టు వంటిదని అభివర్ణించారు. ‘ఆయన రూ. 12,000 కోట్లు పొందారు.. దానిపై నాట్యం చేయటం మొదలుపెట్టారు. బిహార్ ఆత్మగౌరవాన్ని ఈ ప్యాకేజీకి ప్రతిఫలంగా చెల్లించారు’ అని ధ్వజమెత్తారు. గత యూపీఏ ప్రభుత్వంలా ముక్కల ముక్కల విధానం కాకుండా.. బిహార్ సమగ్ర అభివృద్ధిని తాను కోరుకుంటున్నానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement