హిందీ మాతృభూమిలో బీజేపీ హవా | BJP again back to rule in bihar | Sakshi
Sakshi News home page

హిందీ మాతృభూమిలో బీజేపీ హవా

Published Fri, Jul 28 2017 6:09 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

హిందీ మాతృభూమిలో బీజేపీ హవా - Sakshi

హిందీ మాతృభూమిలో బీజేపీ హవా

న్యూఢిల్లీ: బిహార్‌ ప్రభుత్వాన్ని కూడా కలిపేసుకోవడంతో హిందీ మాట్లాడే రాష్ట్రాలన్నింటినీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కైవసం చేసుకున్నట్లయింది. జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అప్రతిహతంగా సాగిన బీజేపీ విజయ ప్రస్థానానికి మధ్యలో బిహార్‌ అడ్డుకట్ట వేసింది. 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ, అమిత్‌ షాల వ్యూహానికి తిరుగులేదనుకుంటున్న సందర్భంలో కూడా 2015లో జరిగిన ఎన్నికల్లో బిహార్‌ ప్రజలు బీజేపీని ఓడించారు. ఎలాగైతేనేమి ఇప్పుడు జేడీయూ నాయకుడు నితీష్‌ కుమార్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వంలో చేరింది.

2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయంతో నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ విస్తరణ మరికొన్ని రాష్ట్రాలకు సాగుతుందని రాజకీయ విశ్లేషకులు ఊహించారు. అనూహ్యంగా 2015లో ఢిల్లీ, బిహార్‌ అసంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో పరాజయం ఎదురయింది. అయినా గానీ నిరుత్సాహపడకుండా వరుసగా పలు రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకెళ్లింది. 2016లో కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో పార్టీకి పెద్దగా బలం లేకపోయినప్పటికీ ఓటు శాతాన్ని పెంచుకోగలిగింది. ఆ తర్వాత ఎలాంటి ఎన్నికలు లేకుండా ఉత్తరాఖండ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నించింది. సుప్రీం కోర్టు జోక్యం వల్ల ఆ ప్రయత్నాలు అప్పుడు ఫలించలేదు. అయినప్పటికీ ఏదో విధంగా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగించడంతో 2016 డిసెంబర్‌ నెలలో అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఆ తర్వాత కొన్ని నెలల్లో ఉత్తరాఖండ్‌కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది.

2017లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ విజయం సాధించినప్పటికీ గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకన్నా తక్కువ సీట్లు వచ్చాయి. అయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆమ్‌ ఆద్మీ పార్టీ గుండెల్లో గుబులు పుట్టించింది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలను కైవసం చేసుకుంటూ వెళుతోంది. సాధారణంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడం ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఆనవాయితీ. దాదాపు హిందీ రాష్ట్రాలన్నింటినీ కైవసం చేసుకొని ఈశాన్య రాష్ట్రాలకు కూడా విస్తరించిన బీజేపీకి ఈ ఏడాది హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లోకి విస్తరించడమే బీజేపీకి కష్టమైన ఎజెండా. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ విజయం సాధించినప్పుడు అలా ఇతర దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించుకుంటూ పోవాలని ఆశించింది. అయితే 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఆ పార్టీ ఆశలకు గండిపడింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నందున మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ ఆశిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీకి, తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీలు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక తూర్పునున్న ఒడిశా రాష్ట్రంలో బీజేపీ ఇంతవరకు ఎన్నడూ గెలవలేదు. వరుసగా నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలో బీజూ జనతాదళ్‌ నాలుగుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నందున తాము అధికారంలోకి వస్తామని బీజేపీ ఆశిస్తోంది.

సంప్రదాయబద్ధంగానైతే ఒరిషాలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలి. కానీ స్థానిక కాంగ్రెస్‌ శాఖ అంత క్రియాశీలకంగా లేకపోవడం, కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నందున ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ పోరాటం అనంతరం మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి రావడం బీజేపీకి అంత సులభమైన విషయం ఏమీ కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement