‘కూటమి’ మహాజన విజయం
సందర్భం
బీహార్ ఎన్నికల రణరంగంలో కాషాయ శక్తులు పన్నిన ‘పద్మ’వ్యూహాన్ని ఛేదించటంలో బహుళ బహుజన సామాజిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ శక్తులు నిర్వహించిన కీలకపాత్రను లౌకిక బుద్ధిజీవులు, వామపక్షవాదులు విస్మరించటం విచారకరం.
కిరీటానికి అలంకరించిన తురాయి వలన దానికి వన్నె వచ్చే మాట నిజం. కానీ కిరీటం అనేది లేకపోతే ఆ తురాయి కేవలం పక్షి ఈకలాగానే మిగిలిపోతుంది తప్ప దానికి కలికితురాయి సొగసు రాదు. అందుకు భిన్నంగా తురాయి లేకపోయినా కిరీటాన్ని ధరిం చిన కిరీటధారి కిరీటిలా రాజసాన్ని ప్రదర్శించగలడు. అలానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించటానికి పరోక్షంగా పలు అంశాలు తోడ్పడినా వాటికవే, వాటంతటవే జయాపజయాల్ని నిర్దేశించలేదు. మరైతే జయాపజయాల్ని నిర్దేశించిన కీలకాంశం ఏమిటి? దీనికి త్పోడిన ఇతర ప్రభావిత అం శాలు ఏమిటి? వీటిని మహాకూటమి సమర్థవంతంగా ఎలా సద్వినియోగం చేసుకొంది? అనే విషయాల్ని వాస్తవాల్లోకి, లోతుల్లోకి వెళ్లి పరిశీలిద్దాం.
సార్వత్రిక ఎన్నికల తర్వాత తానిచ్చిన హామీలను నెరవేర్చకుండా మాట తప్పి మళ్లీ హిందూత్వని తెర మీదకి తెచ్చినందుకు నిసరనగా బీహార్ ప్రజలు బీజేపీని ఓడించారని పార్లమెంటరీ ప్రజాస్వామ్యవాదులు భాష్యం చెపుతున్నారు. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ కంటే దూకుడుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాన్ని తిరస్కరిస్తూ సామాన్య ప్రజలు ఇచ్చిన తీర్పుగా వామపక్ష ఆర్థిక వాదులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభావిత అంశాలన్నీ బీహార్‌లో మహా కూటమి విజ యానికి పరోక్షంగా తోడ్పడి ఉండవచ్చు. కానీ బీహార్ ఎన్నికల రణరంగంలో కాషాయ శక్తులు పన్నిన ‘‘పద్మ’’ వ్యూహాన్ని ఛేదించటంలో బహుళ బహుజన సామాజిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ శక్తులు నిర్వహించిన కీలక పాత్రను వీరు విస్మరించటం విచారకరం.
హిందువుల మత విశ్వాసాన్ని ప్రాతిపదికగా చేసు కొని గోవధ నిషేధాన్ని కేంద్ర బిందువుగా మార్చింది కేవలం గో సంరక్షణ కోసం కాదు. గోవధకు పాల్పడే ముస్లింలు.. హిందువుల మనోభావాల్ని కించపరిచారనే సాకుతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టింది హిందువుల్ని మతతత్వ రాజకీయశక్తిగా వర్గీకరించడం కోసం. మెజా రిటీ హిందూ ఓటు బ్యాంక్ రాజకీయ ఎత్తుగడతో బీహా ర్ అసెంబ్లీ ఎన్నికల్ని గెలవటం కోసం. అందుకే బుద్ధి జీవులు మత అసహనంపై ఎంతగా నిరసన ప్రదర్శిం చినా హిందుత్వ శక్తులు కౌంటర్ నిరసనలతో ఎదురుదా డికి దిగారు తప్ప వెనక్కి తగ్గలేదు.
ఈ హిందూత్వ వైరస్ బారిన పడిన గ్రామీణ యువకుల మనోభావాలు ఎలా మారిపోయాయో గమ నించాలంటే దాద్రి ప్రాంతంలో మహ్మద్ అఖ్లాక్ హత్య జరిగిన తరువాత అక్కడ జనాభిప్రాయం ఎలాంటిదో తెలుసుకోవటానికి ఓ పాత్రికేయుడు వేసిన ప్రశ్నకు స్థానిక యువకుడు ఇచ్చిన సమాధానం చూస్తే తెలు స్తుంది. ‘‘ఈ దేశంలో హిందువుల మనోభావాన్ని గౌర విస్తేనే ఇక్కడ బతకనిస్తాం. లేదంటే పాకిస్తాన్‌కి పారదో లతాం. దేశాన్ని విభజించి ముస్లింల కోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాక వాళ్ల అలవాట్ల ప్రకారం బతకా లంటే పాకిస్తాన్ పోవాలి గాని భారతదేశంలో ఉండటం దేనికీ? అంటున్న ఆ యువకుని దృష్టిలో హిందుత్వ అంటే జాతీయత, దేశీయత. ఈ కుహనా దేశభక్తులకు ఈ వైరస్ ఎక్కడ నుండి వ్యాపిస్తోందో గమనించండి.
మత అసహనంపై బుద్ధిజీవులు వ్యక్తం చేస్తున్న నిరస నని ప్రశ్నిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక ‘పాంచజన్య’ సంపాదకీయంలో ‘‘ఇది అసహనం సమస్య కాదు, ఆమోదం సమస్య’’ అని వ్యాఖ్యానించారు. గోవధ నిషే దాన్ని ఆమోదించి పాటిస్తే అసహనానికి తావేలేదు. కనుక ఆమోదించకపోవటం వలన ఉత్పన్నమవుతున్న అసహన సమస్యకు మూల కారకులు ముస్లింలే’’ అని వారినే దోషుల్ని చేశారు. హిందువుల మత విశ్వాసాలను హిందువులు పాటించటం కాక హిందూయేతర మతస్తు లైన ముస్లింలు కూడా పాటించాలని నియంత్రించటం కయ్యానికి కాలుదువ్వే ఎత్తుగడతో గిల్లికజ్జాలు పెట్టుకునే పన్నాగమేనని వేరే చెప్పక్కర్లేదు. ఆ సాకుతో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల్ని భౌతిక రాజకీయశక్తిగా సంఘ టితం చేయటమే వారి పథకం.
ఈ హిందూత్వ పద్మవ్యూహాన్ని ఛేదించే ప్రతివ్యూ హంతో దళిత బహుజనుల్ని ప్రత్నామ్నాయ రాజకీయ శక్తిగా సంఘటితపరిచి ఎదుర్కొన్నప్పుడే హిందుత్వ విఫలమైంది. ఉదా॥బాబ్రీమసీదు సమస్య సందర్భం గా ఎస్పీ, బీఎస్పీ కలిసి దళిత బహుజనుల్ని ప్రత్యామ్నా య రాజకీయశక్తిగా మార్చి ఎదుర్కొన్నప్పుడు (1992- 93) మాత్రమే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ బీజేపీ ఓడిపోయింది. అలా ఎదుర్కోలేనప్పుడు మాత్ర మే గోద్రా సమస్య సందర్భంలో మోదీ నేతృత్వంలోని హిందుత్వ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో బీజేపీయేతర రాజకీయ పక్షాల ఓట్లు చీలిపోకుండా జేడీ, ఆర్జేడీ, కాం గ్రెస్ పార్టీలు కలిపి మహాకూటమిగా ఏర్పడటం, దళిత బహుజన మెజారిటీతో హిందుత్వ మెజారిటీని మైనా రిటీగా మార్చి ఓడించటంతో గత యూపీ ఎన్నికల చరిత్ర పునరావృతమయింది. అంతే తప్ప కేవలం లౌకిక ప్రజాస్వామ్య శక్తుల నిరసన మాత్రమే హిందుత్వ మత తత్వ ఫాసిజాన్ని ఓడించలేదు.
కనుక అగ్రకుల పాలకవర్గాల స్వప్రయోజనం కోసమే సృష్టించిన హిందుత్వమతతత్వ మెజారిటీని ఓడించగల శక్తి, అగ్రకులేతర దళిత బహుజన మెజారి టీకే ఉందన్న సంగతి అందరికంటే ఎక్కువగా హిందుత్వ నేతలకే బాగా తెలుసు. అందుకే బీహార్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన వివిధ సామాజిక విభాగా లను విభాగీకరించి విభజించి పాలించే పన్నాగాలు ప న్నారు. కానీ విశృంఖల వ్యాఖ్యానాలు చేయటానికి బాగా అలవాటు పడిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అధినేతల అహంభావ ప్రకటనల వలన మరింత అభద్రతా భావా నికి గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహాజనులంతా ఏకమై మహాకూటమి ఘన విజయానికి వీజేపీ కూటమి ఘోరపరాజయానికి నాంది పలికారు. అందుకే ఒక్కమాటలో ఈ విషయం మహాకూటమి మహాజన విజయం.
వ్యాసకర్త, చైర్మన్, బహుళ బహుజన సమితి
ఉ. సాంబశివరావు ఈమెయిల్: ankush.pd@gmail.com