విద్వేషంపై బిహార్ ‘అసహనం’
‘విజయం కోసం కాదు...విలువల కోసం శ్రమించు, అంతిమంగా నువ్వే విజేతవు’ అంటాడు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ఏం మాట్లాడటానికైనా తమకు హక్కూ, అధికారమూ ఉన్నదని...రాబోయే పోరులో కాబోయే విజేతలం తామేనని ఆర్నెల్లనుంచి రెచ్చిపోతున్న కమలనాథులకు ఆదివారం ఉదయం బిహార్‌లో ఓటింగ్ యంత్రాల సీళ్లు తెరుచుకున్న కాసేపటికే నోళ్లు మూతబడ్డాయి. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ల నేతృత్వంలోని మహా కూటమి చిర స్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
రాష్ట్రంలోని 243 స్థానాల్లో 178 సీట్లను సాధిం చడమే కాదు...మొత్తం ఆరు ప్రాంతాల్లోనూ తిరుగులేని ఆధిక్యతను కనబ రిచింది. తమది మహా కూటమి మాత్రమే కాదు, మహత్తర శక్తి కూడానని నిరూపించింది. ఆ రెండు పార్టీలనూ ఆశ్రయించిన కాంగ్రెస్ కూడా ఇతోధికంగా లాభపడింది. పాటలీపుత్ర పీఠం తమదేననుకున్న బీజేపీకి గతంకంటే 38 సీట్లు కోతబెట్టి 53కి మాత్రమే పరిమితం చేసి విజ్ఞతలో తమకెవరూ సాటిరారని బిహార్ ఓటర్లు నిరూపించారు. విద్వేషమే ఎజెండా అయినపక్షంలో... అసహనమే తమ సమాధా నమని కరాఖండీగా చెప్పారు.
పార్టీ నేతలు కొందరు విద్వేషపూరిత ప్రసంగాలు చేసి కొంపముంచారని బీజేపీ నేత శేషాద్రి ఒక చర్చా కార్యక్రమంలో వాపోయారుగానీ...అందులో ఎవరు తక్కువని? నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో సునామీ సృష్టించిన బీజేపీ... బిహార్ ఎన్నికలకొచ్చేసరికి గోమాంసం చుట్టూ గిరికీలు కొట్టింది. దాన్నుంచి పక్కకు జరిగినప్పుడల్లా పాకిస్తాన్‌ను చర్చలోకి తీసుకొచ్చింది. ‘మేం నెగ్గకపోతే నష్టపోయేది బిహారే...మోదీకీ, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికీ ఏం కాదు’ అని వ్యాఖ్యానించిన సాక్షి మహరాజ్ మొదలుకొని బీజేపీ జాతీయా ధ్యక్షుడు అమిత్ షా వరకూ అందులో భాగమయ్యారు. ‘మేం ఓడితే పాకిస్తాన్‌లో టపాసులు పేలతాయి’ అని ఆయన అన్న మాటలు ఎవరూ మరిచిపోరు. ఇంకేమై నా తీరిక దొరికితే ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చేవారిగా...ఓబీసీ కోటాను ముస్లిం లకు దోచిపెట్టేవారిగా లాలూ, నితీష్‌లను చిత్రించడమే సరిపోయింది.
దాద్రీలో గోమాంసం తిన్నాడని నిండు మనిషిని కొట్టి చంపిన ఉదంతంపై ఈనాటి వరకూ నికరంగా మాట్లాడని బీజేపీ నాయకగణం...గోమాంసంపై నోరు మెదపరేమని నితీష్‌కుమార్‌ని ప్రశ్నిస్తూ పత్రికల మొదటి పేజీల్లో భారీయెత్తున వాణిజ్య ప్రకటన లిచ్చి అందరినీ విస్మయపరిచింది. గోవును కాపాడాలనీ, దాన్ని గోమాతగా భావించి పూజించాలనీ బీజేపీ నేతలు కోరుకోవడంలో తప్పులేదు. వారి విశ్వా సాలు వారివి. కానీ మనుషులు పాల్గొనే ఎన్నికల్లో... మనుషులు తెల్లారిలేస్తే ఎదుర్కొనే సమస్యలను ఏ ఒక్కటీ ప్రస్తావించని ఆ పార్టీ తీరు ఓటర్లను దిగ్భ్రమకు గురిచేసింది. పాకిస్తాన్ ప్రస్తావనే అవసరంలేని బిహార్ ఎన్నికల్లో బీజేపీ నేతలు పదే పదే దాన్ని తీసుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు అవిద్య, పేదరికం, అధిక ధరలు వంటి అంశాలను పూర్తిగా వదిలిపెట్టారు. వాటిని చర్చలోకే తీసుకురాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన అభివృద్ధి నినాదానికి సంబంధించి ఇంతవరకూ చేసినదేమిటో, చేయబోతున్న దేమిటో వివరించలేదు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయాన్ని అం దించిన బిహార్ ప్రజల పట్ల తమకు ఆ బాధ్యత ఉన్నదని గుర్తించలేకపోయారు. మోదీ అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా గత నెల్లాళ్లుగా బిహార్‌లోనే మకాం పెట్టి అంతకు రెట్టింపుకన్నా ఎక్కువ సభల్లో మాట్లాడారు. దాదాపు కేంద్ర కేబినెట్ మంత్రులంతా వివిధచోట్ల బహిరంగసభలు పెట్టారు. వీరు కాక వేలాది మందితో కూడిన పార్టీ సైన్యం మారుమూల ప్రాంతాల్లోకి చొచ్చుకు వెళ్లి పని చేసింది. వీరందరినీ సమన్వయపరిచే సమర్ధవంతమైన యంత్రాంగం అహర్నిశలూ శ్రమపడింది. పైగా అవతలిపక్షం ఇప్పటికే రెండు దఫాలనుంచి ప్రభుత్వానికి నాయకత్వంవహిస్తున్న సీఎం ఆధ్వర్యంలో ఉంది. కనుక ప్రజల్లో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి కలిసిరావాలి. దానికితోడు జరుగుతున్నవి బిహార్ ఎన్ని కలు గనుక తన పంథాకు భిన్నంగా కులాన్ని కూడా ఆ పార్టీ నెత్తుకెత్తుకుంది.
ఈబీసీల ఓట్ల కోసం గాలం వేసింది. ఈలోగా ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ కోటా వివాదాన్ని రేపి ఆ ఆశల్ని అడుగంటేలా చేశారు. అనంతరం ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నా ఫలితం లేకపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిం చిన కొన్నాళ్లకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడినా మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలు బీజేపీకి ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. దాన్నంతటినీ బిహార్ ఎన్నికలు ఊడ్చేశాయి. ఏడాది వ్యవధిలో అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలు...ఆ తర్వాత పంజాబ్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ.
ఎన్నికల్లో గెలుపోటములు శాశ్వతం కాదు. రాజకీయ రంగంనుంచి ఇక నిష్ర్క మించినట్టేనని పదిహేనేళ్లక్రితం భావించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఈసారి తమ పార్టీ ఆర్జేడీని అతి పెద్ద పార్టీగా నిలబెట్టగలిగారు. తన పాలనను ‘జంగిల్‌రాజ్’గా ప్రచారం చేసినవారిని నోళ్లు మూయించారు. నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గాక నరేంద్ర మోదీ అన్నట్టు ప్రజాస్వామ్యంలో శత్రువులుండరు...పోటీదార్లే ఉంటారు. కానీ ఆ సంగతిని మొదటగా బీజేపీయే మరిచిందని ఈ ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తే అర్థమవుతుంది. బిహార్‌ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన నేతగా నితీష్‌కు మంచిపేరుంది. ఆయన ఇప్పుడు లాలూతో, కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తూ దాన్ని నిలబెట్టుకోగలుగుతారా... కొనసాగించగలుగుతారా అన్నది రాగలకాలంలో తేలు తుంది. ఈ ఎన్నికల్లో బిహార్ ఓటర్లు ప్రదర్శించిన విజ్ఞతలోని అంతరార్ధాన్ని గ్రహిం చి స్వీయ తప్పిదాలను సరిచేసుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని బీజేపీ గుర్తించాలి.