సాక్షి, న్యూఢిల్లీ : చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూతో కలిసి పోటీచేయబోమని తేల్చిచెప్పింది. బిహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆదివారం ఢిల్లీలో జరిగిన కీలక భేటీ అనంతరం ఆ పార్టీ ప్రకటించింది. జేడీయూకు వ్యతిరేకంగా ఎల్జేపీ అభ్యర్ధులను బరిలో దింపుతామని ప్రకటించిన ఎల్జేపీ బీజేపీతో మాత్రం తమ దోస్తీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రస్ధాయిలో జేడీయూతో సిద్ధాంత వైరుధ్యాల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయాలని నిర్ణయించిందని ఎల్జేపీ నేత అబ్ధుల్ ఖలీక్ ఓ ప్రకటనలో తెలిపారు. బిహార్ ఫస్ట్-బిహారి ఫస్ట్ నినాదంతో ఎల్జేపీ ఈ ఎన్నికల బరిలో ఒంటరి పోరుకు సిద్ధమైంది.
ఇక బిహార్ విజన్ డాక్యుమెంట్‌పైనా ఇరు పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేదని, సిద్ధాంత వైరుధ్యాలతో తాము జేడీయూతో తెగతెంపులు చేసుకున్నామని ఆ పార్టీ పేర్కొంది. నితీష్ కుమార్ జేడీయూను తాము వీడినా బీజేపీతో సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయని బిహార్‌లోనూ బీజేపీతో తమ బంధం కొనసాగించేందుకు సుమఖంగా ఉన్నామని చెప్పారు. ఎన్నికల అనంతరం బీజేపీ-ఎల్జేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిన అభివృద్ధి బాటలో ముందుకు సాగుతామని తెలిపింది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి : వెనక్కి తగ్గిన నితీష్.. బీజేపీతో డీల్ ఓకే
Comments
Please login to add a commentAdd a comment