
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం కీలక ప్రకటన చేశారు.బిహార్ 2020 అసెంబ్లీ ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలని.. రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు నితీష్ తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియా జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి : నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లేనా?!)
'బిహార్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్ పలుకుతున్నా..' అంటూ ఉద్వేగంతో బహిరంగసభలో పేర్కొన్నారు. ఇప్పటికే బిహార్‌లో రెండు దశల పోలింగ్ ముగియగా.. ఆఖరిదైన మూడో దశ నవంబర్ 7న జరగనుంది. కాగా బిహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి. (చదవండి : నితీష్ పాలనను వ్యతిరేకిస్తున్నారు : చిరాగ్)