పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి!
అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ ఎజెండా!
న్యూఢిల్లీ: లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని భావిస్తున్న ప్రధాని మోదీ... ఇదే అంశాన్ని బడ్జెట్ సమావేశాలకు ముందు జరగనున్న అఖిలపక్ష భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా దీనిపై అన్ని పార్టీల ఏకాభిప్రాయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు ఎన్నికల నిధుల నిబంధనల్లో మార్పు తదితర అంశాలను కూడా చర్చించనున్నట్టు అధికార బీజేపీ అత్యున్నత స్థాయి నేత ఒకరు వెల్లడించారు. త్వరలోనే ప్రధాని దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నార న్నారు. ఎన్నికల సంస్కరణలను ఏ పార్టీ వ్యతిరేకిస్తుందని అనుకోవడం లేదన్నారు.
గత పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై చర్చించాలని మోదీ భావించారని, అయితే నోట్ల రద్దుపై నిరసనలతో సభా సమయం తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించడంవల్ల ఎంతో సమయం వృథా అవుతోంది. సీనియర్ అధికారులు పోలింగ్ పనుల్లో నిమగ్నమవ్వడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు వెనకబడుతున్నాయి. ఈ క్రమంలో అన్ని ఎన్నికలనూ ఒకేసారి జరపాలని మోదీ పలు బహిరంగ సభల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే చందాల పరిమితిని రూ.20 వేల నుంచి రూ.2 వేలకు తగ్గించాలన్నది ప్రధాన అంశం. తద్వారా ఎన్నికల్లో ధన బలాన్ని నియంత్రించవచ్చని భావిస్తున్నారు.