మోదీ నాయకత్వమే శ్రీరామ రక్ష | nukkad conference at delhi | Sakshi
Sakshi News home page

మోదీ నాయకత్వమే శ్రీరామ రక్ష

Published Sat, Nov 22 2014 12:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మోదీ నాయకత్వమే శ్రీరామ రక్ష - Sakshi

మోదీ నాయకత్వమే శ్రీరామ రక్ష

* అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ వ్యూహాత్మక కసరత్తు
* ప్రముఖులను ప్రచారంలోకి దించాలని నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీకి వ్యూహాత్మకంగా కదులుతోంది. ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గాలి వీస్తోంది. మోదీ ఎక్కడకు వెళ్లినా ప్రజాధరణ లభిస్తోంది. గత సాధారణ ఎన్నికల్లోనూ మోదీ ప్రభావం కొట్టొచ్చినట్టు కన్పించింది. ఢిల్లీలోని ఏడు లోకసభ నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయదుందుబిని మోగించిన విషయం తెలిసిందే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోదీ ప్రభావాన్ని ఓట్లుగా మలుచుకొని అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించడానికి పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ పీఠాన్ని నరేంద్ర మోదీ చరిస్మాతో సాధించుకొని, ఆయనకే తిరిగి కానుకగా ఇవ్వడానికి కార్యకర్తల్ని కార్యోణ్ముకులను చేస్తోంది.
 
నుక్కడ్ సభలు: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించింది. సుమారు 300 మంది పార్లమెంట్ సభ్యులను నగరంలో ప్రచారానికి వినియోగించుకోవడానికి నిశ్చయించింది. వీరంతా నగర వ్యాప్తంగా నుక్కడ్ సభలు(వీధి మీటింగ్‌లు) నిర్వహించి పార్టీ విధి విధానాలను ప్రజలకు తెలియజేస్తూ మద్దతు కూడగొడుతారు. 20 నుంచి 25 రోజుల పాటు ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు.
 
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి: ఉపాధ్యాయ
బీజేపీ ఢిల్లీశాఖ ఇన్‌చార్జి ఎంపీ ప్రభాత్ జా, అధ్యక్షుడు సతీష్ ఉపాధ్మాయ, ఏడుగురు లోక్‌సభ సభ్యులు, ఢిల్లీ మాజీ అధ్యక్షుడు విజయ్ గోయల్, వీజేందర్ గుప్తా ఇంకా ప్రముఖ నాయకులు హాజరై అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు,  గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులు, ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు. ఈ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకమైనవని సతీష్ ఉపాధ్యాయ అన్నారు. ‘గత 16 ఏళ్లు ఢిల్లీలో అధికారానికి పార్టీ దూరంగా ఉన్నది. అయినప్పటికీ ప్రధాని మోదీ నాయకత్వంలో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకొంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఢిల్లీ విజయాన్ని మోదీకి కానుకగా ఇస్తామని’ అన్నారు. ఇందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ఎంపీ ప్రభాత్ జా మాట్లాడుతూ ‘మహారాష్ట్ర, హర్యానాలో ఇప్పటికే బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. గత లోక్ సభ ఎన్నికల్లోనూ  పార్టీ అనూహ్యంగా విజయాలను సాధించిందన్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్‌లోనూ గెలుపొందడానికి అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఇదే సీరిస్‌లో ఢీల్లీ ఐదో కానుకగా మోదీ అందించాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.
 
సంక్షేమ కార్యక్రమాలను వివరించాలి
రామ్‌లాల్ మాట్లాడుతూ.. కార్యకర్తలు, ప్రజలతో క్షేత్రస్థాయి సంబంధాలను పెంపొందించుకోవాలని నాయకులను కోరారు. నుక్కుడ్ సభల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరించాలని, ఎన్నికల తేదీలు, మోడల్ కోడ్ అమలులోకి వచ్చేదాకా కొనసాగించాలని అన్నారు. సమారు 150 కార్యక్రంమాల్లో పార్టీ అధినేత అమిత్ షా పాల్గొంటారని చెప్పారు.
 
టికెట్ల వేటలో నాయకులు
త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకూల పవనాలు వీస్తుండడంతో ఆ పార్టీ టికెట్ ఆశించే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. కొద్దో గొప్పో ప్రజల మద్దతు ఉన్న ప్రతి నాయకుడు టికెట్ సంపాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామం పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారనుంది.  
 
ఎవరి ప్రయత్నాల్లో వారే..
పార్టీలో సుధీర్గ అనుభవం ఉన్న నాయకులు, ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మాలవీయ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంట్టు తెలిసింది. పార్టీ ఉపాధ్యక్షురాలు రజనీ అబ్బీ- తిమార్ పుర్ అసెంబ్లీ నుంచి,ై జెప్రకాశ్ -సదర్‌బజార్ నుంచి , శిఖారాయ్- కస్తూర్బానగర్ నుంచి, కిరణ్ చడ్డా -గ్రేటర్ కైలాష్ నుంచి , కుల్జీత చెహల్- పడప్పట్‌గంజ్ నుంచి, అభయ్ వర్మ -లక్ష్మీనగర్ నుంచి, ఆశీష్ సూద్ -జనక్‌పురి లేదా హరినగర్ నుంచి  పోటీచేయాలని ఆ దిశగా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటున్నారు.

ఆఫీసు బేరర్లు కూడా టికెట్లు ఆశిస్తూ సీనియర్ బీజెపీ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్ నేతల అనుగ్రహం కోసం ప్రయత్నిస్తుండడంతో మాజీ ఎమ్మెల్యేలు, గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయిన నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి నేత టికెట్ ఆశించడం వల్ల పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల పార్టీలో అంతర్గత కలహాలు పెరిగే అవకాశముందని, టికెట్ ఆశించి భంగపాటుకు గురైనవారు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసే  ముప్పు ఉందని వారు పలువురు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement