అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించనేలేదు.. అప్పుడే బీజేపీ నాయకులు అప్రమత్తమయ్యారు.
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించనేలేదు.. అప్పుడే బీజేపీ నాయకులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో బీజేపీ వాటాలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజల నాడి తెలుసుకుని పార్టీ అధిష్టానానికి అందజేసేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ పోటీ చేయనున్న 119 అసెంబ్లీ నియోజక వర్గాలలో 150 మంది కార్యకర్తలను నియమించారు. వీరంతా వారికి కేటాయించిన నియోజక వర్గాల్లోనే మూడు నెలల పాటు బసచేస్తారు.
24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అనంతరం ఢిల్లీలోని నరేంద్ర మోడీ బృందానికి నివేదిక అందజేస్తారు. అయితే వీరికి అభ్యర్థిగా బరిలో దిగేందుకు అవకాశముండదు. అభ్యర్థుల జాబితా తయారుచేసిన తర్వాత వారిని గెలిపించే బాధ్యతలు కూడా వీరిపైనే ఉంటాయి. బీజేపీ చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం లాంటి పనులు కూడా వీరే చేపడతారు. అందుకు బీజేపీ ప్రదేశ్ వర్గాలు తెరచాటు నుంచి ఈ కార్యకర్తలకు మార్గ దర్శనం చేస్తారు.
ఆ తర్వాత తమకు అప్పగించిన నియోజక వర్గాలలో రాజకీయ వాతావరణం ఎలా ఉంది, ప్రత్యర్థుల బలమేంటి, ఫలితాలు ఎలా ఉంటాయి తదితర వివరాలు అధిష్టానానికి అందజేస్తారు. గతంలో బీజేపీ, మిత్రపక్షమైన శివసేన పోటీచేసిన నియోజక వర్గాల ఫలితాలపై అధ్యయనం చేస్తారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తారు. 1995లో అధికారంలోకి వచ్చిన సమయంలో బీజేపీ 117 స్థానాల్లో పోటీచేసి 62 స్థానాలు కైవసం చేసుకుంది.
అదే మిత్రపక్షమైన శివసేన 171 స్థానాల్లో పోటీచేసి 72 స్థానాల్లో గెలిచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలుచుకోవాలనే ఉద్ధేశంతో బీజేపీ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటే వారే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనేది ఇరు పార్టీల మధ్య ఒప్పందం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుని సీఎం పీఠం చేజిక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోంది.