సంకీర్ణ సర్కారుతో కాంట్రాక్టర్లకే అధికారం
ధన్‌బాద్: రాష్ట్రాభివృద్ధి, సుస్థిర ప్రభుత్వం కావాలంటే బీజేపీకే పట్టం కట్టాలని, ఒకవేళ సంకీర్ణ సర్కారును తెచ్చి పెట్టుకుంటే కాంట్రాక్టర్లే రాజ్యమేలుతారని జార్ఖండ్ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జార్ఖండ్‌లో ఈ నెల 14న నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ధన్‌బాద్‌లో మంగళవారం బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ‘జార్ఖండ్‌లో సుస్థిర ప్రభుత్వం అవసరం. ఈసారి పొరపాటు చేయకండి. బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అధికార పగ్గాలు ప్రజల చేతుల్లోనే ఉంటాయి. అలాకాకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అవి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోతాయి. దేశం కోసం మీరు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు మీ రాష్ర్టం కోసం ఆ పని చేయలేరా? సంకీర్ణ ప్రభుత్వాల వల్ల కాంట్రాక్టర్లే అధికారం చలాయించారు.
ఇన్నాళ్లూ దేశానికి వారు ఏం చేశారో మీకు తెలుసు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను తిరస్కరించినట్లే రాష్ర్టంలోనూ బీజేపీకి పట్టం కట్టండి’ అని విజ్ఞప్తి చేశారు. ‘ప్రతిపక్ష పార్టీల నేతలు చాలా కలవరపడుతున్నారు. వారంతా ఇప్పుడు మనుగడ కోసమే ఎన్నికల ప్రచారానికి పరుగులు పెడుతున్నారు. కానీ వారికి ప్రస్తావించడానికి ఎలాంటి అంశాలు లేవు. గత లోక్‌సభ ఎన్నికల్లో చేసిన ప్రసంగాలనే మళ్లీ వినిపిస్తున్నారు’ అని అన్నారు. జార్ఖండ్ బొగ్గు నిల్వల గురించి ప్రస్తావిస్తూ.. ‘మీరు నల్ల వజ్రంపై కూర్చుంటున్నారు. అది మెరిస్తే చూడాలనిపించడం లేదూ! మరి ఆ పని చేసేదెవరు? మోదీ అందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయడానికి జార్ఖండ్ ప్రజలు నాకు అవకాశం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. జార్ఖండ్‌ను అన్నిరకాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.