
కశ్మీర్‌లో కాల్పుల మోత
ఒకేరోజు మూడు వేర్వేరు చోట్ల తీవ్రవాదుల కాల్పులు
ఓ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ఒకేరోజు మూడు చోట్ల కాల్పులకు తెగబడ్డారు. ఓ కేసు విచారణ కోసం వెళ్లిన ముగ్గురు పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. నిరాయుధులైన ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను కాల్చిచంపారు. షోపియన్ జిల్లా అంషిపొరా గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు కొద్ది గంటల ముందే కశ్మీర్ లోయలో మరో దాడి జరిగింది. బారాముల్లా జిల్లా పటాన్ ప్రాంతంలో సాధారణ బస్సులో వెళ్తున్న పోలీసు అధికారిపై అదే బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మిలిటెంట్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఇందులో ఓ సబ్ ఇన్స్‌పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. మిలిటెంట్లు పారిపోయాక డ్రైవర్ బస్సును నేరుగా సమీపంలోని పోలీసు చెక్‌పోస్ట్ వద్దకు తీసుకువెళ్లడంతో ఆ ఎస్సైని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడో ఘటన పుల్వామా జిల్లా ట్రాల్ పట్టణంలో చోటుచేసుకుంది.
ఇక్కడ మిలిటెంట్లు.. గతంలో హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో పనిచేసిన రఫీక్ అహ్మద్ భట్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అంషిపొరా కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు షబీర్ హుస్సేన్, నజీర్ అహ్మద్, హెడ్‌కానిస్టేబుల్ ముస్తాక్ అహ్మద్ అక్కడికక్కడే చనిపోయారు. వీరు ఆయుధాల్లేకుండా ఆ గ్రామానికి వెళ్లారు. దీన్ని అదనుగా తీసుకొని తీవ్రవాదులు వారిపై తూటాలు కురిపించారు. ఒకేరోజు మూడు కాల్పుల ఉదంతాలు చోటుచేసుకోవడం కశ్మీర్‌లో కలకలం సృష్టించింది. అదీ పర్యాటకులను ఆకర్షించేందుకు దాల్ సరస్సు ఒడ్డున ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్‌ను ముఖ్యమంత్రి ముఫ్తీ మొహ్మద్ సయీద్ ప్రారంభించిన రోజే మిలిటెంట్లు రెచ్చిపోవడం గమనార్హం.