కాషాయ రాజకీయం
- కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో సోనియా ధ్వజం
బండిపొరా/చందర్‌కోట్: జమ్మూకశ్మీర్ వరద బాధితులకు సాయంపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధితులకు అంతులేని హామీలు ఇచ్చిందని, అయితే అమలుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.
కొన్ని శక్తులకు సొంత విధానాలు లేవని, అవి అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని బీజేపీని ఉద్దేశించి అన్నారు. కశ్మీర్ వేర్పాటు వాద నేత సజ్జద్ లోన్‌తో ప్రధాని మోదీ ఇటీవల భేటీ అయిన నేపథ్యంలో ఈ విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియా శుక్రవారం బందిపొరా, చందర్‌కోట్‌లలో జరిగిన సభల్లో ప్రసంగించారు.
‘కశ్మీరీలు వరద బీభత్సం నుంచి కోలుకోకముందే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడ్డం మంచిది కాదు. అయితే సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. 2005లో అధీన రేఖ వద్ద భూకంపం సంభవించినప్పుడు నాటి యూపీఏ ప్రభుత్వం బాధితులను అన్నిరకాలుగా ఆందుకుంది’ అని పేర్కొన్నారు. ‘సహాయం, పునరావాసం, పునర్నిర్మాణం కోసం రూ. 45వేల కోట్ల సహాయక ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్రం కోరింది. అయితే ప్రధాని మోదీ రూ. 745 కోట్లే ప్రకటించారు’ అని విమర్శించారు.