
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఈ నెల 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది జవాన్లు అమరులు కావడంపై రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సంతాపం ప్రకటించాయి. జవాన్ల మృతికి నివాళిగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాయి. శుక్రవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం కె. చంద్రశేఖర్‌రావు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్వామా ఉగ్ర దాడి అత్యంత అమానుషమన్నారు. దీన్ని సైనికులు, వ్యక్తులపై జరిగిన దాడిగా కాకుండా యావత్ దేశం, సమస్త భారత జాతిపై జరిగిన దాడిగా దేశ ప్రజలంతా తీవ్ర ఆవేదన చెందారన్నారు.
ఇది యావన్మంది హృదయాలను కదిలించిన విషాద ఘటన అని, దేశ రక్షణ కోసం 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేని దుర్ఘటన అని పేర్కొన్నారు. జవాన్ల కుటుం బాలు ఒంటరి కాలేద న్న సంకేతమిచ్చేలా వారి వెంట తామున్నామ ని చాటిచెప్పాలన్నారు. ఉగ్రవాద కార్చిచ్చును ఆపివేయాలని, ఇందుకోసం పటిష్ట వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం రచించాలని దేశమంతా కోరుకుంటోందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అమర జవాన్ల కుటుంబాలు, వారి పిల్లలను సంరక్షించే బాధ్యతలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు.
దాడిలో చనిపోయిన జవాన్లకు వినమ్ర నివాళి అర్పిస్తున్నామంటూ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ తీర్మానంపై అన్ని పక్షాల నేతలు మాట్లాడిన తర్వాత తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వారి మృతికి నివాళిగా సభ రెండు నిమిషాలు మౌ నం పాటించింది. మండలిలో వైద్య, ఆరోగ్యశా ఖ మంత్రి ఈటల ఉగ్ర దాడిపై ప్రభుత్వం తరఫున తీర్మానం ప్రవేశపెట్టారు. వీరసైనికుల ప్రాణత్యాగం వెలకట్టలేనిదని, అమర జవాన్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 25 లక్షల చొప్పున సాయం అందిస్తామన్నారు.
పుల్వామా ఘటనపై ఎవరేమన్నారంటే...
ప్రగాఢ సానుభూతి శోకార్తులైన అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఉగ్ర దాడిలో అసువులుబాసిన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరేందుకు రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్
అందరం ఏకం కావాలి...
దేశ భద్రతకు పెను ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు జాతి యావత్తూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. – మహ్మద్ అలీ షబ్బీర్, పొంగులేటి
సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
జాతి యావత్తూ అండదండలు
అమర జవాన్ల కుటుంబాల కోసం జాతి యావత్తూ నిలబడుతుంది. సీఎల్పీ నేతగా పుల్వామా లాంటి విషాద ఘటనపై తొలిసారి మాట్లాడాల్సి వచ్చినందుకు చింతిస్తున్నా.
భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
జైషే షయాతీన్...
పుల్వామా ఉగ్ర దాడికి పాల్పడింది జైషే మహ్మద్ (ప్రవక్త సైన్యం) కాదు... జైషే ష యాతీన్ (దెయ్యాల సైన్యం). మన భూభాగంపై పాక్ అస్థిరత కోరుకుంటోంది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే. అందరం కలసికట్టుగా దేశం కోసం నిలబడాలి.
అహ్మద్ బలాల, ఎంఐఎం ఎమ్మెల్యే
దేశ సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలర్పించే జవాన్ల కుటుంబాలకు ఎంత చేసినా తక్కువే. ఆ పోరాట యోధులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
నాయిని నర్సింహారెడ్డి, మాజీ హోంమంత్రి
మానవత్వానికి ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలి. పాక్‌కు బుద్ధి చెప్పే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. – రాంచందర్‌రావు, బీజేపీ ఎమ్మెల్సీ
దేశ సమగ్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు జాతి యావత్తు సంఘీభావంగా నిలుస్తుంది.
కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ
కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. కశ్మీరీల రక్షణ కూడా మన బాధ్యత. జాతుల మధ్య విధ్వంసం సృష్టించడం ఉగ్రవాదుల అసలు లక్ష్యం. అమాయక కశ్మీరీలపై దాడి చేస్తే అది నెరవేరినట్లే.
జాఫ్రీ, మజ్లిస్ ఎమ్మెల్సీ
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. పాక్‌తో తాడోపేడో తేల్చుకోవాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాయాలి. వాళ్ల భాషలోనే దీటైన రీతిలో జవాబు చెప్పాలని కోరాలి.
రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment