పుల్వామా దాడికి ఐదేళ్లు... ఆ రోజు ఏం జరిగింది? | Sakshi
Sakshi News home page

Pulwama Attack 5th Anniversary: పుల్వామా దాడికి ఐదేళ్లు... ఆ రోజు ఏం జరిగింది?

Published Wed, Feb 14 2024 6:49 AM

Jammu Kashmir Balakot Air Stirke Indian Army - Sakshi

2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. 

ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్‌పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్‌ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇంతకీ ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి 14న పాక్‌ ఎటువంటి దాడికి  పాల్పడిందో, దానికి భారత్‌ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇప్పుడొకసారి గుర్తుచేసుకుందాం. 

ఐదేళ్ల క్రితం ఇదేరోజున సీఆర్‌పీఎఫ్‌  కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. సైనికులు  ఉన్న ఈ కాన్వాయ్‌లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్‌ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు  కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందారు.

పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.

2019, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ, కాశ్మీర్‌లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. 

దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్‌కు చెందిన యుద్ధ విమానం ‘మిగ్-21’ పాకిస్తాన్ సైన్యం దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ సైనికులు ‘మిగ్-21’ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్నారు. 2019, మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేసింది.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌ అప్పటివరకూ పాక్‌తో  ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్‌ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు మనీలాండరింగ్‌పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)ను కూడా భారత ప్రభుత్వం కోరింది.

Advertisement
 
Advertisement