- ముగిసిన వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభలు
- వ్యవసాయ కార్మికుల ఉద్యమబాట
వరంగల్ : పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పై పోరుబాట పట్టేందుకు వ్యవసాయ కార్మికులు సన్నద్ధమవుతున్నారు. అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీ య మహాసభలు అందించిన ఉత్తేజంతో ఉద్యమాలు చేపట్టేం దుకు నిర్ణయించారు. వరంగల్ కేంద్రంగా నాలుగు రోజుల పాటు అత్యంత కోలాహలంగా జరిగిన జాతీయ మహాసభలు శనివారం ముగిశాయి. ఉపాధి హామీని నీరుగార్చే కుట్రలను వ్యతిరేకించడంతోపాటు వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం నూతన నాయకత్వం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులకుతోడుగా కలిసొచ్చే శక్తులతో కలిసి ఐక్యపోరాటాలతో ముందుకు సాగాలని ఈసందర్భంగా తీర్మానించారు.
ఉత్తేజాన్నిచ్చిన సభ
జూలై 30న చాకలి ఐలమ్మనగర్‌లో(ఓసిటీ గ్రౌండ్)లో భారీ బహిరంగ సభతో ప్రారంభమైన మహాసభలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా జనాన్ని సమీకరించా రు. జిల్లా నలుమూలల నుంచి వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజ రైన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌తోపాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాటూరి రామయ్య, విజయరాఘవన్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నాగయ్య, వెంకట్ తదితరులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. కళాకారుల ఆటాపాటతో సభ హోరెత్తింది.
స్ఫూర్తినిచ్చిన చర్చలు
హన్మకొండలోని సుందరయ్యనగర్‌లో(నందనాగార్డెన్) జూలై 31న ప్రతినిధుల సభ అత్యంత ఉత్తేజకర వాతావరణంలో ప్రారంభమైంది. తొలిరోజు ప్రతినిధుల సభ ప్రారంభోపన్యాసంలో ఆర్థిక వేత్త ప్రొఫెసర్ ప్రభాత్‌పట్నాయక్ ప్రభుత్వాల ఆర్థిక విధానాలు, వ్యవసాయ రంగంపై దుష్ఫలితాలను వివరంగా తెలియజేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్ దేశవ్యాప్తంగా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యకలాపాల నివేదిక సభకు సమర్పించారు. దీనిపై ప్రతినిధులు చర్చించారు.
రెండవ రోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సంఘాన్ని పటిష్టం చేయాల్సిన ఆవశ్యకతపై చర్చలు సాగా యి. ఇదే రోజు ‘వ్యవసాయ రంగం-ప్రపంచీకరణ’ అం శంపై హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో నిర్వహించిన సెమినార్‌లో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్, ప్రొఫెసర్ షీలాభల్లా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వివిధ అంశాలపై వివరించారు. చివరి రోజు మహాసభలో భవిష్యత్ కర్తవ్యాలపై చర్చ అనంత రం సంఘం జాతీయ నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది.
తమిళనాడుకు చెందిన తిరునావరక్కసును అధ్యక్షుడిగా, విజయరాఘవన్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. జాతీయ మహాసభల నిర్వహణ బాధ్యతలను భుజానెత్తుకున్న సీపీఎం, ప్రజాసంఘాల జిల్లా నేతలు సమన్వయంతో నెలరోజులు అలుపెరుగకుండా శ్రమించి విజయవంతం చేసి నాయకత్వం నుంచి అభినందనలు అందుకున్నారు.