
లౌకిక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో లౌకిక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు. ఆ రెండు పార్టీలను ఓడించటమే లక్ష్యంగా తాము పనిచేస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తాము కాంగ్రెసేతర లౌకిక ప్రతిపక్ష పార్టీగా చూస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు ఉండకపోవచ్చని కారత్ పరోక్షంగా చెప్పారు. ఆ పార్టీ బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తోందని, ఇది దురదృష్టకరమని అన్నారు. శనివారం సీపీఎం రాష్ట్ర కమిటీ సమావే శాలు పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై. వెంకటేశ్వరరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆయన చెప్పిన వివరాలివీ..తృతీయ కూటమి కాకుండా ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల అనంతరం ఇది రూపుదిద్దుకుంటుంది.
ఈ అంశంపై ఇప్పటికే సీపీఎంతోపాటు ఇతర వామపక్షాలు, అన్నా డీఎంకే, జనతాదళ్ (ఎస్), జనతాదళ్ (యునెటైడ్), బిజూ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ, మరికొన్ని పార్టీలు చర్చించుకున్నాయి.
5న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజున ఈ ప్రత్యామ్నాయంలో ఉండే పార్టీలు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఒక ప్రకటన చేస్తాయి.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా హర్యానా, పంజాబ్, రాజస్థాన్ వంటి 8 రాష్ట్రాల్లో పోటీ చేయాలని నిర్ణయించాం. ళీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఎన్ని స్థానాల్లో పోటీచేయాలో ఇంకా నిర్ణయించలేదు.
కాంగ్రెస్, బీజేపీయేత ర పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటాం పొత్తులతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్లమెంటు సమావే శాల తరువాత ఖరారు చేస్తాం
యూపీఏ పాలన ప్రజలకు భారంగా మారింది. నిత్యావసరాలు ధరలు పెరిగిపోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరిగింది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్ అనుసరించే నయా ఉదారవాద విధానాలకు, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పే ప్రత్యామ్నాయానికి తేడా లేదు.
మోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తారు.
వామపక్షాలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయం కాదు. ఆ పార్టీ ప్రస్తుతానికి ఢిల్లీకే పరిమితమైంది. ఆర్థిక రంగంతో పాటు పలు కీలకమైన అంశాలపై ఆ పార్టీ వైఖరిని ఇంతవరకూ వెల్లడించలేదు.
అవినీతి విషయంలో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవటం వల్ల ఫలితం శూన్యం. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నది మాత్ర ం ఆ పనే.
కేంద్రం అనుసరించే సరళీకృత ఆర్థిక విధానాలే అవినీతికి మూలకారణం. అధికారంలో ఉన్న రాజకీయ నేతలు, కార్పొరేట్ శక్తులు, అధికారులు కలిసి అవినీతికి పాల్పడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం.
వామపక్ష కూటమిలో సీపీఐ కూడా భాగస్వామే.
తెలంగాణ బిల్లు విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీయకూడదని మేం చెబుతున్నాం. పార్లమెంటులోనూ ఇదే అంశాన్ని చెప్తాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్కడ కూడా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఎం పోరాడుతుంది.