మళ్లీ వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన నినాదం
* మారనున్న సీపీఎం పంథా
* పార్టీకి దిశానిర్దేశం ఇవ్వనున్న రాజకీయ తీర్మానం: ప్రకాశ్ కారత్
* బీజేపీ విధానాలపై పోరాడతాం
* ఆర్‌ఎస్‌ఎస్ ఏమి చెబుతోందో చంద్రబాబు అదే చెప్పారంటూ విమర్శ
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాజకీయ పంథా మారనుంది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో అనుసరించిన రాజకీయ ఎత్తుగడల పంథా ఫలితాన్నివ్వలేదని భావిస్తోంది. బూర్జువా పార్టీలతో పొత్తులు, లౌకిక శక్తుల పేరిట సఖ్యతలు, సరళీకృత ఆర్థిక విధానాలు దెబ్బతీసినట్టు అంచనా వేసింది. తిరిగి పాతికేళ్ల కిందటి వామపక్ష, ప్రజాతంత్ర సంఘటనకు శ్రీకారం చుట్టింది. రెండురోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశం సుదీర్ఘ చర్చల అనంతరం రాజకీయ-ఎత్తుగడల పంథాపై సీపీఎం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టామని, బుధవారం సాయంత్రానికి దాన్ని ఆమోదిస్తామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో విశాఖపట్నంలో జరిగే పార్టీ 21వ జాతీయ మహాసభల్లో ఈ తీర్మానాలపై చర్చించి తుది రూపం ఇస్తామని వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టత, దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర సంఘటనను ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రమిస్తుందన్నారు. ఇప్పటివరకు జరిగిన తప్పులేమిటో, లాభనష్టాలేమిటో మరో పదిరోజుల్లో ప్రకటిస్తామన్నారు. దేశంలో ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితిని కేంద్ర కమిటీలో చర్చించినట్టు తెలిపారు. హిందూ మతోన్మాదశక్తుల నాయకత్వంలో ఆర్‌ఎస్‌ఎస్ తన మతతత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
బీజేపీ తన మితవాద ధోరణితో దూకూడుగా వ్యవహరిస్తోందని, మున్ముందు బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తుందని కారత్ చెప్పారు. ఇప్పటికే పార్లమెంటును తోసిరాజని మూడు ఆర్డినెన్సులు తెచ్చిందని గుర్తుచేశారు. భూ సేకరణ చట్టంపై తెచ్చిన ఆర్డినెన్స్‌కు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ తీర్మానించినట్టు తెలిపారు. ఒబామా భారత్ పర్యటన సందర్భంగా ఈనెల 24న పెద్దఎత్తున నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. అతిథిగా వచ్చే అమెరికా అధ్యక్షుడు వ్యాపారబృందాన్ని వెంట తీసుకురావడం, భారత్‌కు చేటు తెచ్చే అణు ఒప్పందం వంటి చట్టాలపై సంతకాలు చేయడం వంటి వాటిని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. గతంలోనూ వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన అన్నప్పటికీ ఈసారి పంథాను మార్చి సరికొత్త విధానాలు, నినాదాలతో ముందుకువెళతామని వివరించారు. సంఘటన తరఫున కాకుండా ఏడు వామపక్షపార్టీలు ఒక వేదికగా ఏర్పడి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు ఉండవు, కలిసిపోవడం జరగదని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూసేకరణ చట్టం ప్రకారమే రైతులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎక్కువ సంతానాన్ని కనాల్సిందిగా చంద్రబాబు చెప్పడంపై మాట్లాడుతూ.. బహుశా ఆయన కూడా ఆర్‌ఎస్‌ఎస్ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నారేమో అని కారత్ వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏమి చెబుతుందో చంద్రబాబూ అదే చెప్పారని, మతపరమైన అంశం నుంచే ఈ ఆలోచన పుట్టిందని భావించాల్సి వస్తోందని అన్నారు.
సీపీఎం మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
విశాఖలో వచ్చే ఏప్రిల్ 14 నుంచి 19 వరకు జరగనున్న సీపీఎం 21వ జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.