The Land Acquisition Act
-
‘భూ సేకరణ’వద్దే వద్దు
- ఆర్డీఓ కార్యాలయూన్ని ముట్టడించిన సీపీఐ నేతలు - 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు కామారెడ్డి : భూ సేకరణ చట్టాన్ని సవరించొద్దని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్‌భరోలో భాగంగా ఆపార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జైల్‌భరోలో పాల్గొన్న 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకులు వీఎల్ నర్సింహారెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి పి.బాల్‌రాజులు మాట్లాడుతూ..ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న భూ సేకరణ చట్టా న్ని మోడీ ప్రభుత్వం సవరించడం సరికాదన్నారు. ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాల్‌రాజు, దశరథ్, భానుప్రసాద్, నర్సింలు, రాజశేఖర్, మల్లేశ్, మల్లయ్య, ఖాసీం, రాజాగౌడ్, అరుణ్, సుధీర్, సంతోష్, ప్రవీన్, శ్రీను పాల్గొన్నారు. మన భూమిపై మన హక్కు వినాయక్ నగర్ : మన భూమిపై మన హక్కు నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్ భరో విజయవంతమైంది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సేకరణ బిల్లు పేద రైతులను రోడ్డు పాలు చేసేలా ఉందని ఆరోపిం చారు. అంతకు ముందు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి భారీ ర్యాలీగా బస్టాండ్‌కు చేరుకున్నారు. రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర నాయకురాలు ప్రేమ పావని మాట్లాడుతూ... ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సేకరణ బిల్లు కార్పోరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా ఉందన్నారు. భూ సేకరణ చట్టంలో ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామ సభల అంగీకారం మేరకే భూమి సేకరించాలని ఉందని తెలిపారు. అంతేకాకుండా మార్కెట్ రేటు కంటే నాలుగు రేట్లు అధికంగా ధర చెల్లించి వారికి పునరావాసం కల్పించాలని అన్నారు. కానీ, ప్రస్తుతం ప్రవేశపెడుతున్న భూ సేకరణ బిలు వీటన్నింటికి విరుద్దంగా ఉందని మండిపడ్డారు. రాస్తారోకో వద్దకు ఒకటో టౌన్ పోలీసులు చేరుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. ఏఐటీయూసీ నాయకులు బోసు బాబు, వెంకట్‌రెడ్డి, ఓమయ్య, సుధాకర్ పాల్గొన్నారు. -
మళ్లీ వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన నినాదం
* మారనున్న సీపీఎం పంథా * పార్టీకి దిశానిర్దేశం ఇవ్వనున్న రాజకీయ తీర్మానం: ప్రకాశ్ కారత్ * బీజేపీ విధానాలపై పోరాడతాం * ఆర్ఎస్ఎస్ ఏమి చెబుతోందో చంద్రబాబు అదే చెప్పారంటూ విమర్శ సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాజకీయ పంథా మారనుంది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో అనుసరించిన రాజకీయ ఎత్తుగడల పంథా ఫలితాన్నివ్వలేదని భావిస్తోంది. బూర్జువా పార్టీలతో పొత్తులు, లౌకిక శక్తుల పేరిట సఖ్యతలు, సరళీకృత ఆర్థిక విధానాలు దెబ్బతీసినట్టు అంచనా వేసింది. తిరిగి పాతికేళ్ల కిందటి వామపక్ష, ప్రజాతంత్ర సంఘటనకు శ్రీకారం చుట్టింది. రెండురోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశం సుదీర్ఘ చర్చల అనంతరం రాజకీయ-ఎత్తుగడల పంథాపై సీపీఎం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టామని, బుధవారం సాయంత్రానికి దాన్ని ఆమోదిస్తామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో విశాఖపట్నంలో జరిగే పార్టీ 21వ జాతీయ మహాసభల్లో ఈ తీర్మానాలపై చర్చించి తుది రూపం ఇస్తామని వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టత, దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర సంఘటనను ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రమిస్తుందన్నారు. ఇప్పటివరకు జరిగిన తప్పులేమిటో, లాభనష్టాలేమిటో మరో పదిరోజుల్లో ప్రకటిస్తామన్నారు. దేశంలో ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితిని కేంద్ర కమిటీలో చర్చించినట్టు తెలిపారు. హిందూ మతోన్మాదశక్తుల నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ తన మతతత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ తన మితవాద ధోరణితో దూకూడుగా వ్యవహరిస్తోందని, మున్ముందు బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తుందని కారత్ చెప్పారు. ఇప్పటికే పార్లమెంటును తోసిరాజని మూడు ఆర్డినెన్సులు తెచ్చిందని గుర్తుచేశారు. భూ సేకరణ చట్టంపై తెచ్చిన ఆర్డినెన్స్‌కు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ తీర్మానించినట్టు తెలిపారు. ఒబామా భారత్ పర్యటన సందర్భంగా ఈనెల 24న పెద్దఎత్తున నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. అతిథిగా వచ్చే అమెరికా అధ్యక్షుడు వ్యాపారబృందాన్ని వెంట తీసుకురావడం, భారత్‌కు చేటు తెచ్చే అణు ఒప్పందం వంటి చట్టాలపై సంతకాలు చేయడం వంటి వాటిని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. గతంలోనూ వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన అన్నప్పటికీ ఈసారి పంథాను మార్చి సరికొత్త విధానాలు, నినాదాలతో ముందుకువెళతామని వివరించారు. సంఘటన తరఫున కాకుండా ఏడు వామపక్షపార్టీలు ఒక వేదికగా ఏర్పడి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు ఉండవు, కలిసిపోవడం జరగదని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూసేకరణ చట్టం ప్రకారమే రైతులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎక్కువ సంతానాన్ని కనాల్సిందిగా చంద్రబాబు చెప్పడంపై మాట్లాడుతూ.. బహుశా ఆయన కూడా ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నారేమో అని కారత్ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ఏమి చెబుతుందో చంద్రబాబూ అదే చెప్పారని, మతపరమైన అంశం నుంచే ఈ ఆలోచన పుట్టిందని భావించాల్సి వస్తోందని అన్నారు. సీపీఎం మహాసభల పోస్టర్ ఆవిష్కరణ విశాఖలో వచ్చే ఏప్రిల్ 14 నుంచి 19 వరకు జరగనున్న సీపీఎం 21వ జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. -
అధిక పన్నులు విధించం
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా52 శాతానికి తగ్గిస్తాం భూసేకరణ చట్టంలో సవరణలు శీతాకాల సమావేశాల్లో బీమా ఎఫ్‌డీఐల బిల్లుకు మోక్షం న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదార్లకు ఆమోదయోగ్యమైన, హేతుబద్ధమైన పన్ను పాలసీని అమలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీనిచ్చారు. భారత్‌ను అత్యంత చౌక తయారీ ఉత్పత్తులకు గమ్యస్థానంగా మార్చాలంటే భారీస్థాయిలో పన్నుల విధింపు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. ఆదివారమిక్కడ ఇండియా గ్లోబల్ ఫోరం సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘మన ఆర్థిక వృద్ధి రేటు ఘోరంగా పడిపోయింది. కీలకమైన తయారీ రంగం కూడా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అందుకే మేం దీనిపై దృష్టి కేంద్రీకరించాం. భారత్‌ను తయారీకి గమ్యంగా చేయడమే మా లక్ష్యం’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. విశ్వాసం పెంచుతాం... భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పెంచడమే తమ ప్రధానోద్దేశమని చెప్పారు. ప్రతిపక్షాలు మద్దతివ్వకపోయినా... భూసేకరణ చట్టంలో సవరణలను చేసి తీరుతామని ఆయన స్పష్టంచేశారు. దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణం సజావుగా జరగాలంటే ముందుగా భూసేకరణ చట్టాల్లోని కొన్ని అసంబద్ధ నిబంధనలను తొలగించాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు. బీమా బిల్లు ఆమోదంపై ఆశాభావం... మరోపక్క, రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రతిపాదిత బీమా చట్టాల సవరణ బిల్లుకు ఆమోదముద్రపడేలా చూస్తామని జైట్లీ తెలిపారు. బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ను ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడమే ఈ బిల్లు ఉద్దేశం. ఈ ప్రతిపాదనకు మోదీ సర్కారు ఇప్పటికే ఓకే చెప్పింది. పార్లమెంటులో ఆమోదముద్రపడితే చట్టబద్ధత వస్తుంది. పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా 52%కి... ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులు రూ. 3 లక్షల కోట్లమేర మూలధనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను 52 శాతానికి తగ్గించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గించుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం వివిధ పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వానికి 56.26 శాతం(బ్యాంక్ ఆఫ్ బరోడా)లను నుంచి 88.63 శాతం(సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) స్థాయిలో వాటాలు ఉన్నాయి. -
చంద్రబాబు మాటల్ని నమ్మేదెలా?
రాజధాని కమిటీని నిలదీసిన రైతులు మంచినీళ్ల కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేదు.. 9 నెలల్లోనే కోట్లు వచ్చేలా చేస్తామంటే ఎలా నమ్మాలి? ఉద్యోగం రాక వ్యవసాయం చేసుకుంటున్నా.. ఆ భూమి కూడా లాక్కుంటారా? తుళ్లూరు మండల గ్రామాల్లో భూ సమీకరణ అవగాహన సదస్సులు తుళ్లూరు: రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములు సమీకరించేందుకు ముందస్తుగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. బతుకునిస్తున్న భూములు తీసుకునేందుకు సర్కారు చేస్తున్న యత్నాలపై రైతులు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, నేలపాడు గ్రామాలకు సంబంధించిన సమావేశాన్ని నేలపాడు గ్రామ పంచాయితీ కార్యాలయంలో, బోరుపాలెం, అబ్బురాజు పాలెం, దొండపాడు గ్రామాలకు సంబంధించిన సమావేశాన్ని దొండపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. గురజాల ఆర్డీవో మురళీ, గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు సభల్లో పాల్గొన్నారు. తుళ్ళూరు మండలాన్ని రాజధాని నిర్మాణంలో భాగం చేయడానికి గల కారణాలు వివరించారు. ఐనవోలు గ్రామ రైతు పాలకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయం చేసుకుంటున్నట్లు చెప్పారు. పలు గ్రామాలకు మంచి నీరందించేందుకు శాఖమూరులో తాగునీటి పథకం నిర్మించి ఏడేళ్ళు కావస్తున్నా ఒక్క గ్రామానికీ తాగునీరు ఇవ్వలేదని, 9 నెలల్లో అభివృద్ధి చేసి రైతులకు కోట్ల ఆదాయం వచ్చేలా చూస్తామని అధికారులు, సీఎం చెబితే ఎలా నమ్మాలని ప్రశ్నించా రు. రైతు రంగారావు మాట్లాడుతూ రాజకీయ నాయకులకు రైతులు గొర్రెల్లా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు.ప్రభుత్వం తొలుత రైతులకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ పొలాన్ని మినహాయిస్తారా? నేలపాడు రైతు ధనేకుల రామారావు మాట్లాడుతూ తుళ్ళూరు మండలంలోని వెంకటపాలెం లో ఓ ఎంపీ వందలాది ఎకరాలు పొలం కొనుగోలు చేయడం వల్ల ఆ గ్రామాన్ని ల్యాండ్ పూ లింగ్ నుంచి మినహాయించినట్లు తెలుస్తోంద ని, ఈ పరిస్థితి ఉంటే రైతులు సహకరించరని తెగేసి చెప్పారు. కృష్ణానది ఒడ్డున వున్న బోరుపాలెం, అబ్బురాజుపాలెం గ్రామాల్లో ఎక రం నిమ్మతోటకు రూ.లక్షకు పైగా కౌలు వస్తుందని, ప్రభుత్వం రూ. 25 వేలు కౌలు ఇస్తే ఎలా సరిపోతుందని దొండపాడులో జరిగిన సమావేశంలో రైతులు ప్రశ్నించారు. దొండపాడు మాజీ గ్రామ సర్పంచ్ కొమ్మినేని కృష్ణారావు మాట్లాడుతూ తమ భూములపై ఇప్పటికే ప్రైవేట్‌గా అప్పులు తీసుకున్నామనీ, ఆ భూములు ప్రభుత్వం తీసుకుంటే బాకీలు ఎలా తీర్చాలో అధికారులు చెప్పాలని కోరారు. బాబు అక్రమంగా లక్ష ఎకరాలు రైతుల నుంచి తీసుకుని లక్షమంది రైతులను చంపుతారా అని ఓ రైతు ప్రశ్నించారు. రైతులను భయపెడితే భూ సమీకరణ సాగదు మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజం విజయవాడ బ్యూరో: రాజధాని నగర నిర్మాణానికి ప్రభుత్వం అవలంబిస్తున్న భూ సమీకరణ విధానం సరైన పద్ధ్దతిలో లేదని మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. రైతులను భయపెడితే భూ సమీకరణ సాగదన్నారు. రాజధాని కోసం 30 వేల ఎకరాలు అవసరమన్న మాట అర్థరహితమన్నారు. సీఎం చంద్రబాబుకు ఎవరో తప్పుడు సలహాలిస్తున్నారన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో తుళ్లూరు మండల రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమంటే 3 వేల ఎకరాల వరకు రైతులు ముందుకొచ్చే పరిస్థితి ఉందిగానీ, ఏడాదికి మూడు పంటలు పండే 30 వేల ఎకరాలను ఇవ్వమంటే పొలాలను ఇవ్వబోరని స్పష్టం చేశారు. నయారాయ్‌పూర్‌లో 750, గాంధీనగర్‌లో 12 వేలు, చండీగఢ్‌లో 2,500 ఎకరాల్లో రాజధాని నగరం నిర్మాణం జరగ్గా ఇక్కడ లక్ష ఎకరాలెందుకని ప్రశ్నించారు. గుంటూరు జాతీయ రహదారి పక్కన మంగళగిరి సమీపంలో 3 వేల ఎకరాలు సేకరిస్తే మంచిదన్నారు. తుళ్లూరు మండలం లింగాపురం రైతు అనుమోలు గాంధీ మాట్లాడుతూ, ప్రభుత్వం తుపాకీ ఎక్కు పెట్టి భూముల బేరం చేస్తోందనీ, ఇది మంచిపద్ధతి కాదన్నారు. ఓ మంత్రి పది మంది రైతుల్ని గెస్ట్ హౌస్‌కు పిలిపించుకుని మాట్లాడి, మండల రైతులందరూ అనుకూలమని ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు. పంట పరిహారం కింద ఏడాదికి రూ.25 వేలిస్తామంటోన్న ప్రభుత్వం రెండో ఏడాది నుంచి ఇవ్వకపోతే తమ పరిస్థితేంటని మల్కాపురం రైతు హనుమంతరావు ప్రశ్నించారు. భూ సేకరణ చట్టం ప్రకారం వందకు 70 మంది రైతులు సమ్మతిస్తేనే సేకరణ జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించకూడదనీ, బలవంతంగా భూ సేకరణ జరపాలని ప్రయత్నిస్తే అందరం కలిసి ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సదస్సుల రద్దుకు నిరసనగా ధర్నా భూ సమీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన సదస్సు అర్ధంతరంగా రద్దు చేయడానికి నిరసనగా ఆరు గ్రామాల రైతులు ధర్నా చేశారు. బుధవారం నాలుగు కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తొలుత ప్రకటించారు. ఆ మేరకు రైతులను సమీకరించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నేలపాడు, దొండపాడుల్లో సమావేశాలు నిర్వహించినా.. ఉద్దండ్రాయునిపాలెం, మందడంలలో నిర్వహించాల్సిన సదస్సులు అత్యవసరంగా కలెక్టర్ మీటింగ్ ఉందంటూ అధికారులు వెళ్లిపోవడంతో రద్దయ్యూరుు. దీంతో ఉదయం నుంచి నిరీక్షించిన ఆయూ గ్రామాల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము వ్యతిరేకిస్తామేమోనన్న అనుమానంతోనే వారు సమావేశాలు రద్దు చేశారంటూ రైతులు విజయవాడ-అమరావతి కాలచక్ర రహదారిపై బైఠాయించారు. -
చిగురించిన ఆశలు
సత్తుపల్లి, న్యూస్‌లైన్: ‘కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పతనావస్థలో ఉంది.. మీ సమస్యను పరిష్కరిస్తుందనే నమ్మకం లేదు.. కొత్త భూ సేకరణ చట్టం అమలులోకి వచ్చే 48 గంటల సమయంలో ఆదరాబాదరగా జనరల్ అవార్డు జారీ చేసి చేతులు దులుపుకుంది.. వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే.. మీకు న్యాయం చేస్తాం..’ - టీఆర్ఎస్ శాసనసభా పక్ష నాయకుని హోదాలో ఈటెల రాజేందర్ జనవరి 12న సత్తుపల్లిలో రిలేనిరాహారదీక్షలు చేస్తున్న భూ నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించి ఇచ్చిన హామీ ఇది. రైతుల బతుకులను ఛిద్రం చేసి.. బొగ్గు నిక్షేపాలతో వెలుగులు ప్రసాదిస్తామని చెప్పటం ఎంతవరకు సబబని, అన్నదాతల పొట్టలు కొట్టే ఏ ప్రభుత్వం బాగుపడిన చరిత్ర లేదని, ఓపెన్‌కాస్టులతో సర్వం కోల్పోతున్నారని.. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు సరైన న్యాయం చేయాలని... ఆనాడు ఆయన అన్న మాటలను నేడు ఈప్రాంత వాసులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇక్కడి సింగరేణి భూ నిర్వాసితుల్లో ఆశలు చిగురించాయి. భూ నిర్వాసితుల సమస్యలపై ఈటెల రాజేందర్ సత్తుపల్లి మండలంలోని కొమ్మేపల్లి, కిష్టారం గ్రామాలలో రెండుసార్లు పర్యటించారు. నిర్వాసితులతో సమావేశమై వారి బాధలను స్వయంగా తెలుసుకున్నారు. అదీగాక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య కూడా భూ నిర్వాసితులకు అండగా కొమ్మేపల్లిలో ఈటెల రాజేందర్‌తో కలిసి పర్యటించారు. భూ నిర్వాసితుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఈ ఇద్దరు నేతలు కీలకమైన మంత్రిత్వశాఖల్లో ఉండటంతో భూ నిర్వాసితులు ఇకనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడేం జరిగిందంటే.... నూతన భూసేకరణ చట్టం మరో 48 గంటల్లో అమల్లోకి వస్తున్న తరుణంలో అప్పటి ప్రభుత్వం సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి, కిష్టారం, లంకపల్లి భూములను స్వాధీనం చేసుకుంటూ జనరల్ అవార్డు జారీ చేసి.. నష్టపరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసింది. దీంతో భూ నిర్వాసితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కొమ్మేపల్లిలో పట్టా భూమికి ఎకరాకు రూ.3.47 లక్షల చొప్పున 489 ఎకరాలకు రూ.18.37 కోట్లు, కిష్టారంలో పట్టాభూమి ఎకరాకు రూ.3.94 లక్షలు చొప్పున 98.38 ఎకరాలకు రూ. 3.86 కోట్లు, లంకపల్లిలో పట్టాభూమి ఎకరాకు రూ.4.27 లక్షల చొప్పున 34.29 ఎకరాలకు రూ.1.48 కోట్లు హడావుడిగా డిపాజిట్ చేశారు. నూతన భూ సేకరణ చట్టం ప్రకారం భూములు స్వాధీనం చేసుకోవాలని నిర్వాసితులు చేసిన డిమాండ్లను పట్టించుకోకుండా ఏకపక్షంగా అవార్డు జారీ చేయటం పట్ల సుమారు 400 కుటుంబాలు వీధినపడ్డాయి. అయితే, ఎకరాకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ ధర(రిజిస్ట్రేషన్)కు రెండు రెట్లు పెంచి.. దీనికి నాలుగు రెట్లు పరిహారం ఇచ్చేలా కొత్త భూసేకరణ చట్టంలో పొందుపరిచారు. పునరావాసంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్దేశించారు. దీంతో ఎకరాకు కనీసం రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు నష్ట పరిహారం వచ్చే అవకాశం ఉందని భూ నిర్వాసితులు పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి. 37 రోజుల ఉద్యమ స్వరూపం... సత్తుపల్లి నియోజకవర్గ చరిత్రలోనే 37 రోజుల పాటు దశలవారీగా ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు. నూతన భూసేకరణ చట్టం వర్తింప చేయకుండా కలెక్టర్ జారీ చేసిన జనరల్ అవార్డుపై రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలు తీవ్రంగా స్పందించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి ఐక్య ఉద్యమాలను నిర్వహించారు. నష్ట పరిహారం తీసుకోవటానికి కూడా ఎన్నో చిక్కులు ఉన్నాయి. కోర్టు ద్వారా నష్ట పరిహారం తీసుకుంటే సమస్య మరింత జఠిలమవుతుందని భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమ్మేపల్లి భూ సేకరణ నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉంది. అనుభవదారు కాలంలో ఒకరు.. పట్టాదారు కాలంలో మరొకరు.. ఎంజాయ్మెంట్లో ఇంకొకరున్నారు.అదీగాక నోటిఫికేషన్లో ఎవరి భూమి ఎంతో స్పష్టంగా పేర్కొనలేదు. భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సమక్షంలో రెవెన్యూ యంత్రాంగం నష్ట పరిహారం పంపిణీ జరిపితేనే సమస్యలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. లేనిపక్షంలో పూర్తిగా ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించి నష్ట పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.