అధిక పన్నులు విధించం
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ
పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా52 శాతానికి తగ్గిస్తాం
భూసేకరణ చట్టంలో సవరణలు
శీతాకాల సమావేశాల్లో బీమా ఎఫ్‌డీఐల బిల్లుకు మోక్షం
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదార్లకు ఆమోదయోగ్యమైన, హేతుబద్ధమైన పన్ను పాలసీని అమలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీనిచ్చారు. భారత్‌ను అత్యంత చౌక తయారీ ఉత్పత్తులకు గమ్యస్థానంగా మార్చాలంటే భారీస్థాయిలో పన్నుల విధింపు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. ఆదివారమిక్కడ ఇండియా గ్లోబల్ ఫోరం సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘మన ఆర్థిక వృద్ధి రేటు ఘోరంగా పడిపోయింది. కీలకమైన తయారీ రంగం కూడా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అందుకే మేం దీనిపై దృష్టి కేంద్రీకరించాం. భారత్‌ను తయారీకి గమ్యంగా చేయడమే మా లక్ష్యం’ అని జైట్లీ వ్యాఖ్యానించారు.
విశ్వాసం పెంచుతాం...
భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పెంచడమే తమ ప్రధానోద్దేశమని చెప్పారు. ప్రతిపక్షాలు మద్దతివ్వకపోయినా... భూసేకరణ చట్టంలో సవరణలను చేసి తీరుతామని ఆయన స్పష్టంచేశారు. దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణం సజావుగా జరగాలంటే ముందుగా భూసేకరణ చట్టాల్లోని కొన్ని అసంబద్ధ నిబంధనలను తొలగించాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు.
బీమా బిల్లు ఆమోదంపై ఆశాభావం...
మరోపక్క, రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రతిపాదిత బీమా చట్టాల సవరణ బిల్లుకు ఆమోదముద్రపడేలా చూస్తామని జైట్లీ తెలిపారు. బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ను ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడమే ఈ బిల్లు ఉద్దేశం. ఈ ప్రతిపాదనకు మోదీ సర్కారు ఇప్పటికే ఓకే చెప్పింది. పార్లమెంటులో ఆమోదముద్రపడితే చట్టబద్ధత వస్తుంది.
పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా 52%కి...
ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులు రూ. 3 లక్షల కోట్లమేర మూలధనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను 52 శాతానికి తగ్గించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గించుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం వివిధ పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వానికి 56.26 శాతం(బ్యాంక్ ఆఫ్ బరోడా)లను నుంచి 88.63 శాతం(సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) స్థాయిలో వాటాలు ఉన్నాయి.