చంద్రబాబు మాటల్ని నమ్మేదెలా?
రాజధాని కమిటీని నిలదీసిన రైతులు
మంచినీళ్ల కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేదు..
9 నెలల్లోనే కోట్లు వచ్చేలా చేస్తామంటే ఎలా నమ్మాలి?
ఉద్యోగం రాక వ్యవసాయం చేసుకుంటున్నా.. ఆ భూమి కూడా లాక్కుంటారా?
తుళ్లూరు మండల గ్రామాల్లో భూ సమీకరణ అవగాహన సదస్సులు
తుళ్లూరు: రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములు సమీకరించేందుకు ముందస్తుగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. బతుకునిస్తున్న భూములు తీసుకునేందుకు సర్కారు చేస్తున్న యత్నాలపై రైతులు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, నేలపాడు గ్రామాలకు సంబంధించిన సమావేశాన్ని నేలపాడు గ్రామ పంచాయితీ కార్యాలయంలో, బోరుపాలెం, అబ్బురాజు పాలెం, దొండపాడు గ్రామాలకు సంబంధించిన సమావేశాన్ని దొండపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. గురజాల ఆర్డీవో మురళీ, గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు సభల్లో పాల్గొన్నారు. తుళ్ళూరు మండలాన్ని రాజధాని నిర్మాణంలో భాగం చేయడానికి గల కారణాలు వివరించారు. ఐనవోలు గ్రామ రైతు పాలకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయం చేసుకుంటున్నట్లు చెప్పారు. పలు గ్రామాలకు మంచి నీరందించేందుకు శాఖమూరులో తాగునీటి పథకం నిర్మించి ఏడేళ్ళు కావస్తున్నా ఒక్క గ్రామానికీ తాగునీరు ఇవ్వలేదని, 9 నెలల్లో అభివృద్ధి చేసి రైతులకు కోట్ల ఆదాయం వచ్చేలా చూస్తామని అధికారులు, సీఎం చెబితే ఎలా నమ్మాలని ప్రశ్నించా రు. రైతు రంగారావు మాట్లాడుతూ రాజకీయ నాయకులకు రైతులు గొర్రెల్లా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు.ప్రభుత్వం తొలుత రైతులకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంపీ పొలాన్ని మినహాయిస్తారా?
నేలపాడు రైతు ధనేకుల రామారావు మాట్లాడుతూ తుళ్ళూరు మండలంలోని వెంకటపాలెం లో ఓ ఎంపీ వందలాది ఎకరాలు పొలం కొనుగోలు చేయడం వల్ల ఆ గ్రామాన్ని ల్యాండ్ పూ లింగ్ నుంచి మినహాయించినట్లు తెలుస్తోంద ని, ఈ పరిస్థితి ఉంటే రైతులు సహకరించరని తెగేసి చెప్పారు. కృష్ణానది ఒడ్డున వున్న బోరుపాలెం, అబ్బురాజుపాలెం గ్రామాల్లో ఎక రం నిమ్మతోటకు రూ.లక్షకు పైగా కౌలు వస్తుందని, ప్రభుత్వం రూ. 25 వేలు కౌలు ఇస్తే ఎలా సరిపోతుందని దొండపాడులో జరిగిన సమావేశంలో రైతులు ప్రశ్నించారు. దొండపాడు మాజీ గ్రామ సర్పంచ్ కొమ్మినేని కృష్ణారావు మాట్లాడుతూ తమ భూములపై ఇప్పటికే ప్రైవేట్‌గా అప్పులు తీసుకున్నామనీ, ఆ భూములు ప్రభుత్వం తీసుకుంటే బాకీలు ఎలా తీర్చాలో అధికారులు చెప్పాలని కోరారు. బాబు అక్రమంగా లక్ష ఎకరాలు రైతుల నుంచి తీసుకుని లక్షమంది రైతులను చంపుతారా అని ఓ రైతు ప్రశ్నించారు.
రైతులను భయపెడితే భూ సమీకరణ సాగదు
మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజం
విజయవాడ బ్యూరో: రాజధాని నగర నిర్మాణానికి ప్రభుత్వం అవలంబిస్తున్న భూ సమీకరణ విధానం సరైన పద్ధ్దతిలో లేదని మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. రైతులను భయపెడితే భూ సమీకరణ సాగదన్నారు. రాజధాని కోసం 30 వేల ఎకరాలు అవసరమన్న మాట అర్థరహితమన్నారు. సీఎం చంద్రబాబుకు ఎవరో తప్పుడు సలహాలిస్తున్నారన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో తుళ్లూరు మండల రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమంటే 3 వేల ఎకరాల వరకు రైతులు ముందుకొచ్చే పరిస్థితి ఉందిగానీ, ఏడాదికి మూడు పంటలు పండే 30 వేల ఎకరాలను ఇవ్వమంటే పొలాలను ఇవ్వబోరని స్పష్టం చేశారు.
నయారాయ్‌పూర్‌లో 750, గాంధీనగర్‌లో 12 వేలు, చండీగఢ్‌లో 2,500 ఎకరాల్లో రాజధాని నగరం నిర్మాణం జరగ్గా ఇక్కడ లక్ష ఎకరాలెందుకని ప్రశ్నించారు. గుంటూరు జాతీయ రహదారి పక్కన మంగళగిరి సమీపంలో 3 వేల ఎకరాలు సేకరిస్తే మంచిదన్నారు. తుళ్లూరు మండలం లింగాపురం రైతు అనుమోలు గాంధీ మాట్లాడుతూ, ప్రభుత్వం తుపాకీ ఎక్కు పెట్టి భూముల బేరం చేస్తోందనీ, ఇది మంచిపద్ధతి కాదన్నారు. ఓ మంత్రి పది మంది రైతుల్ని గెస్ట్ హౌస్‌కు పిలిపించుకుని మాట్లాడి, మండల రైతులందరూ అనుకూలమని ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు. పంట పరిహారం కింద ఏడాదికి రూ.25 వేలిస్తామంటోన్న ప్రభుత్వం రెండో ఏడాది నుంచి ఇవ్వకపోతే తమ పరిస్థితేంటని మల్కాపురం రైతు హనుమంతరావు ప్రశ్నించారు. భూ సేకరణ చట్టం ప్రకారం వందకు 70 మంది రైతులు సమ్మతిస్తేనే సేకరణ జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించకూడదనీ, బలవంతంగా భూ సేకరణ జరపాలని ప్రయత్నిస్తే అందరం కలిసి ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
సదస్సుల రద్దుకు నిరసనగా ధర్నా
భూ సమీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన సదస్సు అర్ధంతరంగా రద్దు చేయడానికి నిరసనగా ఆరు గ్రామాల రైతులు ధర్నా చేశారు. బుధవారం నాలుగు కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తొలుత ప్రకటించారు. ఆ మేరకు రైతులను సమీకరించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నేలపాడు, దొండపాడుల్లో సమావేశాలు నిర్వహించినా.. ఉద్దండ్రాయునిపాలెం, మందడంలలో నిర్వహించాల్సిన సదస్సులు అత్యవసరంగా కలెక్టర్ మీటింగ్ ఉందంటూ అధికారులు వెళ్లిపోవడంతో రద్దయ్యూరుు. దీంతో ఉదయం నుంచి నిరీక్షించిన ఆయూ గ్రామాల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము వ్యతిరేకిస్తామేమోనన్న అనుమానంతోనే వారు సమావేశాలు రద్దు చేశారంటూ రైతులు విజయవాడ-అమరావతి కాలచక్ర రహదారిపై బైఠాయించారు.