చిగురించిన ఆశలు
సత్తుపల్లి, న్యూస్‌లైన్: ‘కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పతనావస్థలో ఉంది.. మీ సమస్యను పరిష్కరిస్తుందనే నమ్మకం లేదు.. కొత్త భూ సేకరణ చట్టం అమలులోకి వచ్చే 48 గంటల సమయంలో ఆదరాబాదరగా జనరల్ అవార్డు జారీ చేసి చేతులు దులుపుకుంది.. వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే.. మీకు న్యాయం చేస్తాం..’ - టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నాయకుని హోదాలో ఈటెల రాజేందర్ జనవరి 12న సత్తుపల్లిలో రిలేనిరాహారదీక్షలు చేస్తున్న భూ నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించి ఇచ్చిన హామీ ఇది.
రైతుల బతుకులను ఛిద్రం చేసి.. బొగ్గు నిక్షేపాలతో వెలుగులు ప్రసాదిస్తామని చెప్పటం ఎంతవరకు సబబని, అన్నదాతల పొట్టలు కొట్టే ఏ ప్రభుత్వం బాగుపడిన చరిత్ర లేదని, ఓపెన్‌కాస్టులతో సర్వం కోల్పోతున్నారని.. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు సరైన న్యాయం చేయాలని... ఆనాడు ఆయన అన్న మాటలను నేడు ఈప్రాంత వాసులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇక్కడి సింగరేణి భూ నిర్వాసితుల్లో ఆశలు చిగురించాయి. భూ నిర్వాసితుల సమస్యలపై ఈటెల రాజేందర్ సత్తుపల్లి మండలంలోని కొమ్మేపల్లి, కిష్టారం గ్రామాలలో రెండుసార్లు పర్యటించారు.
నిర్వాసితులతో సమావేశమై వారి బాధలను స్వయంగా తెలుసుకున్నారు. అదీగాక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య కూడా భూ నిర్వాసితులకు అండగా కొమ్మేపల్లిలో ఈటెల రాజేందర్‌తో కలిసి పర్యటించారు. భూ నిర్వాసితుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఈ ఇద్దరు నేతలు కీలకమైన మంత్రిత్వశాఖల్లో ఉండటంతో భూ నిర్వాసితులు ఇకనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడేం జరిగిందంటే....
నూతన భూసేకరణ చట్టం మరో 48 గంటల్లో అమల్లోకి వస్తున్న తరుణంలో అప్పటి ప్రభుత్వం సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి, కిష్టారం, లంకపల్లి భూములను స్వాధీనం చేసుకుంటూ జనరల్ అవార్డు జారీ చేసి.. నష్టపరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసింది. దీంతో భూ నిర్వాసితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కొమ్మేపల్లిలో పట్టా భూమికి ఎకరాకు రూ.3.47 లక్షల చొప్పున 489 ఎకరాలకు రూ.18.37 కోట్లు, కిష్టారంలో పట్టాభూమి ఎకరాకు రూ.3.94 లక్షలు చొప్పున 98.38 ఎకరాలకు రూ. 3.86 కోట్లు, లంకపల్లిలో పట్టాభూమి ఎకరాకు రూ.4.27 లక్షల చొప్పున 34.29 ఎకరాలకు రూ.1.48 కోట్లు హడావుడిగా డిపాజిట్ చేశారు.
నూతన భూ సేకరణ చట్టం ప్రకారం భూములు స్వాధీనం చేసుకోవాలని నిర్వాసితులు చేసిన డిమాండ్లను పట్టించుకోకుండా ఏకపక్షంగా అవార్డు జారీ చేయటం పట్ల సుమారు 400 కుటుంబాలు వీధినపడ్డాయి. అయితే, ఎకరాకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ ధర(రిజిస్ట్రేషన్)కు రెండు రెట్లు పెంచి.. దీనికి నాలుగు రెట్లు పరిహారం ఇచ్చేలా కొత్త భూసేకరణ చట్టంలో పొందుపరిచారు. పునరావాసంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్దేశించారు. దీంతో ఎకరాకు కనీసం రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు నష్ట పరిహారం వచ్చే అవకాశం ఉందని భూ నిర్వాసితులు పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి.
37 రోజుల ఉద్యమ స్వరూపం...
సత్తుపల్లి నియోజకవర్గ చరిత్రలోనే 37 రోజుల పాటు దశలవారీగా ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు. నూతన భూసేకరణ చట్టం వర్తింప చేయకుండా కలెక్టర్ జారీ చేసిన జనరల్ అవార్డుపై రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలు తీవ్రంగా స్పందించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి ఐక్య ఉద్యమాలను నిర్వహించారు. నష్ట పరిహారం తీసుకోవటానికి కూడా ఎన్నో చిక్కులు ఉన్నాయి. కోర్టు ద్వారా నష్ట పరిహారం తీసుకుంటే సమస్య మరింత జఠిలమవుతుందని భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమ్మేపల్లి భూ సేకరణ నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉంది.
అనుభవదారు కాలంలో ఒకరు.. పట్టాదారు కాలంలో మరొకరు.. ఎంజాయ్‌మెంట్‌లో ఇంకొకరున్నారు.అదీగాక నోటిఫికేషన్‌లో ఎవరి భూమి ఎంతో స్పష్టంగా పేర్కొనలేదు. భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సమక్షంలో రెవెన్యూ యంత్రాంగం నష్ట పరిహారం పంపిణీ జరిపితేనే సమస్యలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. లేనిపక్షంలో పూర్తిగా ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించి నష్ట పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.