‘నల్లధనం’పై ప్రతిపక్షాల మండిపాటు
న్యూఢిల్లీ: ‘నల్లధనం’ అంశంపై అధికార బీజేపీపై కాంగ్రెస్ పార్టీ మరోసారి విరుచుకుపడింది. అధికారంలోకి రాగానే నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామంటూ లోక్‌సభ ఎన్నికలప్పుడు పలికిన ప్రగల్బాలన్నీ ఏమయ్యాయని మండిపడింది. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఆరోపించింది. విదేశాల్లో సొమ్ము దాచుకున్న 55 వేల మంది పేర్లను బయటపెడతామని ఎన్నికల సమయంలో బీజేపీ వాగ్దానం చేసిందని.. మరి అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా కనీసం 55 మంది పేర్లయినా బయటపెట్టలేదేమని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ బుధవారం విమర్శించారు. ‘ఈ అంశంలో కోర్టు స్పందించి.. విదేశాల్లో సొమ్ముదాచుకున్న వారి పేర్లను వెల్లడించాల్సిందిగా కోరింది. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం తామే ఈ అంశంలో ముందుకు వెళుతున్నట్లుగా చెప్పుకొంటూ ప్రజలను మోసం చేస్తోంది’ అని అన్నారు.
పాత కథే చెబుతున్నారు: సీపీఎం
మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మన్మోహన్ ప్రభుత్వం తరహాలోనే వ్యవహరిస్తోందని.. నల్లధనాన్ని వెనక్కి తెచ్చే అంశంలో మోదీ ప్రభుత్వంపై ఏమాత్రం నమ్మకం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ విమర్శించారు. శివసేన కూడా నల్లధనం అంశంలో కేంద్రం చర్యలను తప్పుబట్టింది.
ఇది సున్నితమైన అంశం.. బీజేపీ: నల్లధనం అంశం సున్నితమైందని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కితెచ్చేందుకు చట్ట ప్రక్రియలు ఉన్నాయన్నారు.
రాజీవ్ పేరుందన్న వార్తలపై ఫిర్యాదు
ఇండోర్: కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన నల్లకుబేరుల జాబితాలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ పేరుందంటూ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తలపై కాంగ్రెస్‌సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మా దివంగత నేత రాజీవ్, మా పార్టీల ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఆ వదంతులను ప్రారంభించిన, వ్యాప్తి చేస్తోన్న వారిని గుర్తించి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరాం’ అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత ధర్మేంద్ర వాజ్‌పేయి తెలిపారు.
బీజేపీ సర్కారుది పచ్చిమోసం..!
Published Thu, Oct 30 2014 1:05 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
Advertisement