‘నల్ల’ రాకాసికి ఎన్నికల నిధులే పుట్టిల్లు!
ఎన్నికల్లో ఏరులై పారుతున్న నల్లధనం
అభ్యర్థుల ఖర్చులో 95 శాతం అదే
- పార్టీలకు భారీగా ‘నల్లధనం’ విరాళాలు
- విధిగా లెక్క చెప్పాల్సిన అవసరం లేకపోవడమే కారణం
- నోట్లు రద్దు చేసినా పార్టీలపై ప్రభావం లేదు
- మోదీ ‘రద్దు’ అస్త్రం యూపీ ఎన్నికలపై గురేనా?
నల్లధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ సర్కారు ప్రకటించింది. మరి నల్లధనం ఎలా పుడుతుందంటే.. అవినీతి వల్ల అనే సమాధానం వస్తుంది. అవినీతి ఎక్కడ ఎక్కువంటే.. రాజకీయాల్లోనే అనే జవాబు లభిస్తుంది! మన దేశంలో రాజకీయాలు, అవినీతి విడదీయలేనంతగా పెనవేసుకు ఉన్నాయన్నది నిష్టూర సత్యం. ఎప్పటికప్పుడు రాజకీయ అవినీతి పెరుగుతోందేగానీ.. తగ్గడం లేదు. బోఫోర్స్ నుంచి అగస్టా వరకు.. దాణా నుంచి 2జీ వరకు జాతీయ స్థాయిలోనైనా, రాష్ట్ర స్థాయిలోనైనా, చివరికి పంచాయతీ స్థాయిలో కూడా ఏ కుంభకోణాన్ని కదిలించినా.. అందులో రాజకీయ నాయకుల పాత్రపై ఆరోపణలు కనిపిస్తాయి. నిందితులతో నాయకులకు సన్నిహిత సంబంధాలు వెల్లడవుతాయి. ఈ అవినీతికి, నల్లడబ్బుకి జన్మస్థానం ఎన్నికలు, ఎన్నికల నిధులేనన్నది నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో నల్లధనం పాత్రపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్..
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
ఎన్నికల వేళ నల్లధనం విపరీతంగా ప్రవహిస్తుందనేది జగమెరిగిన సత్యం. ప్రధాన పార్టీలేవీ దీనికి మినహాయింపు కాదు. పార్టీ టికెట్ సంపాదించుకోవడానికి చెల్లించే సొమ్ము దగ్గరి నుంచి.. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే కార్యకర్తలకు రోజు వారీ ఖర్చులు, కూలీలు, వాహనాల అద్దెలు, వాటిలో పెట్రోల్, డీజిల్, బ్యానర్లు, పాంప్లెట్ల ముద్రణ, చివరికి ఓటు కోసం నోట్ల పంపిణీ వరకూ భారీగా డబ్బు వ్యయమవుతుంది. అయితే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే వ్యయంపై ఎటువంటి గరిష్ట పరిమితీ లేకున్నా... అభ్యర్థులు వ్యక్తిగతంగా చేసే ఖర్చుపై ఈసీ పరిమితులు విధించింది. లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక అభ్యర్థి.. పెద్ద నియోజకవర్గమైతే రూ.70 లక్షల వరకు, చిన్న నియోజకవర్గమైతే రూ.54 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. దేశంలో 533 పెద్ద లోక్‌సభ స్థానాలు, 10 చిన్న లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఒక అభ్యర్థి ఎన్నికల్లో చట్టబద్ధంగా చేసే ఖర్చు ఈ పరిమితిని దాటితే.. ఆ అభ్యర్థి గెలిచినా తన సీటు కోల్పోవడమే కాదు, మరో ఆరేళ్ల పాటు పోటీ చేయడానికి కూడా అనర్హుడవుతారు.
లెక్క చెప్పేది ఐదు శాతమే!
పార్లమెంటు ఎన్నికల్లో పట్టణ ప్రాంత లోక్‌సభ నియోజకవర్గంలో గెలవాలంటే ఒక్కో అభ్యర్థికి కనీసం రూ.10 కోట్లు, గ్రామీణ ప్రాంత నియోజకవర్గమైతే రూ.5 కోట్లు ఖర్చవుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
► 2014 లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలిస్తే.. నిబంధనల ప్రకారం ఉండే పరిమితిలో వారు 58 శాతం మాత్రమే ఖర్చు చేసినట్లు అధికారికంగా సమర్పించిన లెక్కలు చెబుతున్నాయి. అంటే ఒక్కో అభ్యర్థి రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల లోపే ఖర్చు చేసినట్లు చూపారన్నమాట.
► అంటే.. ఎన్నికల కోసం రూ.10 కోట్లు ఖర్చు చేసే అభ్యర్థి లెక్కల్లో రూ.40 లక్షలు మాత్రమే ఖర్చు చూపిస్తున్నాడు. దీనిని బట్టి మిగతా 9.60 కోట్లూ (అంటే ఖర్చులో 96 శాతం) నల్లధనమేనన్నది స్పష్టమవుతోంది. వాస్తవ ఖర్చులో నాలుగైదు శాతమే తెల్లధనం ఖర్చు చేస్తారన్నమాట.
► వికీలీక్స్ విడుదల చేసిన ఒక పత్రం ప్రకారం.. ఎన్నికల వ్యయానికి చట్టబద్ధంగా అనుమతించిన పరిమితి మొత్తం 2009 పార్లమెంటు ఎన్నికల్లో కేవలం ఒక్క ఎన్నికల రోజు ఖర్చుకే సరిపోయిందని లోక్‌సభ ఎంపీ ఒకరు పేర్కొన్నారు.
► దివంగత బీజేపీ మంత్రి గోపీనాథ్ ముండే కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ.. 2009 ఎన్నికల్లో తాను రూ.8 కోట్లు ఖర్చు చేసినట్లు అంగీకరించారు. కానీ ఆ తర్వాత ఆ ప్రకటనను ఉపసంహరించుకోవడం వేరే విషయం.
► ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు కూడా గత ఎన్నికల్లో తాను రూ.11.5 కోట్లు ఖర్చుపెట్టినట్లు ఒక ఇంటర్వూ్యలో చెప్పారు. నిజానికి శాసనసభ నియోజకవర్గ ఎన్నికల వ్యయం పరిమితి రూ.28 లక్షలే. కానీ తర్వాత తాను అలా అనలేదని, ఎన్నికల్లో ఖర్చు పెరిగిందని అన్నానని కోడెల వివరణ ఇచ్చినా.. దీనిపై వివాదం చెలరేగటం తెలిసిందే.
► సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అంచనా ప్రకారం.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు, అభ్యర్థులు కలసి రూ.35,000 వేల కోట్లు ఖర్చుచేశారు (అభ్యర్థులు పార్టీ టికెట్లు ‘పొందడానికి’ చెల్లించే మొత్తం కాకుండా!). అధికారిక అంచనా మాత్రం ఆ ఖర్చు రూ.7,000 కోట్ల నుండి రూ.8,000 కోట్లు మాత్రమే. అంటే మిగతా రూ.27,000 కోట్లు లెక్కలో లేని డబ్బేనన్న మాట.
► ఎన్నికల్లో పార్టీలు, నాయకులు నల్లధనాన్ని ఎన్నో రకాలుగా వినియోగిస్తారు. ఉదాహరణకు ఒక పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్‌ను వినియోగిస్తే గంటకు రూ.3 లక్షల చొప్పున చార్జీ కట్టాలి. కానీ సదరు కంపెనీ ఆ రేటును రూ.1.25 లక్షలుగా చూపుతుంది. మిగతా మొత్తాన్ని నగదు రూపంలో తీసుకుంటుంది. అది నల్లధనం. అంతేకాదు హెలికాప్టర్‌ను 100 గంటలు వినియోగిస్తే.. బిల్లులో 50 గంటలుగానే చూపుతారు.
పార్టీల విరాళాల్లో నల్లధనమే అధికం!
రాజకీయ విరాళాలకు సంబంధించిన నియమ నిబంధనల తీరు కూడా ఎన్నికల్లో నల్లధన ప్రవాహానికి ప్రధాన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 13ఎ కింద రాజకీయ పార్టీలకు అన్ని ఆదాయ వనరుల మీదా 100 శాతం పన్ను మినహాయింపు ఉంది. పైగా రూ.20,000 లోపు ఉండే నగదు విరాళాలకు సంబంధించిన వివరాలను, దాతల పేర్లను అవి వెల్లడించాల్సిన అవసరం లేదు. ఈ నిబంధనను చాలా మంది వ్యాపారులు అవకాశంగా తీసుకుంటుంటారు. ఎందుకంటే వారు పార్టీకి విరాళం ఇచ్చిన విషయం రహస్యంగా ఉండడం ఒకటికాగా.. విరాళంగా ఇచ్చే నల్లధనానికి లెక్కచెప్పాల్సిన అవసరమూ ఉండకపోవడం రెండో ప్రయోజనం
► ఇక రూ.20,000 కు పైబడిన విరాళాల విషయంలోనూ రాజకీయ పార్టీలు సంబంధిత దాతల పేర్లను ప్రకటించడం అరుదు. ఉదాహరణకు.. 2014–15లో తమకు వచ్చిన రూ.138.98 కోట్ల విరాళాలకు సంబంధించిన చెక్కులు, డీడీల నంబర్లను కాంగ్రెస్ వెల్లడించలేదు. ఈ సొమ్ము ఆ ఏడాది కాంగ్రెస్‌కు రూ.20,000 కన్నా ఎక్కువ మొత్తాల్లో వచ్చిన విరాళాల్లో 98 శాతం.
► నిజానికి పార్టీలు తమకు పన్ను రాయితీలు వద్దనుకుంటే అవి రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ దాఖలు చేసినా.. రాజకీయ పార్టీల ఆదాయ రిటర్నులను తనిఖీ చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు. ఏవైనా లోపాలున్నా పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసేలాంటి కఠిన చర్యలు చేపట్టే అధికారం ఈసీకి లేదని మాజీ ఎన్నికల కమిషనర్ సీఈసీ ఖురేషీ పేర్కొన్నారు.
► ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఏడీఆర్) అధ్యయనం ప్రకారం.. 2005–2013 మధ్య ఆరు రాజకీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం)లకు రూ.5,986.32 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో 73 శాతం నిధులు గుర్తుతెలియని మార్గాల ద్వారా వచ్చినవే కావడం గమనార్హం.
ఇందిర ‘నిషేధాన్ని’ తొలగించిన రాజీవ్
మన దేశంలో తొలుత రాజకీయ పార్టీలు సభ్యత్వ ఫీజులు, సభ్యత్వ విరాళాలతో నడిచేవి. కానీ 60వ దశకం వచ్చేటప్పటికి ఎన్నికల ప్రచార ఖర్చు విపరీతంగా పెరిగిపోవడంతో.. పార్టీలు విరాళాల కోసం వ్యాపార సంస్థలను ఆశ్రయించడం మొదలైంది. బడా వ్యాపార సంస్థలు, కాంట్రాక్టర్లు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ద్వారా వాటి ప్రాపకం సంపాదిస్తుంటారు. ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చినపుడు తమ వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా పనిచేస్తాయనే ఆ సంస్థలు, కాంట్రాక్టర్ల నమ్మకాన్ని పార్టీలు కూడా వమ్ముచేయవు.
► అయితే తొలినాళ్లలో స్వతంత్ర పార్టీ, జన్‌సంఘ్ వంటి ప్రతిపక్ష పార్టీలకు కార్పొరేట్ సంస్థల మద్దతు పెరగడంతో 1969లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కార్పొరేట్ విరాళాలపై నిషేధం విధించారు. తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1985లో ఆ నిషేధాన్ని తొలగించారు. కార్పొరేట్ సంస్థలు తమ గత మూడేళ్ల మొత్తం లాభాల్లో 5 శాతం వరకూ రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చేందుకు అనుమతించారు. ఆ తర్వాత ఈ పరిమితిని 7.5 శాతానికి పెరిగింది.
► ఇక రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర సమాచార కమిషన్ 2014 జూన్ 3న ఇచ్చిన ఉత్తర్వును పార్టీలు తిరస్కరించడం గమనార్హం.
యూపీ ఎన్నికలపై అస్త్రమేనా?
త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు నల్లధనం అందుబాటులో లేకుండా చేసి, వ్యూహాత్మకంగా దెబ్బతీసే ఉద్దేశంతోనే మోదీ సర్కారు నోట్ల రద్దును అమల్లోకి తెచ్చిందన్న ఆరోపణలు, విశ్లేషణలు తొలి నుంచీ వెలువడుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు పెద్ద మొత్తంలో డబ్బును పంపిణీ చేయడానికి స్థానికంగా పార్టీ మధ్యశ్రేణి కార్యకర్తలకు, ఇతర నమ్మకమైన కేంద్రాలకు ముందుగానే చేరవేస్తారు. ‘ఎన్నికల ప్రకటన వెలువడి, ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక నగదును రవాణా చేయడం కష్టమని రాజకీయ నాయకులకు తెలుసు.
అందుకనే ఆశావహులు, తాము పోటీ చేయడం ఖాయమని నిర్ణయించుకున్న వారు ఐదారు నెలల ముందు నుంచే ‘ఎన్నికల ఖర్చు’ కోసం నగదును సిద్ధం చేసుకుని రవాణా చేయడం మొదలుపెడతారు. ఇప్పుడు నోట్ల రద్దు కారణంగా ఆ ప్రక్రియ స్తంభించిపోవచ్చు..’ అని మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు కూడా. యూపీలో శాసనసభ ఎన్నికల కోసం బీజేపీ తరఫున ‘ఏర్పాట్ల’ను పర్యవేక్షిస్తున్న అగ్రనాయకులు.. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన తర్వాత మూడు రోజుల పాటు అన్ని కదలికలనూ నిలిపివేసినట్లు ఆ పార్టీ వర్గాలే పేర్కొన్నాయి.
ప్రలోభాలకు ‘కొత్త’ మార్గాలు!
‘‘నోట్ల రద్దు విషయం ఏ రాజకీయ పార్టీకీ ముందుగా తెలియకుండా ఉన్నట్లయితే.. రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి కానీ, భారీ వ్యయంతో ప్రచారం చేయడానికి కానీ ఎవరికీ డబ్బు ఉండదు. తక్కువ వ్యయంతో గతంలో కన్నా ఈ ఎన్నికలు ‘శుభ్రం’గా జరుగుతాయి..’’ అని ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఏడీఆర్) వ్యవస్థాపకుడు జగ్దీప్ చోకర్ అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయ పార్టీలు, నాయకులు ఇప్పటికే ఎన్నికల ఖర్చు కోసం కొత్త మార్గాలను కనుగొన్నట్లు కనిపిస్తోంది. నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టడానికి బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు వంటివి పంచినట్లు వార్తలు వచ్చాయి. కొందరైతే ఏకంగా ఆస్తి పన్ను, నీటి పన్ను, విద్యుత్ బిల్లు, పెట్రోల్ బిల్లులు, చివరికి ఆస్పత్రి బిల్లులు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది.
రద్దయిన నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి గడువు ఉండటంతో.. ఓటుకు రూ.2,500 చొప్పున పలువురు అభ్యర్థులు పాత నోట్లనే పంచారని, ఓటర్లు వాటిని తమ ఖాతాల్లో జమ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక కాంగ్రెస్ ఎంపీ కమల్‌నాథ్ ఇటీవల మాట్లాడుతూ.. ‘తెలివైన రాజకీయ పార్టీ కానీ, నాయకుడు కానీ.. ఎవరూ డబ్బును ఇంట్లో నిల్వ ఉంచుకోరు. నల్లడబ్బు దాచుకున్న వారు నోట్ల రద్దును అధిగమించడానికి అనేక మార్గాలు కనిపెట్టినట్లు మనం చూస్తున్నాం. మోదీ నిజంగా ఎన్నికలను ప్రక్షాళన చేయాలని కోరుకుంటే.. ఆయన ఎన్నికల సంస్కరణలు తేవాలి కానీ ఇలా సామాన్యులను వేధించవద్దు..’’ అని వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.