నల్లధనాన్ని స్వాధీనం చేసుకోవాలి
సీపీఐ జాతీయ కార్యవర్గం డిమాండ్
ఆ ధనాన్ని పేదరిక నిర్మూలనకు వినియోగించాలి
నల్లధనాన్ని దాచినవారి పేర్లు తెలుసుకునే హక్కు ప్రజలకుంది
హైదరాబాద్: నల్లధనాన్ని స్వాధీనం చేసుకుని, దేశంలో పేదరిక నిర్మూలనకు దానిని ఉపయోగించాలని సీపీఐ జాతీయ కార్యవర్గం డిమాండ్‌చేసింది. విదేశాల్లో అక్రమ ఖాతాలున్న వారితో పాటు, వీరినుంచి నిధులు అందుకుంటున్న రాజకీయపార్టీలపై కఠినచర్యలు తీసుకోవాలని పేర్కొంది. సీపీఐ రెండురోజుల జాతీయ కార్యవర్గభేటీ బుధవారం మఖ్దూంభవన్‌లో ప్రారంభమైంది, విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్న వారందరి పేర్లను తెలుసుకునే హక్కు దేశప్రజలకు ఉందని ఈ సమావేశం పేర్కొంది. ఈ అంశంపై విచారణను నిర్వహించి ఈ సంపదను విదేశాలకు ఎలా తరలించారు, ఎందుకు వినియోగించారన్న దానిని తేల్చాలని డిమాండ్‌చేస్తూ తీర్మానాన్ని ఆమోదించినట్లు సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నల్లధనం విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరిని ఆహ్వానిస్తూ, విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచిన వారందరి పేర్లు, వివరాలను బయటపెట్టేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని తీర్మానంలో సీపీఐ కోరింది. కేవలం సిట్ విచారణ జరుపుతున్న కేసులకు పరిమితం కాకుండా మొత్తం సమాచారాన్ని ప్రజలకు వెల్లడించాలని కోరింది. తాజాగా కేంద్రం బయటపెట్టిన మూడుపేర్లలో ఒకరు బీజేపీ, కాంగ్రెస్‌లకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన వ్యక్తి అని తెలిపింది. యూపీఏ-2 బాటలోనే బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని, నల్లధనం ఉన్న వారి పేర్లను బయటపెడితే అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించినట్లు అవుతుందంటూ పాతపాటే పాడుతోందని సీపీఐ ధ్వజమెత్తింది.
నల్లధనం మొత్తాన్ని తీసుకురావాల్సిందే
‘‘విదేశీ బ్యాంకుల్లో ఉన్న మొత్తం నల్లధనాన్ని దేశానికి తీసుకురావాల్సిందే. నల్ల కుబేరుల జాబితాను పూర్తిగా బయటపెట్టాలి. ఎన్డీఏ వైఫల్యాలు, వామపక్షాల ఐక్యత తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నాం’’.
- సురవరం సుధాకర్‌రెడ్డి
తిమింగలాలను వదిలి చిన్నచేపల పేర్లా?
‘‘ఎన్నికలకు ముందు నల్లధనాన్ని వందరోజుల్లో తీసుకొస్తామని చెప్పిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తిమింగలాలను వదిలి చిన్న చేపల పేర్లను ప్రకటించింది. 750 మందికి పైగా ఉన్న నల్లకుబేరుల వివరాలను పూర్తిగా వెల్లడించాలి. దేశ రాజకీయాలు, విధానాలను కార్పొరేట్లు, సంఘ్‌పరివార్‌శక్తులు శాసిస్తున్నాయి’’.
- సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా
బూర్జువా పార్టీలకు ఇక దూరం
కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు కారణంగా తెలంగాణలో పార్టీకి కలిగిన నష్టాన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గం అభిప్రాయపడింది. బూర్జువా పార్టీలతో పొత్తు వల్ల వామపక్షాలకు రాజకీయంగా నష్టం జరిగినందున ఇకపై ఈ పార్టీలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. జార్ఖండ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో 13 కంటె ఎక్కువ సీట్లలో, జమ్మూకాశ్మీర్‌లో 3 సీట్లలో పోటీచేయాలని సీపీఐ నిర్ణయించింది. గురువారం ఈ భేటీ ముగియనుంది.