
బూర్జువా పార్టీలకు ఆప్ ప్రత్యామ్నాయమే.. వామపక్షాలకు కాదు: కరత్
బూర్జువా పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయంగా రూపొందొచ్చు గానీ, వామపక్షాలకు మాత్రం కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్ అన్నారు. ఢిల్లీలో కేవలం ఓ మైనారిటీ ప్రభుత్వాన్ని మాత్రమే ఏర్పాటు చేసిన ఆప్ గురించి అప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. ఢిల్లీలో ఆ పార్టీ మంచి ఫలితాలే సాధించినా, మిగిలిన రాష్ట్రాల గురించి మాత్రం అంత నమ్మకంగా చెప్పలేమన్నారు. వారికి మధ్యతరగతి నుంచి మద్దతు లభించడం మంచి విషయమేనని, అయితే వాళ్ల కార్యక్రమాలు, విధానాల గురించి మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని ప్రకాష్ కరత్ చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి అటు వామపక్షాల మద్దతుదారులు కొందరితో పాటు ఇతర పక్షాల నుంచి కూడా తగినంత బలం లభించిన విషయాన్ని కరత్ అంగీకరించారు. వామపక్షాలు ఆప్తో పొత్తు పెట్టుకుంటాయా అని ప్రశ్నించగా, వాళ్లకు అసలు పొత్తులపైనే నమ్మకం ఉన్నట్లు కనిపించడంలేదని చెప్పారు. ఉదారవాద విధానాలు, మత వాదం లాంటి అంశాలపై వాళ్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం తమకుందని ప్రకాష్ కరత్ అన్నారు.