ఆప్‌తో చెలిమి కాంగ్రెస్‌కు బలిమి ? | Congress And Aam aadmi party Alliance In Delhi Benefits To Whom | Sakshi
Sakshi News home page

ఆప్‌తో చెలిమి కాంగ్రెస్‌కు బలిమి ?

Published Thu, Feb 7 2019 2:39 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress And Aam aadmi party Alliance In Delhi Benefits To Whom - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో  ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తాయా ? లేదా ? ఉమ్మడిగా పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టం ? ఏ పార్టీకి లాభం ? విడివిడిగా పోటీ చేస్తే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? గత ఎన్నికల్లో ఏడు లోక్‌సభ సీట్లను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈ సారి అదే రీతిలో రాణించగలదా? ఆప్, కాంగ్రెస్‌ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయా ? లేవా ? గత కొంతకాలంగా రాజకీయ పరిశీలకుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. 

బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ఆప్, కాంగ్రెస్‌ పార్టీల ఏకైక లక్ష్యం కనుక, బీజేపీ ఓటు చీలకుండా చూడాలంటే ఆప్, కాంగ్రెస్‌ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయడం మంచిదని గత పోలీంగ్‌ డేటా సూచిస్తోంది. అయితే ఈ విషయంలో రాజకీయ పరిశీలకులు, నిపుణులు పరస్పరం విభేదిస్తున్నారు. ఢిల్లీ ఓటర్లు ప్రధానంగా ఆప్‌ పార్టీని కోరుకోవడం లేదు గనుక ఆ పార్టీతో కలిసి పోటీచేస్తే కాంగ్రెస్‌ పార్టీకి భారం అవుతుంది మినహా ప్రయోజనం కలిగించదని ‘సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌’కు చెందిన రాజకీయ విశ్లేషకులు ప్రవీణ్‌ రాయ్‌ వ్యాఖ్యానించారు. జవహర్‌లాల్‌ యూనివర్శిటీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ కంపెరేటివ్‌ పాలిటిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ థియరీ’ ప్రొఫెసర్‌ ప్రదీప్‌ దత్తా దీనితో విభేదిస్తున్నారు. 

కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు అవకాశాల గురించి చర్చించామని, అయితే ఆ పార్టీ తలబిరుసుతనంతో వ్యవహరిస్తోందని ఢిల్లీ ఆప్‌ మంత్రి గోపాల్‌ రాయ్‌ చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరే అవకాశం లేదని పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ కూడా అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనుకుంటున్న ప్రజలు ఎక్కువగా ఉన్నారని, బీజేపీని అడ్డుకునే పార్టీ ఆప్‌ అని వారు భావిస్తే వారంతా తమకే ఓటు వేస్తారని ఆయన చెప్పారు. ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లకు కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని మరోసారి పార్టీ బాధ్యతలు స్వీకరించిన షీలా దీక్షిత్‌ ఫిబ్రవరి మూడవ  తేదీన ప్రకటించారు. ఈ సీట్ల నుంచి పోటీ చేసేందుకు కొందరు పాతవాళ్లతోపాటు కొత్తవాళ్లు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా ఆమె చెప్పారు. 

పార్లమెంటరీ ఎన్నికల తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందని, అయితే తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్‌ పార్టీదేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగాను 29 స్థానాలను గెలుచుకున్న ఆప్, కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆప్‌ ప్రభుత్వం 49 రోజుల్లోనే కూలిపోయింది.  ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా అగ్రవర్ణాల వారు బీజేపీ వైపు, దళితులు ఆప్‌కు వెల్లడంతో కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది. 

ఈ వర్గాలు తిరిగి కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నందున కాంగ్రెస్‌ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఒంటరిగానే పోటీ చేయాలని కొందరు రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ లోక్‌సభ సీట్లను కాంగ్రెస్‌ ఎక్కువగా గెలుచుకుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎక్కువ సీట్లను ఆశించవచ్చని అంటున్నారు. ఆప్, కాంగ్రెస్‌ పార్టీలు విడివిడిగా పోటీ చేసినట్లయితే సుస్థిరతను కోరుకునే ఓటర్ల బీజేపీవైపు తిరుగుతారని మరి కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటర్లు రాష్ట్ర ఎన్నికల్లో సుస్థిరతను కోరుకుంటారు తప్ప, లోక్‌సభ ఎన్నికల్లో సుస్థిరతను పరిగణలోకి తీసుకోరని వారంటున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement