రాహుల్‌గాంధీని సత్కరిస్తున్న నాగేశ్వరరావు
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. లెఫ్ట్ పార్టిలు పట్టుబట్టినట్లు కాకుండా మధ్యేమార్గంగా చెరో రెండు స్థానాలను కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు, కొత్తగూడెం, మిర్యాలగూడ, భద్రాచలం, హుస్నాబాద్ స్థానాల్లో ఏవైనా నాలుగు స్థానాలను ఉభయ కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.
శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కమ్యూనిస్టులతో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం, హుస్నాబాద్‌లలో రెండు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, భద్రాచలం సీట్లు కేటాయించే అంశాన్ని పరిశీలించారు.
అయితే భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నందున దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఉభయ కమ్యూనిస్టులు సూచించిన వారికి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ చెప్పినట్లు సమాచారం. పొత్తుపై వేణుగోపాల్ నేరుగా కమ్యూనిస్టు పార్టిల పెద్దలతో ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర నేతలు ఆదివారం హైదరాబాద్‌లో లెఫ్ట్ పార్టిల నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాతే తుది నిర్ణయం చేసే అవకాశం ఉంది.
ఖమ్మం నుంచి తుమ్మల..పాలేరు నుంచి పొంగులేటి!
ఖమ్మం జిల్లా నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శనివారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాందీతో భేటీ అయ్యారు. సుమారు పది నిమిషాల పాటు జరిగిన సమావేశంలో కమ్యూనిస్టులతో పొత్తు వల్ల కలిసొచ్చే అంశాలపై చర్చించారు. కాగా పీలేరు నుంచి పోటీ చేయాలని తుమ్మల భావించినప్పటికీ రాహుల్ సూచన మేరకు ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment