సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆయా పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాలు ఇప్పటికీ సీట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. సీపీఐ, సీపీఎంలకు చెరి రెండేసి అసెంబ్లీ స్థానాలు, చెరో ఎమ్మెల్సీ ఇచ్చేలా అంగీకారం కుదిరింది.
సీపీఐ కొత్తగూడెం, మునుగోడు కోరుతుండగా, సీపీఎం మాత్రం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలను ప్రతిపాదించింది. సీపీఐకి కొత్తగూడెం స్థానం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన కాంగ్రెస్, మునుగోడుకు బదులు చెన్నూరు స్థానాన్ని ఇస్తామని తేల్చి చెప్పింది. అయితే చెన్నూరు తమకు వద్దని, మునుగోడు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతోంది.
ఒకటి మీరడిగేది.. రెండు మేమిచ్చేది తీసుకోండి
కాంగ్రెస్ మాత్రం ‘మీరడుగుతున్న రెండు స్థానాల్లో ఒకటి మీరు కోరుకున్న సీటు ఇస్తాం. మరోటి మేం ఇచ్చే సీటు తీసుకోవాలని’చెబుతోంది. దీంతో సీపీఐ కంగుతింది. ఇక సీపీఎం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే సూత్రాన్ని అమలు చేయనుంది. దీంతో కాంగ్రెస్ చెప్పిన ఏదో ఒక స్థానంలో పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు ఇచ్చేందుకు అంగీకరించిన కాంగ్రెస్, మరో స్థానం విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు.
పాలేరు నుంచి పొంగులేటి?
పొంగులేటి, తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయిలో ప్రముఖులుగా ఉన్నారు. దీంతో పొంగులేటికి పాలేరు, తుమ్మలకు ఖమ్మం స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు స్థానాన్ని సీపీఎంకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థానంలో సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా ఉండాలని భావిస్తున్నారు.
ఆ స్థానం ఇవ్వకుంటే పొత్తుకు సీపీఎం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. విచిత్రమేంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం కోరే సీట్లన్నీ కీలకమైనవే. గతంలో మధిర స్థానాన్ని కూడా సీపీఎం ప్రతిపాదించింది. ఆ స్థానంలో భట్టి విక్రమార్క అనేకసార్లు విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాలను సీపీఎం కోరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఏదిఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో లెఫ్ట్ సీట్ల వ్యవహారం ఉంది. పొత్తు అంశం త్వరగా కొలిక్కి రావాలని కామ్రేడ్లు వేచి చూస్తున్నారు.
భద్రాచలం ఇచ్చినా బాగుండేదంటున్న సీపీఎం...
సీపీఎం మాత్రం పాలేరు లేదా భద్రాచలం కోరింది. అయితే భద్రాచలంలో తమ అభ్యర్థిని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఎలా ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో ఇప్పుడు పాలేరు స్థానంపై సీపీఎం పట్టుబడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీనికి అంగీకరించే పరిస్థితులు కనిపించడంలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మూడు మాత్రమే జనరల్ స్థానాలు ఉండగా, మిగిలినవన్నీ రిజర్వుడు స్థానాలు.
ఈ నేపథ్యంలో జనరల్ స్థానాల్లో కొత్తగూడెంను సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో రెండు జనరల్ స్థానాలే మిగిలాయి. వాటిల్లో సీపీఎంకు పాలేరు ఇస్తే జనరల్ స్థానం ఖమ్మం ఒకటే మిగులుతుంది. కానీ ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు కీలకమైన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులకు టికెట్ ఇవ్వాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment