
అన్యాయాన్ని ఒప్పుకుంటే చెడుసంప్రదాయానికి తెరతీసినట్లే!
ఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో జాతీయ నేతలను కలిసి, తమ ఉద్యమానికి మద్దతు కోరుతున్నారు. అందులో భాగంగా ఆయన ఈ రోజు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ను కలిశారు. అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కారత్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
అసెంబ్లీ ఒప్పుకోకపోయినా పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టారన్నారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన తీరు అప్రజాస్వామికం అన్నారు. బిల్లును ప్రవేశపెట్టడానికి ఎవ్వరూ ఎస్, నో చెప్పకపోయినా, 10 సెకన్లలో అంతాకానిచ్చేశారని విమర్శించారు. ఈ అప్రజాస్వామిక తీరును తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు తమవంతు సహాయాన్ని అందిస్తామని కారత్ చెప్పినట్లు తెలిపారు. అందుకు కారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలవాల్సిన సమయం ఇదని చెప్పారు. ఒకవేళ ఈ అన్యాయాన్ని ఒప్పుకున్నట్లైతే ఒక చెడు సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని జగన్ హెచ్చరించారు.