మంగళవారం విశాఖలో ప్రారంభమైన సీపీఎం 21వ జాతీయ మహాసభల్లో ప్రసంగిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి కారత్. వేదికపై పార్టీ నేతలు
సీపీఎం జాతీయ మహాసభల్లో కారత్ ప్రారంభోపన్యాసం
మతవాదం విజృంభిస్తోంది.. లౌకిక వ్యవస్థకు చేటు
అవినీతి, మతోన్మాద శక్తుల ఆట కట్టించండి
వామపక్ష, ప్రజాతంత్ర శక్తులే ప్రత్యామ్నాయం
విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన సీపీఎం సభలు
హాజరైన వివిధ వామపక్ష పార్టీల నేతలు
(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
‘‘మిత, మతవాద శక్తులు విజృంభిస్తున్నాయి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలను చుట్టబెడుతున్నాయి. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు, భిన్నత్వంలో ఏకత్వానికి, లౌకిక వ్యవస్థకు చేటు తెస్తున్నాయి. అన్నింటా విధ్వంసం, అదే సర్వస్వం అంటున్న శక్తుల ఆట కట్టించాల్సిన తరుణం ఆసన్నమైంది. రండి, మాతో చేతులు కలపండి. నయా ఉదారవాద అవినీతి, మతోన్మాద శక్తుల ఆట కట్టించేందుకు ప్రజా పోరుకు కదలండి’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ దేశ ప్రజలకు పిలుపిచ్చారు. పార్టీ 21వ జాతీయ మహాసభలు మంగళవారమిక్కడి పోర్టు కళావాణి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సభల ప్రారంభ సూచకంగా పశ్చిమ బెంగాల్ పార్టీ సీనియర్ నేత మహమ్మద్ అమీల్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్లై అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకాశ్ కారత్ ప్రారంభోపన్యాసం చేశారు.
పోరుబిడ్డల నేలపై సభలు..
చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన తెలుగు బిడ్డలు పి.సుందరయ్య, ఎం.బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు పుట్టిన ఆంధ్రప్రదేశ్‌లో మహాసభను నిర్వహించుకుంటున్నామని కారత్ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల సంయుక్తాధ్వర్యంలో నడుస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతోందన్నారు. కార్పొరేట్ పారిశ్రామిక వేత్తలకు ఐదు శాతం సంపద పన్ను తగ్గించిన మోదీ ప్రభుత్వం.. కార్మికుల కనీస వేతనాలను మాత్రం విస్మరించిందని మండిపడ్డారు. మోదీ వచ్చిన ఏడాది కాలంలో బడా పెట్టుబడిదారుడైన గౌతం అదానీ ఆస్తులు రూ. 25వేల కోట్లకు పైగా పెరగడాన్ని ఉదహరిస్తూ.. ఇట్లాంటి వారే మోదీకి ఎన్నికల్లో అండగా నిలిచారని ధ్వజమెత్తారు. అమెరికాకు తలొగ్గి దేశీయ ఆర్థికవ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. గాడ్సే వారసులకు వంత పాడుతూ భారతీయ రాజ్యాంగ వ్యవస్థనే దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ముంచుకొస్తున్న ఈ ముప్పును అడ్డుకోవడమే ఈ మహాసభ ముందున్న కర్తవ్యంగా ప్రకటించారు. మహిళలు, ఆదివాసీలు, మైనారిటీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, పోలవరం వల్ల నిర్వాసితులయ్యే ఆదివాసీలకు అండగా ఉంటామన్నారు. దేశంలో నానాటికి పెరిగిపోతున్న అరాచకాలను ఆపగలిగేది వామపక్షాలేనని చెప్పారు.
ఆప్ విజయం ఆదర్శం: సురవరం
ప్రధాని స్వయంగా ప్రచారం చేసినా ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించిందని, ఆప్ విజయం నుంచి వామపక్షాలు పాఠాలు నేర్చుకోవాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. స్వతంత్రంగా ఎదుగుతూనే వామపక్ష శక్తుల ఐక్యత మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. అందరం కలుద్దామని, బలమైన ఉద్యమాన్ని నిర్మిద్దామని ఆయన చెప్పారు. ఇతర వామపక్ష పార్టీల నేతలు కూడా తమ సందేశాల్లో వామపక్ష శక్తుల ఐక్యతను ప్రధానంగా నొక్కిచెప్పారు. సౌహార్ధ్ర వామపక్ష ప్రతినిధులుగా హాజరైన సురవరం సుధాకర్‌రెడ్డితో పాటు దేబబ్రత బిశ్వాస్ (ఫార్వర్డ్‌బ్లాక్), అభనీరాయ్ (ఆర్‌ఎస్సీ), ప్రొవాష్ ఘోష్ (ఎస్‌యూసీఐ-సీ), కవితా కృష్ణన్ (సీపీఐ ఎంఎల్ లిబరేషన్) సందేశాలు ఇచ్చారు. ప్రారంభ సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బృందా కారత్, బీవీ రాఘవులు, బిమన్‌బసు, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు స్వాగతోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పుణ్యవతి, వీరయ్య, గఫూర్ తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. సభలకు హాజరైన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఫార్వర్డ్‌బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌పీ నాయకుడు జానకీరామ్ తదితరులు ఉన్నారు. మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ 35 దేశాల నుంచి వచ్చిన సందేశాలను సీతారాం ఏచూరి చదివి వినిపించారు.
ఆ ఎన్‌కౌంటర్లు రాజ్యహింసే
తెలుగు రాష్ట్రాల్లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మానవహక్కుల కార్యకర్త కవితా కృష్ణన్ ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలకు ఊడిగం చేస్తున్న పాలకులు పొట్టకూటి కోసం అడవుల్లో కట్టెలు కొట్టడానికి వెళ్లిన వారిపై స్మగ్లర్ల ముద్ర వేసి దారుణంగా 20 మందిని టీడీపీ ప్రభుత్వం కాల్చి చంపిందని విమర్శించారు. సీపీఎం సభల్లో సౌహార్ద్ర సందేశం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ఎన్‌కౌంటర్లను ఆమె ప్రస్తావించారు. కూలీల కాల్చివేతపై టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు కనీసం విచారం వ్యక్తం చేయలేదన్నారు. కాల్పులపై ప్రశ్నించినందుకు హక్కుల కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. కూలీల ఎన్‌కౌంటర్ రోజే తెలంగాణలోనూ ఐదుగురు యువకుల్ని కాల్చిచంపారని, అది పోలీసులు కావాలని చేశారా? అన్నట్లుగా ఉందన్నారు. ఈ రెండు సంఘటనలను వేర్వేరుగా చూడలేమని, ప్రభుత్వాల దమనకాండకు ఇవి నిదర్శనమన్నారు. ఇస్లాం ఫోబియా (భయం) పాలకుల్ని చుట్టుముట్టినట్టుందని, ఎన్‌కౌంటర్లపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని వివరించారు.
పోరుకుకదలండి
Published Wed, Apr 15 2015 2:37 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement