
హోదా ఉద్యమాలకు అండగా ఉంటాం
- అణు ఒప్పందాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి
- సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్
గుంటూరు వెస్ట్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జరిగే ఉద్యమాలకు తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారాత్ చెప్పారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం గుంటూరులో జరిగింది. సమావేశానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నాటి ప్రధాని ఏపీకి అనేక హామీలను ఇచ్చారని, వాటన్నింటినీ నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లయినా ఏపీకి ప్రత్యేక హోదాపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు.
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదాపై ఢిల్లీలో ఒకలా, ఏపీలో మరోలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మేధావులు, మైనార్టీలే లక్ష్యంగా దాడులు పెరిగియాని ఆందోళన వ్యక్తం చేశారు. పశు కళేబరాల తొలగింపును ఆపివేయాలని గుజరాత్‌లో దళితులు నిర్ణయం తీసుకోవడాన్ని తాము సమర్థిస్తున్నామన్నారు.
గుజరాత్ రాష్ట్రం కాదనుకున్న అణువిద్యుత్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఆహ్వానించడాన్ని తప్పుబట్టారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టిసారించినట్లు ప్రకాశ్‌కారాత్ తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.ఏ.గఫూర్, పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు పాల్గొన్నారు.