the special status
-
‘ప్రత్యేక హోదా’ కోసం భిక్షాటన
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం నగరంలో అర్ధనగ్నంగా భిక్షాటన చేశారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం మాట్లాడారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్యాకేజీ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్రమంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతోనే ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రత్యేకహోదా అంశాన్ని గట్టిగా అడగడం లేదని ఆరోపించారు. హోదా వల్ల లాభం లేదని అంటున్నారని.. మరి ఎన్నికల ముందు ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్రం వద్ద తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారన్నారు. విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శులు సుధీర్‌రెడ్డి, పెద్దన్న, రాఘవేంద్రరెడ్డి, రాజునాయక్, నాయకులు రాఘవేంద్ర, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
హోదాపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో తిరిగి వస్తే కృష్ణా నదిలో ముంచి లేపి సన్మానం చేస్తామని, ఖాళీ చేతులతో వస్తే గుండు కొట్టించి ఊరేగించడానికి కూడా జనం వెనుకాడరని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి నారాయణ విజయవాడలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. రెండేళ్లు గడిచినా రాష్ట్రానికి ఏ ఒక్క విభజన హామీ అమలు చేయని బీజేపీ, హోదా సాధించలేని టీడీపీ ఇప్పుడు ప్యాకేజీ అంటూ నాటకాలు అడుతున్నాయని విమర్శించారు. విభజన చట్టంలో హోదా గురించి ప్రస్తావించలేదని, 14వ ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డు వస్తున్నాయని పార్లమెంటులో ఆరుణ్‌జైట్లీ ప్రస్తావించడం దారుణమన్నారు. అవేమైనా దైవాంశ సంభూతమా అని ప్రశ్నించారు. చట్టాలు చేసిన పార్లమెంటు ఆయా చట్టాల్లో మార్పులు చేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని అన్నారు. పార్లమెంటు లోపల, బయట 1 1రాజకీయ పార్టీలు ఏపీ హోదాకు మద్దతు పలకడంతో టీడీపీకి పుట్టగతులు ఉండవనే భయంతోనే తప్పనిసరై చంద్రబాబు తన వాయిస్ విన్పించారన్నారు. చంద్రబాబుకు నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే కలిసి వచ్చే అన్ని పార్టీలతో ఢిల్లీ తీసుకెళ్లి ప్రధానిపై వత్తిడి తెచ్చి హోదా సాధించాలన్నారు. బాబు ఒక్కడే వెళ్లి మోదీ చెవిలో గుసగుసలు చెప్పి వచ్చేస్తే బీజేపీ కంటే టీడీపీయే రాష్ట్ర ప్రజలను ఎక్కువ ద్రోహం చేసినట్టు అవుతుందని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు తరచు ఢిల్లీ వెళ్లి మోదీ చెవిలో గుసగుసలు చెప్పి వస్తున్నారని, వీళ్లిధ్దరు వెళ్లినప్పుడు ప్రధాని చెవుల్లో దూది పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయకపోతే బీజేపీ, టీడీపీ ఆడుతున్న వీధి నాటకాలను ప్రజలకు వివరించి వారి రహస్య ఎజెండాను బయటపెడతామన్నారు. -
హోదా ఉద్యమాలకు అండగా ఉంటాం
- అణు ఒప్పందాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి - సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్ గుంటూరు వెస్ట్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జరిగే ఉద్యమాలకు తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారాత్ చెప్పారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం గుంటూరులో జరిగింది. సమావేశానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నాటి ప్రధాని ఏపీకి అనేక హామీలను ఇచ్చారని, వాటన్నింటినీ నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లయినా ఏపీకి ప్రత్యేక హోదాపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదాపై ఢిల్లీలో ఒకలా, ఏపీలో మరోలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మేధావులు, మైనార్టీలే లక్ష్యంగా దాడులు పెరిగియాని ఆందోళన వ్యక్తం చేశారు. పశు కళేబరాల తొలగింపును ఆపివేయాలని గుజరాత్లో దళితులు నిర్ణయం తీసుకోవడాన్ని తాము సమర్థిస్తున్నామన్నారు. గుజరాత్ రాష్ట్రం కాదనుకున్న అణువిద్యుత్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఆహ్వానించడాన్ని తప్పుబట్టారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టిసారించినట్లు ప్రకాశ్‌కారాత్ తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.ఏ.గఫూర్, పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు పాల్గొన్నారు. -
టీడీపీ, బీజేపీ నేతలను కదలనివ్వరు
-
టీడీపీ, బీజేపీ నేతలను కదలనివ్వరు
-ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విజయవాడ సెంట్రల్ ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్ జరపకుంటే టీడీపీ, బీజేపీ నాయకులు ఇళ్ల నుంచి బయటకు కదల్లేరని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన విద్రోహ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హోదా విషయంలో బీజేపీ, టీడీపీ నాటకాలాడుతోందని, దీనిపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఆయా పార్టీల నేతలను ఇళ్లల్లోంచి బయటకు రాకుండా అడ్డుకుంటారని చెప్పారు. ప్రత్యేకహోదా సంజీవని కాదన్న చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఇప్పుడు ద్రవ్యబిల్లు పేరుతో ఓటింగ్ జరపకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఏ బిల్లో తెలియకుండానే రాష్ట్రపతి సంతకం పెట్టారా, రాజ్యసభలో చర్చ జరిపారా అని ప్రశ్నించారు. ఓటింగ్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీతో బిల్లును నెగ్గిస్తామన్నారు. ఈ మేరకు 11 పార్టీల మద్దతు కూడగట్టినట్లు పేర్కొన్నారు. బిల్లును నెగ్గించలేకుంటే ఆందోళనలు కట్టిపెట్టి మూడేళ్లపాటు తాము (కాంగ్రెస్) ఇళ్లకే పరిమితం అవుతామని, ఓటింగ్ జరగకపోతే చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. ప్రత్యేకహోదా సాధన కోసం తాను ఢిల్లీ వెళ్ళనని చెప్పిన బాబుకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. ఓటకు నోటు కేసులో మోదీకి భయపడే బాబు ఢిల్లీకి వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్యను మరో 50కి పెంచాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్న బాబు ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల సంఖ్య పెంచకుంటే ప్రతిపక్ష పార్టీ నుంచి టీడీపీ చేరిన ప్రజాప్రతినిధులు చంద్రబాబుకు గోచీ కూడా లేకుండా కొడతారని చురకలు వేశారు. జపాన్ తరహా నిరసనలు చంద్రబాబు చెప్పినట్టే ప్రత్యేకహోదా సాధనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జపాన్ తరహాలో నిరసనలు చేస్తుందని రఘువీరా స్పష్టం చేశారు. ఇందుకోసం జపాన్ నుంచి చీపుర్లు తెప్పిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు, వెంకయ్య, సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు ఇళ్ల ముందు ఊడ్చి శుభ్రం చేస్తామన్నారు. వారు అంగీకరిస్తే బాత్రూంలు కడుగుతామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన చేస్తామని, ఢిల్లీకి వెళ్లి మరోమారు మద్దతు కూడగట్టనున్నట్లు వెల్లడించారు. 5వ తేదీలోపు కార్యక్రమాలన్నింటినీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తిరువానక్కరసు, కేంద్ర,రాష్ట్ర మాజీ మంత్రులు పాల్గొన్నారు. -
ఆయన వల్లే ప్రత్యేకహోదా దూరం: సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి వైఖరి వల్లే రెండేళ్లుగా ప్రత్యేక హోదా దూరమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతోన్న బంద్‌లో టీడీపీ కూడా పాల్గొనాలని డిమాండ్‌చేశారు. ఎన్నికలలో మోదీకి అనుకూలంగా ప్రచారం చేసిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రత్యేక హోదా అంశానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి పదవి కోసం వెంకయ్యనాయుడు ప్రాకులాడుతున్నారని విమర్శించారు. మోదీ జపం చేసిన పవన్ కల్యాణ్ ఇప్పటికైనా నోరు తెరవాలని, లేనిపక్షంలో ప్రజాద్రోహిగా మిగిలిపోతారని అన్నారు. -
తీర్మానం చేస్తే సరిపోదు : విశ్వేశ్వరరెడ్డి
ప్రత్యేక హోదాపై కేవలం తీర్మానం చేస్తే సరిపోదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయాన్ని కూడా తీర్మానంలో పొందుపరిస్తే బాగుండేదని అభిప్రయపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో పోరాడి.. విభజన హామీలను సాధించుకోవాలని.. అడుక్కుంటే మాత్రం హామీలు నెరవేరవని అన్నారు. -
'కోట్లు, కోటలు, కేసులతో సీఎం బిజీ'
కోట్లు, కోటలు, కేసులతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా మారిపోయారని.. ప్రభుత్వ ఖజానా లూటీ అవుతున్నా పట్టించుకునే స్థితిలో లేరని సీపీఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదన్నారు. అభివృద్ధి కుంటు పడిందని పేర్కొన్నారు. కేసుల్లోంచి బయట పడేందుకే.. ప్రత్యేక హోదాపై కేంద్రం వద్ద మెతక వైఖరి అవలంబిస్తున్నారని.. ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో డిసెంబర్ 7న సీపీఐ భారీ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. తమ ధర్నా కార్యక్రమానికి తెలుగు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.