హోదాపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో తిరిగి వస్తే కృష్ణా నదిలో ముంచి లేపి సన్మానం చేస్తామని, ఖాళీ చేతులతో వస్తే గుండు కొట్టించి ఊరేగించడానికి కూడా జనం వెనుకాడరని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి నారాయణ విజయవాడలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
రెండేళ్లు గడిచినా రాష్ట్రానికి ఏ ఒక్క విభజన హామీ అమలు చేయని బీజేపీ, హోదా సాధించలేని టీడీపీ ఇప్పుడు ప్యాకేజీ అంటూ నాటకాలు అడుతున్నాయని విమర్శించారు. విభజన చట్టంలో హోదా గురించి ప్రస్తావించలేదని, 14వ ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డు వస్తున్నాయని పార్లమెంటులో ఆరుణ్‌జైట్లీ ప్రస్తావించడం దారుణమన్నారు. అవేమైనా దైవాంశ సంభూతమా అని ప్రశ్నించారు. చట్టాలు చేసిన పార్లమెంటు ఆయా చట్టాల్లో మార్పులు చేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని అన్నారు. పార్లమెంటు లోపల, బయట 1 1రాజకీయ పార్టీలు ఏపీ హోదాకు మద్దతు పలకడంతో టీడీపీకి పుట్టగతులు ఉండవనే భయంతోనే తప్పనిసరై చంద్రబాబు తన వాయిస్ విన్పించారన్నారు.
చంద్రబాబుకు నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే కలిసి వచ్చే అన్ని పార్టీలతో ఢిల్లీ తీసుకెళ్లి ప్రధానిపై వత్తిడి తెచ్చి హోదా సాధించాలన్నారు. బాబు ఒక్కడే వెళ్లి మోదీ చెవిలో గుసగుసలు చెప్పి వచ్చేస్తే బీజేపీ కంటే టీడీపీయే రాష్ట్ర ప్రజలను ఎక్కువ ద్రోహం చేసినట్టు అవుతుందని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు తరచు ఢిల్లీ వెళ్లి మోదీ చెవిలో గుసగుసలు చెప్పి వస్తున్నారని, వీళ్లిధ్దరు వెళ్లినప్పుడు ప్రధాని చెవుల్లో దూది పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయకపోతే బీజేపీ, టీడీపీ ఆడుతున్న వీధి నాటకాలను ప్రజలకు వివరించి వారి రహస్య ఎజెండాను బయటపెడతామన్నారు.