
టీడీపీ, బీజేపీ నేతలను కదలనివ్వరు
-ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి
విజయవాడ సెంట్రల్
ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్ జరపకుంటే టీడీపీ, బీజేపీ నాయకులు ఇళ్ల నుంచి బయటకు కదల్లేరని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన విద్రోహ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హోదా విషయంలో బీజేపీ, టీడీపీ నాటకాలాడుతోందని, దీనిపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఆయా పార్టీల నేతలను ఇళ్లల్లోంచి బయటకు రాకుండా అడ్డుకుంటారని చెప్పారు. ప్రత్యేకహోదా సంజీవని కాదన్న చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఇప్పుడు ద్రవ్యబిల్లు పేరుతో ఓటింగ్ జరపకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఏ బిల్లో తెలియకుండానే రాష్ట్రపతి సంతకం పెట్టారా, రాజ్యసభలో చర్చ జరిపారా అని ప్రశ్నించారు. ఓటింగ్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీతో బిల్లును నెగ్గిస్తామన్నారు. ఈ మేరకు 11 పార్టీల మద్దతు కూడగట్టినట్లు పేర్కొన్నారు. బిల్లును నెగ్గించలేకుంటే ఆందోళనలు కట్టిపెట్టి మూడేళ్లపాటు తాము (కాంగ్రెస్) ఇళ్లకే పరిమితం అవుతామని, ఓటింగ్ జరగకపోతే చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. ప్రత్యేకహోదా సాధన కోసం తాను ఢిల్లీ వెళ్ళనని చెప్పిన బాబుకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. ఓటకు నోటు కేసులో మోదీకి భయపడే బాబు ఢిల్లీకి వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్యను మరో 50కి పెంచాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్న బాబు ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల సంఖ్య పెంచకుంటే ప్రతిపక్ష పార్టీ నుంచి టీడీపీ చేరిన ప్రజాప్రతినిధులు చంద్రబాబుకు గోచీ కూడా లేకుండా కొడతారని చురకలు వేశారు.
జపాన్ తరహా నిరసనలు
చంద్రబాబు చెప్పినట్టే ప్రత్యేకహోదా సాధనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జపాన్ తరహాలో నిరసనలు చేస్తుందని రఘువీరా స్పష్టం చేశారు. ఇందుకోసం జపాన్ నుంచి చీపుర్లు తెప్పిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు, వెంకయ్య, సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు ఇళ్ల ముందు ఊడ్చి శుభ్రం చేస్తామన్నారు. వారు అంగీకరిస్తే బాత్‌రూంలు కడుగుతామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన చేస్తామని, ఢిల్లీకి వెళ్లి మరోమారు మద్దతు కూడగట్టనున్నట్లు వెల్లడించారు. 5వ తేదీలోపు కార్యక్రమాలన్నింటినీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తిరువానక్కరసు, కేంద్ర,రాష్ట్ర మాజీ మంత్రులు పాల్గొన్నారు.