అనంతలో భిక్షాటన చేస్తున్న వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు
అనంతపురం ఎడ్యుకేషన్ :
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం నగరంలో అర్ధనగ్నంగా భిక్షాటన చేశారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం మాట్లాడారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్యాకేజీ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
కేంద్రమంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతోనే ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రత్యేకహోదా అంశాన్ని గట్టిగా అడగడం లేదని ఆరోపించారు. హోదా వల్ల లాభం లేదని అంటున్నారని.. మరి ఎన్నికల ముందు ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్రం వద్ద తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారన్నారు.
విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శులు సుధీర్‌రెడ్డి, పెద్దన్న, రాఘవేంద్రరెడ్డి, రాజునాయక్, నాయకులు రాఘవేంద్ర, సునీల్ తదితరులు పాల్గొన్నారు.