Bhiksatana
-
‘ప్రత్యేక హోదా’ కోసం భిక్షాటన
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం నగరంలో అర్ధనగ్నంగా భిక్షాటన చేశారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం మాట్లాడారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్యాకేజీ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్రమంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతోనే ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రత్యేకహోదా అంశాన్ని గట్టిగా అడగడం లేదని ఆరోపించారు. హోదా వల్ల లాభం లేదని అంటున్నారని.. మరి ఎన్నికల ముందు ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్రం వద్ద తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారన్నారు. విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శులు సుధీర్‌రెడ్డి, పెద్దన్న, రాఘవేంద్రరెడ్డి, రాజునాయక్, నాయకులు రాఘవేంద్ర, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిపోతున్న బాల యాచకులు
పట్టించుకోని అధికారులు మెదక్: బాల యాచకుల సంఖ్య మెదక్ పట్టణంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. అయినా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కళ్లముందే బాలయాచకులు బడికి వెళ్లకుండా భిక్షాటన చేస్తున్నా పట్టించుకునే వారే లేరు. తల్లిదండ్రులకు సైతం ఆ పూట గడుస్తుండటంతో అదే గొప్ప అనుకుంటున్నారు. మెదక్ పట్టణంలోని గాంధీనగర్, నర్షిఖేడ్, తదితర ప్రాంతాల్లో బాలయాచకుల సంఖ్య అధిక సంఖ్యలో ఉంది. కాగా అధికారులు ఇప్పటికైనా స్పందించి బడీడు పిల్లలైన బాలయాచకులను బడిలో చేర్పిస్తే వారి భవిష్యత్తు బాగుపడుతుంది. -
కనికరం లేని కొడుకులు
ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చాడు.. కడుపుకట్టుకుని పెంచి పెద్దచేశాడు.. సంపాదించిన ఆస్తిపాస్తులూ సమానంగానే పంచిపెట్టాడు.. బిడ్డలపై భారం కాకూడదని సొంతంగానే బతకడం నేర్చుకున్నాడు.. వయసు మీదపడింది.. బతుకు భారమైపోయింది.. భిక్షమెత్తినా భుక్తి దొరకడం గగనమైపోయింది.. అవసాన దశలో కన్నబిడ్డల చెంతే కన్నుమూయాలనుకున్నాడు.. కానీ కనికరం లేని ఆ కుమారులు రక్తం పంచి ఇచ్చిన తండ్రినే వద్దనుకున్నారు.. నిర్ధాక్షణ్యంగా రైల్వేస్టేషన్లో వదిలివెళ్లిపోయారు.. ఈ ఘటన కలికిరిలో ఆదివారం సంచలనం రేపింది. కలికిరి:కలికిరి పట్టణం అమరనాధరెడ్డి కాలనీలో వున్న కాములూరి బాషా(60)కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. కొడుకుల్లో ఒకరు ఆర్టీసీబస్టాండ్ సమీపంలో టీస్టాల్ నడుపుతున్నాడు. మరొకరు తిమ్మారెడ్డి కాంప్లెక్స్‌కు ఎదురుగా బజ్జీలకొట్టు పెట్టుకున్నాడు. ఇంకో కుమారుడు సౌదీలో ఉంటున్నాడు. అందరూ ఆర్థికంగా స్థిరపడ్డా తండ్రిని పట్టించుకోక వదిలేశారు. చేసేదిలేక బాషా బెంగుళూరుకు వెళ్లిపోయాడు. భిక్షాటన చేసుకుంటూ అక్కడ ఐదేళ్లు జీవించాడు. చివరి రోజుల్లో బిడ్డలను చూసి వారివద్ద తనువు చాలించాలనుకున్నాడు. రెండు రోజుల క్రితం కలికిరికి వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడిని కుమారులిద్దరూ రైల్వేస్టేషన్లో వదిలి చేతులు దులుపుకున్నారు. స్థానికులు గుర్తించి ఆదివారం రాత్రి ఎస్ఐ పురుషోత్తరెడ్డికి సమాచారమందించారు. ఎస్ బాషా కుమారులతో మాట్లాడినా వారు స్పందించకపోవడంతో వృద్ధుడిని స్టేషన్‌వద్దకు తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవసాన దశలో ఇంటికి వచ్చిన తండ్రిని వదిలించుకోవాలనుకున్న వారిపై స్థానికులు మండిపడుతున్నారు.