► సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ విమర్శ
నెల్లూరు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు, మన ప్రధాని మోదీ విధానాలకు తేడా లేదని, ఇద్దరి పాలన ఒకే విధంగా ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ విమర్శించారు. అమెరికాలో ఇతర దేశాల వారిపై ట్రంప్ దురుసుగా ప్రవర్తిస్తుంటే, ఇక్కడ ముస్లింలపై దురుసు ప్రవర్తన ఉందన్నారు. గత ఎన్నికల ముందు కార్పొరేట్ సంస్థలు మోదీని భుజానికి ఎత్తుకున్నాయని, ఇప్పుడు ఆ కార్పొరేట్ సంస్థలకే మోదీ మేలు చేస్తున్నారని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో దేశంలో ఒక్క శాతం కూడా ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవన్నారు. మేక్ ఇన్ ఇండియాలో ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో చెప్పాలన్నారు. దేశంలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో ఉందన్నారు. దాదాపు 14వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఉపాధి హామీ పథకం 45 రోజులకు మించి జరగడంలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో కలసి ప్రధాని మోదీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని కారత్ విమర్శించారు. ఇటీవల దేశంలో జంతువధపై నిషేధం విధించడాన్ని పలువులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. హిందువులు కూడా గోమాంసాన్ని తింటారని, ఆవులను పూజించుకుంటూ పోతే ఎలా బతకాలని ప్రశ్నించారు.
ట్రంప్‌కు, మోదీకి తేడా లేదు
Published Mon, May 29 2017 7:16 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
Advertisement