
న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న అమెరికా ఇంటెలిజెన్సీ చీఫ్ తుల్సీ గబ్బార్డ్.. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో సమావేశమయ్యారు. తొలుత రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన ఆమె.. ఆ తర్వాత మోదీతో భేటీ అయ్యారు. తుల్సీ గబ్బార్డ్ తో సమావేశం సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ పలు అంతర్జాతీయ సమస్యలపై మాట్లాడారు. ప్రధానంగా ఖలిస్థానీ ఉగ్రవాదంపై రాజ్ నాథ్ సింగ్ చర్చించారు. ఖలిస్థానీ ఉగ్రసంస్థ ఎస్ఎఫ్ జే(సిక్కు ఫర్ జస్టిస్) తో పాటు దాని వ్యవస్థాపకుడు గురపత్వంత్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని రాజ్ నాథ్ సింగ్ కోరారు.
ట్రంప్, మోదీల లక్ష్యం ఒక్కటే..
అయితే ప్రధాని మోదీతో భేటీలో ఉగ్రవాదంపై ప్రధానంగా చర్చించారు తుల్సీ గబ్బార్డ్. ఇదే విషయాన్ని మోదీతో సమావేశం అనంతరం ఆమె వెల్లడించారు. ఉగ్రవాదంపై మోదీ చాలా సీరియస్ గా ఉన్నారన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉగ్రవాదాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో ఉన్నారని ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్య్వూలో తుల్సీ గబ్బార్డ్ స్పష్టం చేశారు.
‘మా అధ్యక్షుడు ట్రంప్ చాలా క్లియర్ గా ఉన్నారు. ఉగ్రవాద నిర్మూలనే ఆయన లక్ష్యం. ఉగ్రవాదం ఇప్పుడు మాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికన్ ప్రజలకు ఉగ్రవాదుల నుంచి నేరుగా బెదిరింపులు వస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. మేము ఉగ్రవాదం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం. దీనిపై మోదీ ఎంత సీరియస్ గా ఉన్నారో.. మా అధ్యక్షుడు ట్రంప్ కూడా అంతే కమిట్మెంట్ తో ఉన్నారు.
భారత్ లో ఉగ్రవాద సమస్య ఎలా ఉందో తాము చూస్తూనే ఉన్నామని, అలాగే బంగ్లాదేవ్, ప్రస్తుతం సిరియాలో, ఇజ్రాయిల్ ఇలా చాలా దేశాల్లో పలు రకాలైన ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇది నిజంగా చాలా ముప్పు. ఇక్కడ దేశాలు కలిసి పని చేస్తే వారు ఎక్కడ ఉన్నారో పసిగట్టి దానిని శాశ్వతంగా నిర్మూలించే అవకాశం ఉంటుంది’ అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment