పేదరికం ఉన్నంతకాలం పోరు!
- సాక్షితో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్
సాక్షి, హైదరాబాద్: ‘‘సమాజంలో పేదరికం, అసమానతలు ఉన్నంతకాలం మా పోరాటం ఉంటుంది. మేం ఔనన్నా కాదన్నా మా బలం తగ్గినమాట నిజం. అంతమాత్రాన కనుమరుగైనట్టు కాదు. గత 25 ఏళ్లలో జరిగిన తప్పొప్పులేమిటో గుర్తించాం. వచ్చే మహాసభల్లో చర్చించబోతున్నాం. గతకాలపు అనుభవాల పునాదులపై భవిష్యత్‌ను నిర్మించబోతున్నాం..’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు. పార్టీ 21వ జాతీయ మహాసభలు విశాఖపట్నంలో మంగళవారం నుంచి జరగనున్నాయి.
ఈ సందర్భంగా ‘సాక్షి’కిచ్చిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వివరించారు. ప్రాంతీయ బూర్జువా పార్టీలతో జాతీయస్థాయి పొత్తులు, ఎత్తులు ఉండవని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ లౌకికత్వాన్ని సమర్థిస్తున్నా అది కూడా బూర్జువా పార్టీయేనని, నయా ఉదారవాద ఆర్థిక విధానాలను పాటించే పార్టీయేనని అన్నారు. తమ పార్టీ పునాదుల్ని పటిష్టం చేసుకుని సొంతకాళ్లపై ఎదుగుతూ వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల్ని ఏకం చేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీల విలీనం తమ ఎజెండాలో లేదన్నారు. ఇంటర్వ్యూలో కారత్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రాంతీయ పార్టీల పాత్ర..
ప్రపంచీకరణ, నయా ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావం ప్రాంతీయ పార్టీలపైనా ఉంది. ప్రధానమైన ప్రాంతీయపార్టీలపై భూస్వాములు, సంపన్న రైతులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల పట్టు పెరిగింది. దీంతో ఈ పార్టీల పుట్టుక సమయంలో ఉన్న ప్రాధమ్యాలకు, ఇప్పటికి తేడా వచ్చింది. అవి వాటి అవసరాలకోసం పట్టుబడుతున్నాయేతప్ప జాతీయస్థాయి ప్రయోజనాలపై దృష్టి పెట్టట్లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఒడిశా, యూపీ వంటి రాష్ట్రాలలో సుదీర్ఘకాలం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నాం. ఈ అనుభవాలతో మూడో ప్రత్యామ్నాయం, జాతీయ ప్రత్యామ్నాయం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.
సొంతంగా పెరగడమే మార్గం...
ఈ నేపథ్యంలో పార్టీని స్వతంత్రంగా పటిష్టం చేసుకోవడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించాం. బహుముఖ సమస్యలపై విస్తృత పోరాటాలు చేయడమే ఇందుకున్న మార్గం. దీంతోపాటు ప్రజల తక్షణ సమస్యలపై ఇతర రాజకీయ, ప్రజాతంత్ర శక్తులతో కలసి పోరాటాలు చేయాలి.
ప్రస్తుతం మా దృష్టంతా సొంతంగా ఎదగడంపైనే. మేము పెరుగుతూ ఇతర వామపక్ష పార్టీలతో కలసి ఐక్య పోరాటాలు చేస్తాం. విలీనం మా ఎజెండాలో లేదు. అవసరమైనప్పుడు చర్చిస్తాం.
దేశ లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పు ముంచుకొస్తోంది. భావస్వేచ్ఛపై దాడి ఎక్కువైంది. మోదీ ప్రభుత్వ నిర్ణయాలను ఎదుర్కోవడానికి లౌకిక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌తోనైనా కలసి పనిచేస్తాం. అంతవరకే అది పరిమితం.
నా పదవీకాలం ముగిసింది...
పార్టీ నిబంధనావళి ప్రకారం నేనిక ప్రధాన కార్యదర్శిగా ఉండలేను. మహాసభ నూతన కమిటీని, ప్రధాన కార్యదర్శిని, పొలిట్‌బ్యూరోను ఎన్నుకుంటుంది. అది ఈ నెల 19న జరుగుతుంది.
మా ముందున్న సవాళ్లు..
మా బలం తగ్గింది. ఇది నిష్టుర సత్యం. బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకుని సొంత బలాన్ని కోల్పోయామని పార్టీకి చెందిన కొన్ని రాష్ట్ర శాఖలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో గత పాతికేళ్లలో మేము అనుసరించిన రాజకీయ, ఎత్తుగడల పంథాను పునస్సమీక్షించుకోవాల్సిన అవసరమేర్పడింది. అంతేకాదు.. పార్టీ అనుబంధ సంఘాల సభ్యులను మా రాజకీయ విధానంవైపు ఆకర్షించలేకపోవడం, ఓట్లుగా మలుచుకోలేకపోవడంతోపాటు సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావాన్ని గుర్తించడంలోనూ ఒడిదుడుకులున్నాయి. వచ్చే మహాసభల్లో వీటిని సవరించుకుని ఎత్తుగడల పంథాను ఖరారు చేసుకోవాల్సి ఉంది. గతానికి భిన్నంగా ఈ మహాసభల్లో తొలిసారి రాజకీయ, ఎత్తుగడల పంథాను చర్చించబోతున్నాం. 1988-89లో తిరువనంతపురంలో జరిగిన 13వ మహాసభలో ఆమోదించిన రాజకీయ ఎత్తుగడల పంథాను సమీక్షించబోతున్నాం.
మూడు రాష్ట్రాలకేపరిమితమయ్యాం...
పార్టీకి భారీగా సభ్యత్వం ఉన్నప్పటికీ అది కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాలకే పరిమితమైంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో సభ్యత్వం పెరిగి నప్పటికీ రాజకీయ ప్రభావాన్ని చూపలేకపోయింది. దీన్నిబట్టి మా ఎత్తుగడల పంథాలో లోపం ఉందని తేలింది. దిద్దుబాటు చర్యలు చేపట్టాం.