
‘జనతా’పక్షాలు ఏకమైతే విపక్షం బలం
పాట్నా: ఒకప్పటి జనతా పరివార్ భాగస్వామ్య పక్షాలు మళ్లీ ఒక్కటయ్యేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ హర్షం వ్యక్తంచేశారు. బీజేపీని ఎదుర్కొనడానికి జరుగుతున్న ఈ పరిణామాలు ఆహ్వానించదగ్గవని, పార్లమెంటులో వామపక్షాలు కూడా ఈ పార్టీలతో సమన్వయంతో పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ ఈ భాగస్వామ్య పక్షాలు ఒక్కటైతే పార్లమెంటులో విపక్షాల బలం పెరుగుతుందని అన్నారు. అయితే ఈ పార్టీలు ప్రస్తుతం ఎలాంటి విధానాలు అవలంభిస్తాయన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అన్నారు.
ఆ తర్వాతే పూర్తిస్థాయిలో వారికి మద్దతు తెలిపే అంశంపై వామపక్షాలు ఒక నిర్ణయానికి వస్తాయని తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆయన మండిపడ్డారు. పేద ప్రజలకు మేలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోతపెట్టడం సరికాదని అన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు. త్రిపుర రాష్ట్రంలో ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని, జాతీయ సగటు ప్రకారం ఇతర ప్రాంతాల్లో 45 రోజులే పనిదొరుకుతుండగా, ఆ రాష్ట్రంలో గ్రామీణ పేదలకు 88 రోజులపాటు ఉపాధి లభిస్తోందని ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ తీసుకురావాలని భావిస్తున్న కార్మిక సంస్కరణల ప్రకారం పరిశ్రమల్లో పెద్ద ఎత్తున కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 26న దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సర్కారు వైఫల్యం వల్లే జాతీయ స్థాయిలో బీజేపీ బలపడిందని కారత్ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.